ప్రపంచదేశాలు గ్లోబల్‌వార్మింగ్‌ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్‌లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెంది న ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
భారత్‌లోని తీరప్రాంత నగరమైన కోల్‌కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని వెల్లడించింది. తద్వారా భూ తాపం పెరిగి భారత్, పాకిస్తాన్‌లో తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 91 మంది నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
అంటువ్యాధుల విజృంభన..
ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదని ఐపీసీసీ తెలిపింది. తొలుత వాతావరణ మార్పులతో అతివృష్టి, ఆపై అనావృష్టి సంభవిస్తాయని నివేదికలో వెల్లడించింది. ‘ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కీటకాల ద్వారా వ్యాప్తిచెందే అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఓవైపు ఆహారకొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడతారు.
భారత్‌లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ఎండకు తోడు ప్రాణాంతకమైన వడగాలులు వీస్తాయి. ఇవి దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఉష్ణోగ్రతలు అదుపుకాకపోవడంతో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అతివృష్టి, అనావృష్టితో పాటు అంటువ్యాధుల దెబ్బకు నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీంతో పొట్టపోసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తారు. తద్వారా ప్రజల ఆదాయాలు భారీగా పడిపోతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అంతిమంగా తీవ్ర వినాశనం సంభవిస్తుంది’ అని ఐపీసీసీ తెలిపింది.
1.5 డిగ్రీలు నియంత్రిస్తే...
పోలండ్‌లోని కటోవిస్‌లో ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 14 వరకూ జరిగే వాతావరణ మార్పుల సదస్సులో ఈ నివేదికపై ప్రపంచదేశాలు చర్చించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించనున్నాయి. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపు నియంత్రించగలిగితే వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే కోట్లాది మంది ముప్పు నుంచి బయటపడతారు.
అలాగే ఆసియాలోని దేశాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల దిగుబడి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. 2050 నాటికి పేదరికం ఊహించినస్థాయిలో పెరగదు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాల పెరుగుదలను 10 సెం.మీ. మేరకు తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను 2035 నాటికి 45 శాతానికి తగ్గించాలని ఐపీసీసీ సూచించింది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురయ్యే పెనుముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment