Special Story On Undersea Volcanoes Impact On Human Population In Telugu - Sakshi
Sakshi News home page

ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?

Published Sun, Aug 28 2022 4:39 AM | Last Updated on Sun, Aug 28 2022 10:06 AM

Undersea volcanoes are a threat to humanity special story - Sakshi

సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్‌ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్‌ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది.

అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్‌హెగన్‌లో ఉన్న నీల్స్‌ బోర్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్‌ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్‌హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జిస్టు మైకేల్‌ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం.

హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు.  

అప్పట్లో అపార నష్టం
‘7 మాగ్నిట్యూడ్‌’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా  సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది.

మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు.

‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement