వడగాడ్పులకు దేశంలో పదేళ్లలో 10 వేల మందికి పైగా మృత్యువాత
ఏపీలో 2,203 మరణాలు
వాటిలో 1,538 మరణాలు 2014–19 మధ్య కాలంలోనే..
2019 తర్వాత రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన మరణాలు
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న వడగాడ్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వేడి గాలులు, వడదెబ్బకు దేశంలో దశాబ్ద కాలంలో 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2013 నుంచి 2022 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10,635 మంది ప్రాణాలొదిలారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోం శాఖలో నమోదైన వేడిగాలులు, వడదెబ్బ మరణాల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పార్లమెంట్‌లో వెల్లడించింది. – సాక్షి, అమరావతి
ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ
దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ ఉంది. ఈ విషయం అమెరికాకు చెందిన క్‌లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 1970 నుంచి 2023 మధ్య ఐదు దశాబ్దాల్లో దేశంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 1970తో పోలిస్తే 2023లో ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్టు వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పేర్కొంది. మానవ ప్రమేయంతో వాతావరణంలో వచ్చే మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
ఏపీలో 2015లోనే 654 మరణాలు
దేశ వ్యాప్తంగా పదేళ్లలో 10 వేల మందికిపైగా మరణించగా అందులో ఏపీ నుంచే అత్యధికంగా 2,203 మరణాలున్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వేడిగాలులు, వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలారు. అప్పట్లో వడదెబ్బ ముప్పు నుంచి రక్షణ పొందడం, బాధితులకు సత్వర చికిత్సలు ఇతర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో రాష్ట్రంలో పదేళ్లలో 2,203 మరణాలు సంభవించగా.. 2014–19 మధ్యనే 1,538 మరణాలు సంభవించాయి. అత్యధికంగా 2015లో 654 మరణాలున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్ ప్రభుత్వం వడదెబ్బ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
వేసవిలో వడదెబ్బ, వేడిగాలుల నుంచి రక్షణ పొందడంపై వైద్య శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గర్భిణులు, చిన్నారులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీని చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లోను ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర వైద్యం అందించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో వందల సంఖ్యలో ఉన్న మరణాలను గణనీయంగా నియంత్రించారు. దీంతో 2019లో 128.. 2020లో 50.. 2021లో 22.. 2022లో 47 చొప్పున మాత్రమే మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2022 మధ్య 1,172 మరణాలు సంభవించాయి.
Comments
Please login to add a commentAdd a comment