భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు ప్రధాన విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది న్యాయవ్యవస్థ, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ మూడవది శాసనసభ. ఈ మూడు రంగాల్లోనూ మహిళల వాటా గణనీయంగా పెరిగింది. వీటిలో న్యాయవ్యవస్థ విషయానికి వస్తే ఈ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారింది.
ప్రస్తుతం దేశంలో పలువురు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. అయితే దేశంలోని హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన లీలా సేథ్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈరోజు (అక్టోబర్ 20)న ఆమె జన్మదినం. ఆమెను ‘మదర్ ఆఫ్ లా అని పిలుస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకూ సాగిన ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు.
1930, అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో లీలా సేథ్ జన్మించారు. తన 11 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు. తల్లే ఆమెను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లీలా సేథ్ డార్జిలింగ్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రేమ్ సేథ్‌ను వివాహం చేసుకున్నాక, భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ గ్రాడ్యుయేషన్, తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆమె లండన్ బార్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు.
అనంతరం భారత్ తిరిగి వచ్చిన ఆమె తొలుత కోల్‌కతాలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత పట్నాలో, ఢిల్లీలో తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1978లో లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డులలోకి ఎక్కారు. ఈ నేపధ్యంలోనే ఆమెను ‘మదర్ ఆఫ్ లా’ అని అంటారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దరిమిలా కేసు విచారణకు ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీలో లీలా సేథ్ సభ్యురాలు. లీలా సేథ్ 2017లో తన 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment