విభేదాలను పరిష్కరించుకోండి
సభ్యదేశాలను కోరిన ఆతిథ్య అజర్‌బైజాన్
బాకు/న్యూఢిల్లీ: భూతాపంలో పెరుగుదలను కట్టుదిట్టంచేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచదేశాలు ఒక్కతాటిమీదకొచ్చే ఐక్యరాజ్యసమితి చర్చావేదిక ‘కాప్’సదస్సు సోమవారం అజర్‌బైజాన్ దేశంలో ఆరంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడంసహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్థ సమసిపోవాలని ఆతిథ్య అజర్‌బైజాన్ దేశం ఈ సందర్భంగా కోరింది. నవంబర్ 22వ తేదీదాకా జరిగే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 29వ సమావేశాలు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభంకాగా సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్దసంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.
శిలాజఇంధనాల అతివినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు(నిధులు) ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణమార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు.‘‘అత్యధిక కర్భన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. సరకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తూత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్దంకావాలి. లేదంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కునారిల్లుతుంది. వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించండి. ఇది ప్రతి ఒక్కదేశం బాధ్యత’’అని చెప్పారు.
ఏమిటీ కాప్?
వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచదేశాలు ఒకచోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాప్. ఐరాస వాతావరణ మార్పు కూటమి(యూఎన్‌ఎఫ్‌సీసీసీ) కార్యనిర్వాహక విభాగాన్నే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్)గా పిలుస్తారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్ కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాస ఇంథనాల వాడకాన్ని కనిష్టానికి దించడం, వాతావరణమార్పుల దు్రష్పభావాల బారినపడిన పేదదేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న, కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది.
అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖంచాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామికయుగం మొదలుకాకముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుపాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భావి తరాలకు భవిష్యత్తేలేకుండా చేస్తోంది.
దారుణ దిశలో పయనిస్తున్నాం: కాప్ అధ్యక్షుడు
కాప్29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ మాట్లాడారు. ‘‘మానవ కార్యకలాపాలు, అధికంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీసెల్సియస్ అధికమవుతోంది. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే వందల కోట్ల ప్రజానీకం దారుణకష్టాల కడలిలో కొట్టుకుపోకతప్పదు. నూతన సమ్మిళిత లక్ష్యం(న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్–ఎన్‌సీక్యూజీ)ని సాధించాలంటే 2009లో ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులివ్వాలన్న కాలంచెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందే. సమస్య తీవ్రత, విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలి’’అని ముఖ్తార్ పిలుపునిచ్చారు. అయితే వర్ధమానదేశాలు తమ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు గరిష్టంగా 6.85 ట్రిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐరాస వాతావరణవిభాగం చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment