సముద్రంలో 'అసాధారణ శౌర్యం'!
న్యూఢిల్లీః
ఆమె ధైర్య సాహసాలు ప్రపంచదృష్టినే ఆకట్టుకున్నాయి. భారత షిప్పింగ్ కార్పొరేషన్ అధికారంలోని 'సంపూర్ణ స్వరాజ్య' ఆయిల్ ట్యాంకర్ హెల్మ్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె.. సముద్రంలో ప్రదర్శించిన ఆసాధారణ సాహసాన్ని, శౌర్యాన్ని గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్... ఆమెను అవార్డుతో సత్కరించనుంది. దీంతో రాధికా మీనన్ ప్రపంచంలోనే సముద్ర శౌర్యానికి అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ కానుంది.
మునిగిపోతున్న పడవనుంచీ ఏడుగురు జాలర్ల జీవితాలను రక్షించి, ఒడ్డుకు చేర్చిన అత్యంత శౌర్యశాలిగా రాధికా మీనన్ ను ఇంటర్నేషనల్ మారిటైం గుర్తించింది. ఐదేళ్ళ క్రితం ఇండియన్ మర్చంట్ నేవీ లో మొదటి మహిళా కెప్టెన్ గా గుర్తింపు పొందిన మీనన్.. ఇప్పుడు ప్రపంచంలోనే సముద్రంలో శౌర్యాన్ని ప్రదర్శించిన మొదటి మహిళగా అవార్డు అందుకోనుంది. గతేడాది జూన్ సమయంలో ఉన్నట్లుండి వచ్చిన తుఫానుతో సముద్రంలో ఏడుగురు జాలర్లతో చేపల వేటకు వెళ్ళిన 'దుర్గమ్మా' అనే ఫిషింగ్ బోట్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ వైపు వెళ్ళిన పడవ.. సముద్రంలో మునిగిపోతుండటాన్ని రాధికా మీనన్ బృందం గుర్తించింది.
అప్పటికే జాలర్లంతా చనిపోయి ఉండొచ్చని భావించిన వారి కుటుంబ సభ్యులు ఏకంగా వారి అంతిమ సంస్కారాలకు సైంతం సిద్ధమైపోయారు. అదే సమయంలో సముద్రంలోని నేవీ బృందం అద్భుతంగా వారిని రక్షించినట్లు వినిపించిన వార్త.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సంపూర్ణ స్వరాజ్య ఆయిల్ ట్యాంకర్ నావికురాలుగా పనిచేస్తున్న కేరళ కొడుంగల్లూర్ కు చెందిన మీనన్.. తనకు అందిన గౌరవానికి, గుర్తింపునకు ఈ మెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ఓ నావికురాలుగా, ఓడలోని నావికులకు గురువుగా ఉంటూ సముద్రంలో మునిగిపోతున్నవారి జీవితాలను రక్షించడం తన బాధ్యత, విధి నిర్వహణలో ఓ భాగం అంటూ తెలిపింది.