ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులు
హిందువులపై మరింతగా పెరిగిన ఛాందసవాదుల దాడులు
బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యర్థన
ప్రపంచంలో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం
దీనిలో సభ్యులుగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిందువులపై ఛాందసవాదుల దాడులు మరింతగా పెరిగాయి. అటువంటి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని అభ్యర్థించారు. అయితే ఈ దళం బంగ్లాదేశ్‌కు వచ్చి ఏం చేయనుంది? ఈ దళంలోని సభ్యుల కర్తవ్యం ఏమిటి?
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం అంటే ఏమిటి?
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం అనేది ప్రపంచంలో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు ఏర్పడిన విభాగం. ఇది ఆతిథ్య దేశాలను యుద్ధం నుండి శాంతి వైపునకు మళ్లించేందుకు కృషిచేస్తుంటుంది.
ఎప్పుడు ప్రారంభమైంది?
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ 1948, మే లో స్థాపితమయ్యింది. దీనిని యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్‌విజన్ ఆర్గనైజేషన్ (యూఎన్‌టీఎస్‌ఓ) అంటారు. ఇజ్రాయెల్- అరబ్ పొరుగు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించడం యూఎన్‌టీఎస్‌ఓ ఉద్దేశ్యం.
శాంతి పునరుద్ధరణకు కృషి
శాంతి పరిరక్షక దళం ఐక్యరాజ్యసమితిలో ఒక భాగం. ఇది హింసాత్మక దేశాలలో శాంతిని పునరుద్ధరించేందుకు ఏర్పడింది. దీనిలో సభ్యులుగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు ఉంటారు. ఏ దేశమైనా లేదా సంస్థ అయినా శాంతిని నెలకొల్పలేని పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి తన శాంతి పరిరక్షక దళం సభ్యులను ఆయా దేశాలలో మోహరిస్తుంది. ఈ నేపధ్యంలో శాంతి పరిరక్షక దళం సంక్లిష్టమైన అంతర్జాతీయ రాజకీయ సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.
శాంతి మిషన్‌తో భారత్‌కు సంబంధం ఏమిటి?
భారతదేశానికి 1945, అక్టోబర్ 24 నుంచి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌తో అనుబంధం ఏర్పడింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం సభ్యత్వం పొందింది. 2025-2026 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్ (పీబీసీ) సభ్యదేశంగా భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఈ మిషన్‌లో భారతదేశ ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుంది. పీబీసీలో 31 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక, సామాజిక మండలి నుండి ఎన్నికయ్యారు.
భారతదేశం అందించిన సహకారం ఇదే..
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో భారతదేశం కీలక భాగస్వామ్యం వహించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం ఇప్పటివరకు సుమారు 2,75,000 మంది సైనికులను అందించింది. భారతదేశం ప్రస్తుతం అబై, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సైప్రస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లెబనాన్, మిడిల్ ఈస్ట్, సోమాలియా, సౌత్ సూడాన్, పశ్చిమ సహారాలో 6,000 మంది సైనిక, పోలీసు సిబ్బందిని మోహరించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొన్న 180 మంది భారతీయ శాంతి పరిరక్షకులు అత్యున్నత త్యాగం చేశారు. ఇది ఇతర దేశంతో పోలిస్తే ఇది అత్యధిక సంఖ్య.
శాంతి పరిరక్షక దళం కార్యకలాపాలు..
యూఎన్‌ఓ శాంతి పరిరక్షక దళాలు 1991 నుండి అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో తలెత్తే సమస్యలను శాంతి పరిరక్షక దళం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి.. శాంతి పరిరక్షక దళాలను ఏ దేశానికి పంపాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. యూఎన్‌ఓ సెక్రటేరియట్‌లో దీనికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందిస్తారు. దీనిని అమలు చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌పై ఉంది.
శాంతి పరిరక్షక దళంలో సభ్యదేశాలు
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు చెందినవారు శాంతి పరిరక్షక దళంలో చేరవచ్చు. ఐక్యరాజ్యసమితి నిధి నుంచి దళ సభ్యులకు వేతనాన్ని అందిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా తమ ప్రత్యేక సాయుధ బలగాలను శాంతి పరిరక్షక దళానికి పంపుతాయి.
శాంతి పరిరక్షక దళం ఎదుర్కొనే సవాళ్లు..
రాజకీయ అస్థిరత: సంఘర్షణలు, హింసతో పాటు రాజకీయ అస్థిరత కలిగిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాలు పనిచేయాల్సి ఉంటుంది.
వనరుల కొరత: శాంతి పరిరక్షక దళాలు నిధులు, వివిధ పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది లాంటి వనరుల కొరతను ఎదుర్కొంటాయి.
సాంస్కృతిక, భాషాపరమైన అడ్డంకులు: శాంతి పరిరక్షక దళాలు వివిధ సాంస్కృతిక, భాషా నేపథ్యాలు కలిగిన ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ భిన్నత్వం కమ్యూనికేషన్ సహకారానికి అడ్డంకులను సృష్టిస్తుంది.
భద్రతా సవాళ్లు: శాంతి భద్రతల సభ్యులు తరచూ హింస, కిడ్నాప్‌లు, దాడులు వంటి భద్రతా సవాళ్లను ఎదుర్కొంటారు.
ప్రపంచ శక్తి సమతుల్యతలో మార్పులు: శాంతి పరిరక్షక దళాలు ప్రపంచ శక్తి సమతుల్యతలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న పోటీ శాంతి పరిరక్షక దళం లక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అంతర్జాతీయ సహకార లేమి: ఐక్యారాజ్య సమితి శాంతి పరిరక్షణకు అంతర్జాతీయ సహకారం 2011 నుండి క్షీణిస్తూ వస్తోంది. భారతదేశం, చైనా లాంటి కొన్ని ప్రభావవంతమైన దేశాలు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల విషయంలో ఉదాసీనంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంటుంది. అలాగే వివిధ పాశ్చాత్య దేశాల నుంచి కూడా శాంతి పరిరక్షక దళానికి పూర్తి సహకారం అందడం లేదనే వాదన ఉంది.
ఇది కూడా చదవండి: 2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment