ఆదిలాబాద్ టౌన్: అడవుల జిల్లా.. ఆదిలాబాద్‌లో భానుడు భగ్గుమంటున్నాడు. సాధారణంగా మార్చి చివరి వారం తర్వాత పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన పది రోజుల నుంచి వేసవి తాపం మొదలైంది. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదు అయింది. ఉదయం 10 గంటలు దాటిందంటే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 5 దాటినా వేడి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ సారి ఏప్రిల్, మేలో ఉష్ణ్రోగ్రతలు 48 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువ నమోదైంది. ఈ సంవత్సరం జనవరిలో కనిష్ట ఉష్ణ్రోగ్రతలు 4 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. గతేడాది మేలో గరిష్ట ఉష్ణ్రోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇప్పటికే ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మండుటెండ..
ఎండలు మండిపోతున్నాయి. భూమి సెగలు కక్కుతుంది. వేడిగాలులు దడ పుట్టిస్తున్నాయి. తీవ్రమైన ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనం అల్లాడుతున్నారు. వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కాలేదు. ఎండలో పని చేసేవారు, తిరిగేవారు, వృద్ధులు, మద్యపానం సేవించేవారు తొందరగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడాలి.
చల్లని పానీయాలకు పెరిగిన గిరాకీ..
వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి జనం కొబ్బరినీళ్లు, తర్బుజా, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగుతున్నారు. ఎండలు మండుతుండడంతో ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాలలో కుల్‌డ్రింక్ షాపులు, జూస్ సెంటర్లు వెలశాయి. ఎండలో తిరిగే వాహనదారులు, కార్యాలయాల్లో పని చేసేవారు, ఫీల్డ్ వర్క్ చేసే వారు వేడిమికి తట్టుకోలేక కాసేపు సేద తీరి వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ రంజన్లకు కూడా గిరాకీ పెరిగాయి.
ఈసారి గరిష్ణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం..
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలలో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత ఎండలు మరింత పెరగనున్నాయి. గాలిలో తేమ తగ్గడం వల్ల వేసవిలో సాగు చేస్తున్న పంటలపై ప్రభావం పడి దిగుబడి తగ్గవచ్చు. గతేడాది మేలో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నీళ్ల గుణాన్ని బట్టి పంట తేమ సున్నిత దశలో దృష్టిలో పెట్టుకొని వేరుశనగలో 45 రోజుల నుంచి 80 రోజుల మద్యలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటలో కాయ అబివృద్ధి చేందే దశ నుంచి గింజ అభివృద్ధి వరకు 45–70 రోజుల మధ్యలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
– శ్రీధర్ చౌహన్, ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త
జాగ్రత్తలు తీసుకోవాలి
భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుంది. ఎండలో ఎక్కువ సేపు పనిచేయవద్దు. నీరు ఎక్కువగా తాగాలి. టోపి, నెత్తిన వస్త్రాలు కప్పుకోవాలి. గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. గ్లూకోజ్, ఎలక్ట్రోల్, ఓఆర్‌ఎస్‌ను నీటిలో కలిపి తరుచూ తాగాలి.
– డాక్టర్ సాధన,డిప్యూటీ డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment