యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే! | Ukraine-Russia and Palestine-Israel wars guest column by MLC MLC Ummareddy Venkateswarlu | Sakshi
Sakshi News home page

యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!

Published Sat, Nov 2 2024 8:20 AM | Last Updated on Sat, Nov 2 2024 10:30 AM

Ukraine-Russia and Palestine-Israel wars guest column by MLC MLC Ummareddy Venkateswarlu

విశ్లేషణ

ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్‌ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్‌ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.

ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్‌ అండ్‌ పీస్‌)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్‌ మహా రచయిత లియో టాల్‌స్టాయ్‌. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.

1910లో టాల్‌స్టాయ్‌ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.
1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్‌ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్‌ యూనియన్‌ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. 

అంతకుముందే ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్‌–ఇరాక్‌ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్‌ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్‌ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి.  

ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్‌–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్‌ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్‌ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. 

రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్‌ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్‌ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్‌ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్‌కు గానీ, ఇటు ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.

పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్‌కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్‌ స్టాక్‌ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్‌ కనుక తన హోర్ముజ్‌ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్‌ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్‌ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్‌ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్‌కు మద్దతుగా సూయిజ్‌ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్‌కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది.  

ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్‌ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్‌ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్‌ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్‌ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 

ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్‌ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్‌... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్‌ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్‌కు మేలు చేసేదే. అయితే, భారత్‌ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.

యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టం చేయడం ద్వారా భారత్‌ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్‌ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్‌ప్రదేశ్‌ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్‌ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.

నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్‌ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్‌ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్‌స్టాయ్‌ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది.    

-డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement