ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది.
నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్‌లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్‌గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది.
1998లో వరల్డ్ బ్యాంక్‌లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్‌లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్‌లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసింది.
అక్కడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్‌కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అడ్వైజరీ సర్వీసెస్‌లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్‌గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్‌తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది.
ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment