శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ | 2 women naval officers set sail | Sakshi
Sakshi News home page

శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ

Oct 9 2024 6:16 AM | Updated on Oct 9 2024 6:16 AM

2 women naval officers set sail

ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు  దిల్నా, రూపా అక్టోబర్‌ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!

‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్‌ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్‌ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్‌ఎస్‌వి తారిణి పేరున్న సెయిల్‌ బోట్‌లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.

ఐదు అంచెల యాత్ర
యాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్‌ బోట్‌ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు  తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్‌ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్‌ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. 

గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్‌ 3. న్యూజిల్యాండ్‌ నుంచి ఫాక్‌ల్యాండ్‌ ఐలాండ్స్‌ (దక్షిణ పసిఫిక్‌ సముద్రం) 4.ఫాక్‌ల్యాండ్‌ నుంచి సౌత్‌ ఆఫ్రికా 5. సౌత్‌ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్‌ కమాండర్‌ రూపా సారథ్యం వహిస్తున్నారు.

మైక్రోప్లాస్టిక్స్‌పై పరిశోధన
‘నావికా సాగర్‌ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్‌ ముందు భాగంలో మాస్ట్‌సెయిల్స్‌ ఉంటాయి.

వెనుక భాగంలో రెండు స్టీరింగ్‌ వీల్స్, ఆటో పైలట్‌ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్‌ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్‌వో ప్లాంట్‌ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్‌ సిస్టం సైతం బోట్‌లో ఉన్నాయి. బోట్‌ తయారీలో అధికభాగం ఫైబర్‌ గ్లాస్‌ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్‌ విధానం ద్వారా ట్రాక్‌ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.

సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో 
‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్‌పాన్‌ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్‌సాగన్‌ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్‌ కమాండర్‌ రూపా ఈ సందర్భంగా.

అమ్మ చేసిన ఊరగాయలతో
‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్‌ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్‌ చిప్స్, టాపియోకా చిప్స్‌ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్‌ రాజా, సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement