న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది.
ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు.
వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment