Global Environment
-
ప్రపంచ పర్యావరణానికి కొత్త గీతం
ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్‌గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది. 1998లో వరల్డ్ బ్యాంక్‌లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేసింది. అక్కడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్‌కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అడ్వైజరీ సర్వీసెస్‌లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్‌గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్‌తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది. ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. -
భారత్‌కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
మానవాళికి డేంజర్ బెల్స్.. పరిస్థితి విషమిస్తోంది
ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు గతంలో అనుకున్న ప్రమాద స్థాయిలను మించి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని, ‘కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ’ పేరిట ఐరాస విడుదల చేసిన నివేదిక రూపకర్త లిండా మెర్న్స్ చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదని హెచ్చరించారు. ఐరాసకు చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) ఈ నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ పర్యావరణంలో సంభవిస్తున్న ఈ శీతోష్ణస్థితి మార్పు మానవ తప్పిదాల వల్ల జరుగుతోందనేందుకు సందేహమే లేదని ఐపీసీసీ తెలిపింది. 21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి సీరియస్ అంచనాలను వెలువరించలేదు. రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఐదు మార్గాలు ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 1. ఊహించనంత వేగంగా, భారీగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం. 2. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలుంటాయి కానీ భారీగా ఉండవు. 3. ఒక మోస్తరుగా ఉద్గారాల నియంత్రణ చేపట్టడం. 4. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించడం. 5. కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడం.. అనే ఐదు రకాల అంచనాలున్నాయని, ఇప్పటివరకు ప్రపంచం ఐదో మార్గంలో పయనిస్తూ వచ్చిందని, ఇటీవల కాలంలో మూడు, నాలుగు మార్గాలకు మధ్యస్థంగా ఉంటోందని నివేదిక వివరించింది. పైన చెప్పిన ఐదు మార్గాల్లో దేనిలోనైనా సరే 2030నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ టార్గెట్‌ను దాటటం ఖాయమని నివేదిక హెచ్చరించింది. 3,4 మార్గాలను అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత అంచనాలను దాటి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని, ఐదవ మార్గం కొనసాగితే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత అంచనా కన్నా 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది. కానీ దేశాల దృక్పథంలో వస్తున్న మార్పు వల్ల ఇంత ప్రమాదం జరగకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. టిప్పింగ్ పాయింట్లుగా పిలిచే భారీ విధ్వంసాలైన మంచు చరియలు కరిగిపోవడం, సముద్ర ప్రవాహాల్లో అనూహ్య మందగమనం వంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువే కానీ, అసలు జరగవని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. అందరూ భయపడే అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల మందగమనం ఈ శతాబ్దంలో ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఏమాత్రం పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా అందరూ కర్బన ఉద్గారాల కట్టడికి, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. దేశాల స్పందన: నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అభివరి్ణంచారు. మానవాళికి ఇది కోడ్ రెడ్ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నేతలు ఇప్పటికైనా కనీసం ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుటెరెస్ విజ్ఞప్తి చేశారు. నేతలంతా ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని స్కాటాండ్లో జరగబోయే సదస్సుకు అధ్యక్షత వహించనున్న అలోక్ శర్మ విజ్ఞప్తి చేశారు. మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. వేడి పెరిగితే కీడే భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీయడం, కరువు ఏర్పడడం, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా, వెయ్యేళ్లలో లేనట్లుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు నిదర్శనాలను కళ్లముందుంచింది. ► పరిస్థితి విషమిస్తోందనేందుకు సముద్ర మట్టాలు పెరగడం, ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుదల స్పీడందుకోవడం, తుఫా నులు తీవ్రంగా మారడం వంటివి సంకేతాలు. ► గతంలో 50 సంవత్సరాలకు ఒకమారు వచ్చే తీవ్ర వడగాలులు ఇప్పుడు పదేళ్లకు ఒకసారి ప్రత్యక్షమవడం శీతోష్ణస్థితిలో ప్రచండ మార్పునకు నిదర్శనం. ప్రపంచ ఉష్ణోగ్రత మరో డిగ్రీ పెరిగితే ఈ గాలులు ప్రతి ఏడేళ్లకు రెండుమార్లు ప్రత్యక్షమవుతాయి. ► ఉష్ణోగ్రతల పెరుగుదలతో కేవలం అనూహ్య శీతోష్ణ మార్పులు కనిపించడమేకాకుండా ఒకేమారు పలు ఉత్పాతాలు సంభవించే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పశ్చిమ యూఎస్‌లో జరుగుతున్నాయి(ఒకేమారు వడగాలులు, కరువు, కార్చిచ్చు ప్రత్యక్షం కావడం). ► గ్రీసు, టరీ్కల్లో తాజా కార్చిచ్చుకు సైతం ఈ ఉష్ణోగ్రతల మార్పు కారణమే. ► పరిస్థితి విషమించే కొద్దీ సముద్రాల్లో ఆక్సిజన్ శాతం తగ్గి అవి ఆమ్లయుతాలుగా మారతాయి, ఇదే జరిగితే కొన్ని వేలసంవత్సరాల పాటు అవి మామూలు స్థితికి చేరలేవు. ► కార్బన్‌డైఆక్సైడ్, మిథేన్ వాయు ఉద్గారాలే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల వాడకం, జీవుల్లో జరిగే జీవక్రియల ద్వారా ఈ రెండూ ఉత్పత్తి అవుతుంటాయి. సైంటిస్టులు ఈ పరిణామాలపై 30 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోలేదని నివేదిక వాపోయింది. రాబోయే దశాబ్దాల్లో జరగనున్న ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని ఐపీసీసీ తెలిసింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను తగ్గించలేకున్నా, ఇకపై మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఇందుకోసం గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేయాలని, ముఖ్యంగా కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపింది. -
ముప్పు ముంగిట భారతీయులు
వాషింగ్టన్: వాతావరణంలో సంభవిస్తున్న మార్పు భారతీయులకు శాపంగా మారనుందని అమెరికా వాతావరణ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న సముద్రమట్టాలతో దాదాపు 4 కోట్ల మంది భారతీయులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 2050 నాటికి ముంబై, కోల్‌కతా వంటి తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కష్టాలు తప్పవని సూచించింది. పసిఫిక్ తీరప్రాంతాలతోపాటు దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలపై ఈ మార్పు తాలూకు దుష్ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ఏడు దేశాలు ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశముందని, అందులో భారత్ మొదటిస్థానంలో ఉందని తెలిపింది. బంగ్లాదేశ్‌లో 2.5 కోట్లు, చైనాలో 2 కోట్లు, ఫిలిప్పైన్స్‌లో 1.5 కోట్ల మందిపై దీని ప్రభావం కనిపిస్తుందని స్పష్టంచేసింది.