వాతావరణాన్నీ మార్చేస్తున్నాం! | Rapid action on climate change in the country | Sakshi
Sakshi News home page

వాతావరణాన్నీ మార్చేస్తున్నాం!

Nov 25 2024 5:36 AM | Updated on Nov 25 2024 5:36 AM

Rapid action on climate change in the country

దేశంలో వాతావరణ మార్పులకు వేగవంతమైన చర్యలు 

వరుసగా ఆరో ఏడాదీ టాప్‌–10లో..   

 ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో విడుదలయ్యే తలసరి ఉద్గారాలూ తక్కువే 

జీ20 దేశల్లో భారత్, యూకే మాత్రమే మెరుగైన పనితీరు 

క్లయిమేట్‌ చేంజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో వెల్లడి 

సాక్షి, అమరావతి : వాతావరణ మార్పులకు వేగవంతమైన చర్యలు చేపడుతున్న దేశాల జాబితాలో వరుసగా ఆరో ఏడాది భారత్‌ టాప్‌–10లో కొనసాగుతోంది. 2014లో 31వ స్థానం నుంచి 2019లో టాప్‌ 10లోకి చేరుకుని నిలకడగా రాణిస్తోంది. అయితే వాతావరణ మా­ర్పుల పనితీరు సూచీ(క్లయిమేట్‌ ఫెర్ఫార్మెన్స్‌–సీసీపీఐ)లో మా­త్రం ఏడో స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది. 

కానీ, పునరుత్పాదక శక్తి వినియోగంలో మాత్రం పురోగతి సాధిస్తోంది. జీ20 దేశాల్లో కేవలం భారత్, యూకేల్లో మాత్రమే క్లయిమేట్‌ ఫెర్ఫార్మెన్స్‌ మెరుగ్గా ఉన్నట్టు తాజాగా జర్మన్‌వాచ్, న్యూ క్లయిమేట్‌ ఇన్‌స్టిట్యూట్, సీఏఎన్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా విడుదల చేసిన క్లయిమేట్‌ చేంజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో వెల్లడించింది. 

ఇందులో తొలి మూడు ర్యాంకులు ఏ దేశానికీ కచి్చతమైన స్కోర్‌ లేకపోవడంతో ఖాళీగా ఉంచారు. డెన్మార్క్‌(4వ), నెదర్లాండ్స్‌(5వ), యూకే(6వ) ముందంజలో ఉన్నాయి. అయితే యూకే వాతావరణ మార్పుల పనితీరులో అద్భత ప్రదర్శన కనబరుస్తూ 20వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుంది.  

‘గ్రీన్‌హౌస్‌’ ఉద్గారాల విడుదలలో చైనాకు 55వ స్థానం  
ప్రపంచంలో అత్యధిక గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను విడుదల చేసే చైనా 55వ స్థానంలో, రెండో అతిపెద్ద ఉద్గారాలను విడుదల చే­సే అ­మెరికా 57వ స్థానంలో నిలిచాయి. సీసీపీఐలో చివరి స్థానాల్లో ఇరా­న్‌­(67వ), సౌదీ అరేబియా(66వ), యూఏఈ(గతేడాది యూ­ఎన్‌ వా­తా­వరణ చర్చల హోస్ట్‌)(65వ), రష్యా (64వ) నిలిచాయి. ఈ నా­లు­గు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద చమురు, గ్యాస్‌ ఉ­త్పత్తిదారులు­గా ఉన్నాయి. 

 

ఆయా దేశాల్లో పునరుత్పాదక వస్తువుల వా­టా మూడు శాతం కంటే తక్కువ ఉంది. దేశాల వాతావరణ ఉపశ­మన పనితీరును జీహెచ్‌జీ ఉద్గారాలు, పునరుత్పాదక శక్తి, ఇంధన వి­నియోగం, వాతావరణ విధానం వంటి నాలుగు విభాగాల్లో అంచనా వేస్తున్నారు.  

దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. 
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినప్పటికీ భారత్‌లో తలసరి ఉద్గారాలు తక్కువని నివేదిక పేర్కొంది. తలసరి ఉద్గారాలు 2.9 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ సమానమైనవిగా ఉన్నాయి. ఇది ప్రపంచ సగటు 6.6 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే చాలా తక్కువగా ఉండటం విశేషం. 

పునరుత్పాదక ఇంధన వినియోగంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున సోలార్‌ పవర్‌  ప్రాజెక్టులు, రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ను ప్రారంభించడంలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్టు గుర్తు చేసింది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

అయితే బొగ్గుపై ఎక్కువగా ఆధార పడటాన్ని ఇండెక్స్‌ ఎత్తి చూపించింది. వాస్తవానికి బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న టాప్‌ 10 దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉండగా, నెమ్మదిగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. 

జీ20 దేశాల నుంచే 75శాతం ఉద్గారాలు 
జీ20 దేశాల్లో అమెరికా, చైనా, కెనడా(62వ), ఆస్ట్రేలియా(52వ), సౌత్‌ కొరియా (63వ), అర్జెంటీనా (59వ), జపాన్‌(58వ) వెనుక స్థానాల్లో నిలిచాయి. జీ20 దేశాలు ఉద్గారాలు తగ్గించడానికి బాధ్యత వహించాలని సీసీపీఐ చెబుతోంది. 

అందులో సభ్య దేశాల నుంచే 75శాతం కంటే ఎక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదల చేస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా ఇప్పటికీ దారుణమైన పనితీరును కనబరుస్తున్నాయి. 2015 పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలిగిన అర్జెంటీనా(59వ స్థానం) ఈ సంవత్సరం అత్యధికంగా వెనుకబడింది.  
 
గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు భారత్‌లో తక్కువే
మనదేశంలో కర్బన ఉద్గారాలు మిగతా అగ్ర దేశాలతో పోలిస్తే తక్కువేనని మరోసారి రుజువైంది. క్లైమేట్‌ చేంజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ 2025లో మనదేశం 10వ స్థానంలో నిలిచింది. యూరోపియన్‌ యూనియన్‌ సహా 90 దేశాల్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ నివేదిక విడుదల చేశారు. ప్రపంచ గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాల్లో సుమారు 90 శాతం ఈ దేశాల నుంచే వస్తున్నాయి. 

ఈ జాబితాలో 1, 2, 3 స్థానాల్లో ఉండేందుకు ఏ దేశమూ అర్హత సాధించలేకపోవడం విశేషం. 2019 నుంచీ మన దేశం ఈ జాబితాలో టాప్‌–10లో ఉంటూ వస్తోంది. జీ20 దేశాల్లో భారత్, యూకే మాత్రమే టాప్‌ 10లో స్థానం సంపాదించగలి­గా­యి. ఈ జాబితాలో చైనా 55, అమెరికా 57వ స్థానంలో నిలిచాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement