ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాలస్తీనాకు భారత్ మద్దతు పలికింది. ఇక, ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ మాత్రం పాలస్తీనాకు అదనపు హక్కులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చార్టర్ కాపీని చించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
కాగా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనాకు భారత్ మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాకుండా పాలస్తీనా సభ్యత్వంపై భద్రతామండలి సానుకూలంగా వ్యవహరించాలని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
ఇక, శుక్రవారం ముసాయిదా తీర్మానం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ఆర్టికల్ 4 ప్రకారం, పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకోవాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి భారత్ సహా 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. తొమ్మిది దేశాలు వ్యతిరేకించగా మరో 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. దీంతో, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనాకు అన్ని అర్హతలు ఉన్నట్టు ఈ తీర్మానం తేల్చింది.
NEW: Israeli Ambassador to the UN Gilad Erdan shreds the UN charter with a mini shredder as the UN General Assembly supported a Palestinian bid to become a UN member.
Palestine does *not* have full UN membership, but they are now simply qualified to join.
The assembly adopted… pic.twitter.com/Fo1fty1RvW— Collin Rugg (@CollinRugg) May 10, 2024
ఇదిలా ఉండగా.. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్‌లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే, ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా.. అమెరికా వీటో చేసింది. కాగా, ప్రస్తుతం మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా పాల్గొనవచ్చు. ఈ మేరకు పాలస్తీనాకు అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా చేయాలని భద్రతా మండలిని అభ్యర్థించారు. అఖండ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందడంతో ఈ సమావేశంలో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment