Rising temperatures
-
పిట్టల్లా రాలిపోతున్నారు!
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న వడగాడ్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వేడి గాలులు, వడదెబ్బకు దేశంలో దశాబ్ద కాలంలో 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2013 నుంచి 2022 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10,635 మంది ప్రాణాలొదిలారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోం శాఖలో నమోదైన వేడిగాలులు, వడదెబ్బ మరణాల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పార్లమెంట్లో వెల్లడించింది. – సాక్షి, అమరావతిఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీదేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ ఉంది. ఈ విషయం అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 1970 నుంచి 2023 మధ్య ఐదు దశాబ్దాల్లో దేశంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 1970తో పోలిస్తే 2023లో ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్టు వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పేర్కొంది. మానవ ప్రమేయంతో వాతావరణంలో వచ్చే మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.ఏపీలో 2015లోనే 654 మరణాలుదేశ వ్యాప్తంగా పదేళ్లలో 10 వేల మందికిపైగా మరణించగా అందులో ఏపీ నుంచే అత్యధికంగా 2,203 మరణాలున్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వేడిగాలులు, వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలారు. అప్పట్లో వడదెబ్బ ముప్పు నుంచి రక్షణ పొందడం, బాధితులకు సత్వర చికిత్సలు ఇతర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో రాష్ట్రంలో పదేళ్లలో 2,203 మరణాలు సంభవించగా.. 2014–19 మధ్యనే 1,538 మరణాలు సంభవించాయి. అత్యధికంగా 2015లో 654 మరణాలున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్ ప్రభుత్వం వడదెబ్బ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. వేసవిలో వడదెబ్బ, వేడిగాలుల నుంచి రక్షణ పొందడంపై వైద్య శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గర్భిణులు, చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లోను ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర వైద్యం అందించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో వందల సంఖ్యలో ఉన్న మరణాలను గణనీయంగా నియంత్రించారు. దీంతో 2019లో 128.. 2020లో 50.. 2021లో 22.. 2022లో 47 చొప్పున మాత్రమే మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2022 మధ్య 1,172 మరణాలు సంభవించాయి. -
అర్బన్ హీట్
నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇది హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం కలిగించేది అయినప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఎండాకాలం లాంటి వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలే కురిసినప్పటికీ మళ్లీ రుతుపవనాలకు బ్రేక్ పడింది. అయితే, ఇది సర్వసాధారణమే అని, మరో వారంపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలేంటి?సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండేవి. కానీ ఇటీవల వేడి మరీ ఎక్కువైపోతోంది. హైదరాబాద్‌లో పదేళ్లకోసారి 0.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న 10 మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఢిల్లీ, పుణే, బెంగళూరు వంటి నగరాల సరసన మన హైదరాబాద్ కూడా చేరింది.ఢిల్లీ, పుణేలో ప్రతి పదేళ్లకోసారి 0.90 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుండగా, బెంగళూరులో 0.81 డిగ్రీలు, నాసిక్‌లో 0.78 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. అత్యధికంగా అహ్మదాబాద్‌లో ఏకంగా 1.06 డిగ్రీలు పెరుగుతుండగా, 1.02 డిగ్రీల పెరుగుదలతో జైపూర్ రెండో స్థానంలో ఉంది. ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్లు సౌమ్య సత్యకాంత సేథీ, వినోద్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. దేశంలోని 141 నగరాలపై వాళ్లు అధ్యయనం నిర్వహించారు. తీవ్ర ఇబ్బందులే... ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల అనేక ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వేడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోయి, మరణాలు కూడా సంభవిస్తుంటాయి. కారణాలివీ..ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు గ్రీన్ హౌజ్వాయువులు ముఖ్యకారణమని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి నగరీకరణ ప్రధాన కారణమని సౌమ్య సత్యకాంత చెబుతున్నారు. చెరువులు, కుంటలు ఎక్కువగా ఉంటే ఆ నీరు ఆవిరి కావడం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి వాతావరణం చల్లగా ఉంటుంది. పట్టణీకరణతో భూ ఉపరితలంలో మార్పుల వల్ల సూర్యుడి నుంచి వచ్చిన వేడి తిరిగి గగనతలంలోకి వెళ్లకుండా ఆగిపోతోంది.ఈ కారణాల వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ప్రభావం ఎక్కువగా పచి్చక బయళ్ల స్థానంలో భవనాలు, పరిశ్రమలు నిర్మించడం వల్ల సూర్యుడి నుంచి వచి్చన వేడి వాతావరణంలోకి తిరిగి వెళ్లకుండా భూమిపైనే ఉంటోందని పట్టణ వాతావరణ పరిశోధకుడు శబరీనాథ్ వివరించారు.రియల్ ఎస్టేట్ ప్రభావమేనా? పశ్చిమ హైదరాబాద్ (గచ్చిబౌలి ప్రాంతం)లో ప్రధానంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే వాయవ్య హైదరాబాద్ అయిన పటాన్చెరు, బండ్లగూడ, ఆగ్నేయ దిశలోని బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్‌లో కూడా ఉష్ణోగ్రతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లే పెరుగుతున్నాయని శబరీనాథ్ వివరించారు. కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్లే.. నగరంలో భవన నిర్మాణాలు ఎక్కువ కావడం, భూగర్భ జలాలు భారీగా తగ్గుముఖం పట్టడం, పచ్చదనం తగ్గిపోవడం, చెరువులు, కుంటలు తగ్గిపోవడంతో ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దశాబ్దకాలంలో భవన నిర్మాణ కార్యకలాపాలు ఏకంగా 70 నుంచి 80 శాతం పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అర్బన్హీట్ ఐలాండ్ ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. చలికాలంలో కూడా నగర శివార్లతో పోలిస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే వరదలుభవన నిర్మాణాలు పెరగడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది. కాంక్రీట్ భవనాలు, సిమెంటు రోడ్ల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వరదలు సంభవిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. –బీవీ సుబ్బారావు, ప్రముఖ పర్యావరణవేత్త భవన నిర్మాణం పెరగడం వల్లే.. నగరంలో భవన నిర్మాణ కార్యకలాపాలు పెరగడం వల్లే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో నగరాలు కాంక్రీట్ అరణ్యాల మాదిరిగా మారుతున్నాయి. దీంతో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వాతావరణంలోకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. –వైవీ రామారావు, తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ కన్సల్టెంట్ -
TS: మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెదపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్‌తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్‌ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభివృద్ధి పేరిట.. అడవులు గుల్ల
శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి పరిశ్రమల స్థాపన, రహదారుల నిర్మాణం, ఖనిజాల వెలికితీత కోసం అడవులను గుల్ల చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లోని సమీప భూముల్లో రియల్ ఎస్టేట్ కోసం వ్యవసాయం మానేయడంతో పచ్చదనం తగ్గిపోతోంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తద్వారా వాతావరణంలో మార్పులు (క్లైమేట్ ఛేంజ్) చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల అకాల వర్షాలు, ఒకేచోట గంటల వ్యవ ధిలోనే కుండపోతగా సెంటీమీటర్ల కొద్దీ వర్షం పడటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మరోవైపు కర్బన ఉద్గారాల విడుదలకూ అడవుల నరికివేత కారణమవు తోంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరిగిపోతోంది. ఒక్క భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినడానికి ప్రధాన కారణం కాగా.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం పర్యావరణ పరిరక్షణ కాంక్షను గాలికి వదిలేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే పెరుగు తున్న ఉష్ణోగ్రతలు 65 సంవత్సరాలు పైబడిన వారి ప్రాణాలు హరిస్తున్నట్లు ఇటీవల వెల్లడైన నివేదికలు స్పష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా 2023–2024 మరింత వేడిగా ఉండబోతున్నట్లు పర్యావరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సి యస్ అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటే పరిస్థితి ఎలా చేయి దాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. గుడ్డిలో మెల్లలా.. గడిచిన ఆరేళ్లుగా మన దేశంలో అటవీ విస్తీర్ణంలో, అడవి బయట చెట్ల పెంపకంలో కాస్త పెరుగుదల కనిపిస్తుండటం ఆశాజనక పరిణామం. రెండేళ్లలో 1,540 చ.కి.మీ. పెరుగుదల దేశంలో రెండేళ్లకోసారి అటవీ విస్తీర్ణంపై సర్వే చేస్తున్నారు. గత రెండేళ్లలో 1,540 చ.కి.మీ. మేరకు అటవీ విస్తీర్ణం పెరిగినట్లు, అడవి బయట మరో 721 చ.కి.మీ. మేరకు వృక్ష సంపద పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొక్కలు నాటడాన్ని కూడా వృక్ష సంపదగా చూపిస్తుండడం గమనార్హం. మొక్కలు త్వరగా వృక్షాలుగా ఎదగాలనే ఉద్దేశంతో వేర్లు బలహీనంగా ఉండి, చిన్నపాటి వర్షాలకే కూలిపోయే మొక్కలు నాటుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మర్రి, వేప, రావి, చింత లాంటి దీర్ఘకాలం జీవించే చెట్ల మొక్కలను తక్కువగా నాటుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 21,214 చ.కి.మీ. మేర అడవులు దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీ (647 చ.కి.మీ.) తొలిస్థానంలో ఉండగా తెలంగాణ (632 చ.కి.మీ) రెండోస్థానంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ కాగా అందులో 21,214 చ.కి.మీ. మేర (18.93 శాతం) అడవులు ఉన్నాయి. ఒడిశా (537 చ.కి.మీ.), కర్ణాటక (155 చ.కి.మీ.), జార్ఖండ్ (110 చ.కి.మీ.) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అటవీ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ టాప్ దేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణత శాతం పరంగా చూస్తే.. అరుణాచల్‌ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76%), మణిపూర్ (74.34%), నాగాలాండ్ (73.90%) ముందంజలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లద్దాఖ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం.. వాతావరణ మార్పుల కారణంగా.. మంచు కురిసే కశ్మీర్ ఆపైన ఉండే లద్దాఖ్‌లో రాబోయే దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2030 స్వల్పకాలిక, 2050కి మధ్యకాలిక, 2085 దీర్ఘకాలికంగా పరిగణిస్తూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి ఈ సర్వే నిర్వ హించాయి. లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు అత్యధిక ఉష్ణోగ్రత పెరుగుదల నమోదయ్యే ప్రాంతాలుగా ఈ అధ్యయనంలో తేలింది. కచ్చితమైన కార్యాచరణ అవసరం అభివృద్ధి పేరుతో పర్యావరణా నికి నష్టం కలుగజేస్తే వాతావరణ మార్పులు, రుతు వుల్లో మార్పులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. భూ విస్తీర్ణంలో 30–35 శాతం అడవులు, పచ్చదనం ఉండడం అత్యంత అవసరం. కానీ ప్రస్తుతం అడవులు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల మీదుగా కూడా రోడ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం పేరిట అయోమయ పరిస్థి తులు కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోడు చేయాల్సిన అవసరముందా? అంత అడవి మనకు ఉందా? అన్నది ముఖ్యం. తగ్గిపోతున్న అడవులు, జీవ వైవిధ్యాన్ని మళ్లీ ఏ విధంగా, ఏ రూపంలో పునరుద్ధ రిస్తామన్నది పెద్ద సవాల్. అడవులు, వాతావరణ మార్పులపై అటవీశాఖ కచ్చిత మైన బాధ్యతతో కార్యాచరణను చేపట్టాల్సిన అవసరముంది. – బీవీ సుబ్బారావు, నీటి నిపుణులు, పర్యావరణవేత్త రాబోయే రోజుల్లో తెలంగాణపై తీవ్ర ప్రభావం తెలంగాణలో 12, 13% కూడా దట్ట మైన అడవులు, పటిష్టమైన గ్రీన్‌కవర్ లేదు. పైగా వ్యవసా యం పేరుతో అటవీ భూములను తీసుకుంటున్నాం. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న సారవంతమైన పచ్చని భూములు రియల్ ఎస్టేట్‌కు బలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. సముద్రమట్టానికి ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున తెలంగాణపై రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా పడబోతోంది. వడగాడ్పులు, అధిక వర్షాలు, ఎక్కువ చలి వంటి పరిస్థితులు పెరుగుతున్నాయి. వర్షాలు పడినా వేడి తగ్గడం లేదు. ఈ వాతావరణ పరిస్థితులు వివిధ రంగాల్లో ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నాయి. – డా.దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎక్స్పర్ట్, క్లైమేట్ ఛేంజ్ క్యాంపెయినర్ పర్యావరణ సమతుల్యత ముఖ్యం అటవీ విస్తీర్ణం క్షీణతతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో భయానక పరిస్థితులు ఏర్పడు తున్నాయి. తెలంగాణాలో 270 కోట్ల మొక్కలు నాటాలంటే రాష్ట్ర భూభాగంలో కనీసం 9 శాతం కావాలి. ఎక్కడ ఇచ్చారు? అటవీ ప్రాంతాలు కొట్టేస్తున్నారు. మొక్కలు నాటి వాటిని అడవు లుగా చూపిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత ముఖ్యం. – బాబురావు, పర్యావరణవేత్త -
Climate Change: కలిసి కదిలితేనే భూ రక్ష!
అనుమానాలకు తావు లేదిప్పుడు... చూద్దాం.. చేద్దామన్న పోకడనూ మరచిపోండి!! వాతావరణ మార్పులన్నవి ముమ్మాటికీ నిజం. నిజం. నిజం!! ధోరణి మారకుంటే.. భావితరాలు ఈ భూమ్మీద.. బతకడం కష్టమేనని గుర్తుంచుకోండి!! ప్రకృతిని తద్వారా మనల్ని మనం కాపాడుకునేందుకు... ఈ క్షణం నుంచే సంకల్పం చెప్పుకోండి. కంకణం కట్టుకోండి!! వ్యక్తులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రపంచానికొచ్చిన పెనువిపత్తును తప్పించగలవా అన్న సంశయమూ వద్దు!! కెనడాలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. జర్మనీలో అకాల వర్షాలు, వరదలు.. చైనాలో వెయ్యేళ్ల రికార్డులు తిరగరాస్తూ కుంభవృష్టి!! ఇవన్నీ ఏవో కాకతాళీయంగా జరిగిన సంఘటనలని కొందరు అనుకోవచ్చు కానీ.. భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలీ ఘటనలన్నవి సుస్పష్టం. వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణంలో తగ్గుదల, కాలుష్యం తదితర కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత.. క్రమేపీ పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే... కార్చిచ్చులు, కుంభవృష్టి, అకాల వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువ అవడం గ్యారంటీ అని స్పష్టం చేసింది. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఐపీసీసీ తాజా నివేదిక మరోసారి రూఢీ చేయడమే కాకుండా... తుది ప్రమాద హెచ్చరికల్లాంటివి జారీ చేసింది. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని స్పష్టం చేసింది. ఆ... భూమి మొత్తమ్మీద జరిగే పరిణామాలకు నేనేం చేయగలను? ఆ పాట్లేవో మన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు పడతారులే అనుకోనవసరం లేదు. ఎందుకంటే.. వ్యక్తులు తమ జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పులు కూడా ఉడతా సాయంగానైనా ఉపకరిస్తాయి. అదెలాగో చూడండి... ఆహార వృథాను అరికట్టండి... మీకు తెలుసా? శిలాజ ఇంధనాల తరువాత భూతాపోన్నతికి కారణమవుతున్న వాటిల్లో ఆహార పరిశ్రమ అతిపెద్దదని? ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే పాడి, మాంసం అనే రెండు అంశాలు వాతావరణ మార్పులకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి, పాడిపశువుల పెంపకానికి ఫీడ్ నీరు, విద్యుత్తు, నేల వంటి వనరులను వినియోగించుకుని పెరగడం ఒక కారణం. అలాగే మాంసం కోసం పెంచే కొన్ని జంతువులు ప్రమాదకరమైన మీథేన్ వాయువును ఎక్కువగా వదులుతాయి. పశువులు పెంచేందుకు వీలుగా కొన్నిచోట్ల అటవీ భూములను చదును చేయడమూ కద్దు! ఇవన్నీ ఒకఎత్తు అయితే... మనం తినే ఆహారాన్ని వృథా చేయడం ఇంకో ఎత్తు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మానవ వినియోగానికి సిద్ధం చేసిన ఆహారంలో కనీసం మూడొంతులు వృథా అవుతోందని? దీని విలువ ఏడాదికి అక్షరాలా లక్షకోట్ల డాలర్లు! ప్రపంచంలో సగం మంది శాఖాహారులుగా మారిపోతే ఏటా తగ్గే కార్బన్డయాక్సైడ్ మోతాదు 660 కోట్ల టన్నులు మనిషి సగటున ఏడాదికి ఐదు టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తాడని అంచనా. కానీ ఇది దేశాన్ని బట్టి మారుతూంటుంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాల్లో ఇది 16.5 టన్నులు కాగా.. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1.6 టన్నులుగా ఉంది. ప్రత్యామ్నాయాలకు జై కొట్టండి... భూతాపోన్నతిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సౌర, పవన, జీవ, జల ఇంధనాల వాడకం కచ్చితంగా పెరగాలి. ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు తిరిగేందుకు అవసరమైనంతైనా సరే.. సౌరశక్తిని వాడుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకప్పుడు దీని ఖరీదు ఎక్కువే కానీ.. 2010 నాటితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం చౌక. రకాన్ని బట్టి ఇప్పుడు భారత్‌లో ఒక్కో వాట్ సోలార్ప్యానెల్కు అయ్యే ఖర్చు రూ.23 నుంచి రూ.140 వరకూ ఉంటోంది. ఇంట్లో 20 వాట్ల ఎల్ఈడీలు ఐదు ఉన్నాయనుకుంటే రూ.2300 ఒక ప్యానెల్ కొనుక్కుని వాడుకుంటే చాలు పైగా మనకు సూర్యరశ్మికి అసలు కొదవే లేదు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజుబాటిల్ వాడినా. వస్త్రంతో తయారైన సంచీలతో సరుకులు, కాయగూరలు తెచ్చుకున్నా... అవసరానికి మంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనకపోయినా... ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న మార్పూ భూమికి శ్రీరామరక్షగా నిలుస్తుంది!! ఇంట్లో పొదుపు మంత్రం... భూతాపోన్నతిని తగ్గించేందుకు మనమేమీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ చర్యలు పాటించడం వల్ల నాలుగు డబ్బులు మిగులుతాయి కూడా. ఇంట్లోని ఏసీలో ఉష్ణోగ్రతను 24 స్థాయి నుంచి 26 డిగ్రీలకు పెంచారనుకోండి. మీకు కరెంటు ఆదా.. వాతావరణంలో చేరే కాలుష్యమూ తగ్గుతుంది. అలాగే సాధారణ బల్బుల స్థానంలో సమర్థమైన, చౌకైన, ఎక్కువ కాలం మన్నే ఎల్ఈడీ బల్బులు వాడటమూ ఉభయ ప్రయోజనకరం. ప్రపంచమంతా ఎల్ఈడీలు వాడితే ఏటా 7,800 కోట్ల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. సూర్యభగవానుడిచ్చే ఎర్రటి ఎండను కాదని వాషింగ్మెషీన్లో డ్రయింగ్ ఆప్షన్‌ను వాడితే భూమికి చేటు చేయడమే కాకుండా.. మీ జేబుకు పడే చిల్లూ ఎక్కువ అవుతుందని గుర్తించండి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల (టీవీ, మిక్సీ, వాషింగ్‌మెషీన్, ఓవెన్, గీజర్ లాంటివి)ను అవసరం లేనప్పుడు కేవలం స్విచాఫ్ చేయడం కాకుండా... ప్లగ్ తీసి ఉంచడమూ కరెంటును ఆదా చేస్తుందని తెలుసుకోండి. సమర్థమైన ఎల్ఈడీ బల్బులను అందరూ ఉపయోగించడం మొదలుపెడితే అయ్యే ఆదా ఏడాదికి... తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. వృక్షో రక్షతి రక్షితః... చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయన్న ఈ సంస్కృత నానుడి ఈ రోజుకూ అక్షర సత్యం. ఇల్లు, అపార్ట్మెంట్, బడి, ఆఫీసు ఇలా వీలైనప్రతి చోట మొక్కలు నాటామనుకోండి. వాతావరణంలోని కార్బన్డ యాక్సైడ్‌ను కొంతమేరకైనా తగ్గించవచ్చు. చెట్లు, మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుని ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చేయగలవు. కానీ నిమిషానికి పది ఎకరాలకు పైగా అడవులను వివిధ కారణాలతో నరికేస్తున్న పరిస్థితుల్లో వాతావరణంలో విషవాయువుల మోతాదు పెరిగిపోతోంది! అందుకే,అడవులను కాపాడుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలు నాటడం అత్యవసరం. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం! భూతాపోన్నతికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజసిద్ధ ఇంధన వనరుల విచ్చలవిడి వాడకం ప్రధాన కారణం. వీటిని తగ్గిస్తే తద్వారా వాతావరణంలోకి చేరే విష వాయువుల మోతాదు తగ్గి భూతా పోన్నతిని నియంత్రించవచ్చు. ఇరుగు పొరుగు వీధుల్లో పనులకు బైక్‌ల బదులు సైకిళ్లు వాడినా, కాళ్లకు పని చెప్పినా ఈ భూమికి మనవంతు మేలు చేసినట్లే. దూరా భారమైతే సొంత వాహనాల్లో కాకుండా.. బస్సులు, ట్రైన్లను వాడాలని నిపుణులంటున్నారు. విమానాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. వీలైనంత వరకూ డైరెక్ట్ ఫ్లైట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే... విమానాల నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ. మన ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటే ల్యాండింగ్, టేకాఫ్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
రోజురోకుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత
-
ఉక్కపోత.. ‘ఎండ’ మోత
నరసాపురం: సెప్టెంబర్ మాసం.. సాధారణంగా వాన కాలం.. ఎడతెరపి లేని వర్షాలు కురవాల్సిన సమయం.. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. పది రోజుల ముందు వరకు కుండపోత వర్షాలు, వరదలు భయపెట్టాయి. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం, ఉక్కపోతతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని పట్టణాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతుండటం ఉక్కపోతకు కారణమవుతోంది. పగలు, రాత్రి తేడాలేకుండా తేమశాతం సాధారణం కన్నా అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తేమశాతంలో హెచ్చుతగ్గులు జిల్లాలో కొన్ని రోజులుగా గాలిలో తేమశాతం పెరుగుతోంది. వారం రోజులుగా పగలు 45 నుంచి 50 శాతం, వేకువజాము 80 నుంచి 85 శాతం తేమ నమోదవుతోంది. కొన్నిప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తగ్గిన ఏసీల వాడకం ఎయిర్ కండీషనర్ల వాడకంతో కరోనా వ్యాపిస్తుందనే వార్తలతో జనం ఏసీల వాడకాన్ని తగ్గించారు. ఎండలు, ఉక్కపోత ఉన్నా కొందరు ఏసీల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది వరకు ఇళ్లల్లో ఏసీల వాడకం తగ్గించినట్టు అంచనా. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. మారిన వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజులు ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు ఇదే మాదిరిగా ఎండలు ఉండొచ్చు. ప్రస్తుతం మే నెలకు సమానంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐదారేళ్లలో సెపె్టంబర్లో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ 45 నుంచి 50 శాతానికి కాస్త ఎక్కువగా నమోదవుతోంది. ఎండతో పాటు ఉక్కపోత పెరిగింది. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుంది. – ఎన్.నర్సింహారావు, నరసాపురం వాతావరణశాఖ అధికారి జాగ్రత్తగా ఉండాలి ఓ పక్క కరోనా ముప్పు, మరోపక్క ఎండ, ఉక్కపోతతో ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్మా రోగులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. జ్వరాలు రావచ్చు. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వంటివి చేయాలి. –డాక్టర్ బళ్ల మురళి, ఎండీ, నరసాపురం -
ఎండ.. ప్రచండ
తణుకు : ఎండలు మండుతున్నాయి.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజుల క్రితం వరకు చల్లబడిన వాతావరణం రెండురోజులుగా వేడెక్కింది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గకపోగా వడగాలులు వీస్తున్నాయి. మంగళవారం జిల్లాలో గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలోని మార్పులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలను దాటేసిన ఉష్ణోగ్రతలు జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండుఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఎండవేడిమిని భరించలేకపోతున్నారు. గత రెండు మూడురోజుల క్రితం వరకు అకాలవర్షంతో జిల్లాలో కొన్నిచోట్ల చల్లబడినా మంగళవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గంట గంటకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లాలోని మంగళవారం ఏలూరులో 42, తాడేపల్లిగూడెంలో 41, తణుకులో 40, భీమవరం 39, నరసాపురం 36, కొవ్వూరు 42, జంగారెడ్డిగూడెం 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా పట్టణాల్లో ప్రధాన రహదారులన్నీ కూడా జనం లేక బోసిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్లనుంచి బయటకు వచ్చేవారు ఎండవేడిమి తట్టుకునేందుకు గొడుగులు, చేతిరుమాళ్లు, టోపీలు, స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడిమి తగ్గకపోగా వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారులు, కూలీనాలీ చేసుకుని జీవించేవారు, రిక్షా కార్మికులు ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు ఎండకు వినియోగదారులు రావడంలేదని వ్యాపార లావాదేవీలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు గతంలో కూలర్లు, ఫ్యాన్లతో సరిపెట్టుకునేవారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎండవేడిమిని భరించలేక ఏసీలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. గతేడాది 35 మంది మృతి ఈ ఏడాది కూడా జిల్లాలో వడదెబ్బ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఐఎండీ హెచ్చరిస్తున్నారు. గతేడాది వడదెబ్బ కారణంగా జిల్లాలో 35 మంది మృతి చెందారు. అయితే ఈ ఏడాది ఎండవల్ల వడదెబ్బ బాధితులతో పాటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భానుడి ప్రకోపానికి తట్టుకునేలా జనాలు నిలబడాలంటే వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఓ వైపు అకాలవర్షాల కారణంగా రాత్రి వేళల్లో చల్లటి గాలులు, ఉదయం, మధ్యాహ్నం ఎండల తీవ్రత అధికమవుతుండటం ఆరోగ్యానికి మంచిదికాదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. గత మార్చి నెలలో ఎండల తీవ్రత అధికమవుతున్న సమయంలో అకాల వర్షాల కారణంగా గడిచిన పదిహేను రోజుల్లో వాతావరణం చల్లబడినా మళ్లీ రెండ్రోజులుగా పుంజుకుంటోంది. -
భానుడి భగభగ
ఆదిలాబాద్ టౌన్: అడవుల జిల్లా.. ఆదిలాబాద్‌లో భానుడు భగ్గుమంటున్నాడు. సాధారణంగా మార్చి చివరి వారం తర్వాత పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన పది రోజుల నుంచి వేసవి తాపం మొదలైంది. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదు అయింది. ఉదయం 10 గంటలు దాటిందంటే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 5 దాటినా వేడి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి ఏప్రిల్, మేలో ఉష్ణ్రోగ్రతలు 48 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువ నమోదైంది. ఈ సంవత్సరం జనవరిలో కనిష్ట ఉష్ణ్రోగ్రతలు 4 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. గతేడాది మేలో గరిష్ట ఉష్ణ్రోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇప్పటికే ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుటెండ.. ఎండలు మండిపోతున్నాయి. భూమి సెగలు కక్కుతుంది. వేడిగాలులు దడ పుట్టిస్తున్నాయి. తీవ్రమైన ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనం అల్లాడుతున్నారు. వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కాలేదు. ఎండలో పని చేసేవారు, తిరిగేవారు, వృద్ధులు, మద్యపానం సేవించేవారు తొందరగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. చల్లని పానీయాలకు పెరిగిన గిరాకీ.. వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి జనం కొబ్బరినీళ్లు, తర్బుజా, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగుతున్నారు. ఎండలు మండుతుండడంతో ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాలలో కుల్‌డ్రింక్ షాపులు, జూస్ సెంటర్లు వెలశాయి. ఎండలో తిరిగే వాహనదారులు, కార్యాలయాల్లో పని చేసేవారు, ఫీల్డ్ వర్క్ చేసే వారు వేడిమికి తట్టుకోలేక కాసేపు సేద తీరి వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ రంజన్లకు కూడా గిరాకీ పెరిగాయి. ఈసారి గరిష్ణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలలో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత ఎండలు మరింత పెరగనున్నాయి. గాలిలో తేమ తగ్గడం వల్ల వేసవిలో సాగు చేస్తున్న పంటలపై ప్రభావం పడి దిగుబడి తగ్గవచ్చు. గతేడాది మేలో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నీళ్ల గుణాన్ని బట్టి పంట తేమ సున్నిత దశలో దృష్టిలో పెట్టుకొని వేరుశనగలో 45 రోజుల నుంచి 80 రోజుల మద్యలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటలో కాయ అబివృద్ధి చేందే దశ నుంచి గింజ అభివృద్ధి వరకు 45–70 రోజుల మధ్యలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. – శ్రీధర్ చౌహన్, ఏఆర్ఎస్ శాస్త్రవేత్త జాగ్రత్తలు తీసుకోవాలి భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుంది. ఎండలో ఎక్కువ సేపు పనిచేయవద్దు. నీరు ఎక్కువగా తాగాలి. టోపి, నెత్తిన వస్త్రాలు కప్పుకోవాలి. గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. గ్లూకోజ్, ఎలక్ట్రోల్, ఓఆర్ఎస్ను నీటిలో కలిపి తరుచూ తాగాలి. – డాక్టర్ సాధన,డిప్యూటీ డీఎంహెచ్‌వో -
పెరగనున్న ఉష్ణోగ్రతలు
రెండ్రోజుల్లో వడగాలులు విశాఖపట్నం : రెండు రోజుల్లో ఉష్ణోగ్రత లు పెరగనున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వడగాలులు వీయనున్నాయి. కొద్దిరోజుల నుంచి అల్పపీడన, ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు ఊపందుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు రాష్ట్రాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర నుంచి మధ్య బంగాళాఖాతం వర కూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులుగాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడి అకాల వర్షాలకు కూడా ఆస్కారం ఉం దని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.