నరసాపురం: సెప్టెంబర్ మాసం.. సాధారణంగా వాన కాలం.. ఎడతెరపి లేని వర్షాలు కురవాల్సిన సమయం.. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. పది రోజుల ముందు వరకు కుండపోత వర్షాలు, వరదలు భయపెట్టాయి. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం, ఉక్కపోతతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని పట్టణాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతుండటం ఉక్కపోతకు కారణమవుతోంది. పగలు, రాత్రి తేడాలేకుండా తేమశాతం సాధారణం కన్నా అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తేమశాతంలో హెచ్చుతగ్గులు
జిల్లాలో కొన్ని రోజులుగా గాలిలో తేమశాతం పెరుగుతోంది. వారం రోజులుగా పగలు 45 నుంచి 50 శాతం, వేకువజాము 80 నుంచి 85 శాతం తేమ నమోదవుతోంది. కొన్నిప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
తగ్గిన ఏసీల వాడకం
ఎయిర్ కండీషనర్ల వాడకంతో కరోనా వ్యాపిస్తుందనే వార్తలతో జనం ఏసీల వాడకాన్ని తగ్గించారు. ఎండలు, ఉక్కపోత ఉన్నా కొందరు ఏసీల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది వరకు ఇళ్లల్లో ఏసీల వాడకం తగ్గించినట్టు అంచనా. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. మారిన వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వారం రోజులు ఇదే పరిస్థితి
మరో వారం రోజుల పాటు ఇదే మాదిరిగా ఎండలు ఉండొచ్చు. ప్రస్తుతం మే నెలకు సమానంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐదారేళ్లలో సెపె్టంబర్‌లో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ 45 నుంచి 50 శాతానికి కాస్త ఎక్కువగా నమోదవుతోంది. ఎండతో పాటు ఉక్కపోత పెరిగింది. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుంది.
– ఎన్.నర్సింహారావు, నరసాపురం వాతావరణశాఖ అధికారి
జాగ్రత్తగా ఉండాలి
ఓ పక్క కరోనా ముప్పు, మరోపక్క ఎండ, ఉక్కపోతతో ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్మా రోగులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లు పెరిగే అవకాశం ఉంది. జ్వరాలు రావచ్చు.
చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వంటివి చేయాలి.
–డాక్టర్ బళ్ల మురళి, ఎండీ, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment