
హైదరాబాద్‌లో నగరీకరణతో ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రతి పదేళ్లకు 0.75 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుదల
దేశంలోని టాప్–10 హాట్ మెట్రో నగరాల జాబితాలో భాగ్యనగరం
అత్యధికంగా అహ్మదాబాద్‌లో 1.06 డిగ్రీల పెరుగుదల
ఆ తర్వాతి స్థానంలో జైపూర్, పుణే, బెంగళూరు
కాంక్రీట్ అరణ్యాలు పెరగడం వల్లే అంటున్న నిపుణులు.. ఐఐటీ–భువనేశ్వర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇది హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం కలిగించేది అయినప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఎండాకాలం లాంటి వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలే కురిసినప్పటికీ మళ్లీ రుతుపవనాలకు బ్రేక్ పడింది. అయితే, ఇది సర్వసాధారణమే అని, మరో వారంపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలేంటి?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండేవి. కానీ ఇటీవల వేడి మరీ ఎక్కువైపోతోంది. హైదరాబాద్‌లో పదేళ్లకోసారి 0.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న 10 మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఢిల్లీ, పుణే, బెంగళూరు వంటి నగరాల సరసన మన హైదరాబాద్ కూడా చేరింది.
ఢిల్లీ, పుణేలో ప్రతి పదేళ్లకోసారి 0.90 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుండగా, బెంగళూరులో 0.81 డిగ్రీలు, నాసిక్‌లో 0.78 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. అత్యధికంగా అహ్మదాబాద్‌లో ఏకంగా 1.06 డిగ్రీలు పెరుగుతుండగా, 1.02 డిగ్రీల పెరుగుదలతో జైపూర్ రెండో స్థానంలో ఉంది. ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్లు సౌమ్య సత్యకాంత సేథీ, వినోద్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. దేశంలోని 141 నగరాలపై వాళ్లు అధ్యయనం నిర్వహించారు.

తీవ్ర ఇబ్బందులే...
ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల అనేక ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వేడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోయి, మరణాలు కూడా సంభవిస్తుంటాయి.
కారణాలివీ..
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు గ్రీన్ హౌజ్‌వాయువులు ముఖ్యకారణమని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి నగరీకరణ ప్రధాన కారణమని సౌమ్య సత్యకాంత చెబుతున్నారు. చెరువులు, కుంటలు ఎక్కువగా ఉంటే ఆ నీరు ఆవిరి కావడం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి వాతావరణం చల్లగా ఉంటుంది. పట్టణీకరణతో భూ ఉపరితలంలో మార్పుల వల్ల సూర్యుడి నుంచి వచ్చిన వేడి తిరిగి గగనతలంలోకి వెళ్లకుండా ఆగిపోతోంది.
ఈ కారణాల వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ప్రభావం ఎక్కువగా పచి్చక బయళ్ల స్థానంలో భవనాలు, పరిశ్రమలు నిర్మించడం వల్ల సూర్యుడి నుంచి వచి్చన వేడి వాతావరణంలోకి తిరిగి వెళ్లకుండా భూమిపైనే ఉంటోందని పట్టణ వాతావరణ పరిశోధకుడు శబరీనాథ్ వివరించారు.

రియల్ ఎస్టేట్ ప్రభావమేనా?
పశ్చిమ హైదరాబాద్ (గచ్చిబౌలి ప్రాంతం)లో ప్రధానంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే వాయవ్య హైదరాబాద్ అయిన పటాన్‌చెరు, బండ్లగూడ, ఆగ్నేయ దిశలోని బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్‌లో కూడా ఉష్ణోగ్రతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లే పెరుగుతున్నాయని శబరీనాథ్ వివరించారు.
కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్లే..
నగరంలో భవన నిర్మాణాలు ఎక్కువ కావడం, భూగర్భ జలాలు భారీగా తగ్గుముఖం పట్టడం, పచ్చదనం తగ్గిపోవడం, చెరువులు, కుంటలు తగ్గిపోవడంతో ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దశాబ్దకాలంలో భవన నిర్మాణ కార్యకలాపాలు ఏకంగా 70 నుంచి 80 శాతం పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అర్బన్‌హీట్ ఐలాండ్ ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. చలికాలంలో కూడా నగర శివార్లతో పోలిస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి.
అందుకే వరదలు
భవన నిర్మాణాలు పెరగడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది. కాంక్రీట్ భవనాలు, సిమెంటు రోడ్ల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వరదలు సంభవిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. –బీవీ సుబ్బారావు, ప్రముఖ పర్యావరణవేత్త
భవన నిర్మాణం పెరగడం వల్లే..
నగరంలో భవన నిర్మాణ కార్యకలాపాలు పెరగడం వల్లే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో నగరాలు కాంక్రీట్ అరణ్యాల మాదిరిగా మారుతున్నాయి. దీంతో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వాతావరణంలోకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. –వైవీ రామారావు, తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ కన్సల్టెంట్