Windy winds
-
కొహెడ ఘటనలో 26మందికి గాయాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొహెడలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్లోని షెడ్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హయత్ నగర్ అమ్మ ఆసుపత్రిలో 12 మంది, సన్‌రైజ్ లో నలుగురు, షాడో ఆసుపత్రిలో ఏడుగురు, మరో ముగ్గురు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. క్షతగ్రాతులకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విపరీతమైన సుడిగాలి వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేవు: ఎంపీ కోమటిరెడ్డి పండ్ల మార్కెట్లో కూలిపోయిన షెడ్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్రెడ్డి రామ్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పండ్ల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేమి తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదన్నారు. మార్కెట్లో భౌతిక దూరం పాటిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పండ్ల మార్కెట్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలి వాన బీభత్సం
-
సుర్రుమన్న ఛురు
న్యూఢిల్లీ: భారత్‌పై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శనివారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే వారం రోజులవరకూ దేశమంతటా ఇదేతరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పాలమ్ అబ్జర్వేటరీ తెలిపగా, 46.1 డిగ్రీలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఎండ తీవ్రతను సూచించే రెడ్ కేటగిరి హెచ్చరికను ఐఎండీ జారీచేసింది. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 49 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా బందాలో 48.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే ఐదు రోజులు మధ్యప్రదేశ్, రాజస్తాన్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హరియాణాలోని నర్నౌల్లో 47.2 డిగ్రీలు,పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45.7 డిగ్రీలు, లూథియానాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చల్లగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉనాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక జమ్మూకశ్మీర్‌లోని జమ్మూలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, హిమాచల్, తూర్పు మధ్యప్రదేశ్ ఉత్తర కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో సాధారణం కంటే 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. రాయలసీమ, కేరళ, విదర్భ, హరియాణాలోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా రికార్డైనట్లు పేర్కొంది. ఒడిశాలోని దక్షిణ భాగంలో అధికతేమ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. -
అమరావతిలో గాలివాన బీభత్సం
-
గాలివాన బీభత్సం.. అమరావతి అస్తవ్యస్తం
సాక్షి నెట్వర్క్: భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం. గతంలో వర్షాలకు తాత్కాలిక సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో నీరు కారడమే కాకుండా పెచ్చులూడి కింద పడిన సంగతి తెలిసిందే. గాలి వానకు హైకోర్టు ప్రాంగణంలోని పడిపోయిన సందర్శకుల షెడ్లు తాత్కాలిక హైకోర్టు వద్ద భయానక వాతావరణం రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. గాలి తీవ్రతకు ప్రధాన ద్వారం వద్ద పెద్ద గాజు తలుపు పగిలిపోయింది. హైకోర్టు ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిపై ఉన్న రేకులన్నీ ఎగిరిపోయాయి. హైకోర్టు పైన చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇనుప షీట్లు కూడా గాలికి కొట్టుకుపోయాయి. హైకోర్టు గోడలకు అమర్చిన రాజస్థాన్ టైల్స్ ముక్కలు ముక్కలయ్యాయి. హైకోర్టు సమీపంలోని అన్న క్యాంటీన్ అద్దాలు విరిగిపోయాయి. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో న్యాయవాదులెవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మహిళకు తీవ్ర గాయాలు గాలి తీవ్రతకు తాత్కాలిక హైకోర్టు వద్ద ఇనుప రేకులు గాల్లోకి ఎగిరాయి. అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళపై ఇనుప రేకు పడడంతో తీవ్రంగా గాయపడింది. తలకు సైతం బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. బాధితురాలిని పోలీసులు ‘108’ వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమణమ్మ తలకు వైద్యులు 8 కుట్లు వేశారు. కృష్ణా జిల్లాలో తెగిపోయిన కరెంటు తీగలు గాలివాన ధాటికి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరులో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వణుకూరు–మద్దూరు గ్రామాల మధ్యలో రోడ్డుపై హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెనమలూరు పల్లిపేటలో చెట్లు విరిగిపడడంతో ట్రాన్స్ఫారం నేలకూలింది. గోసాల నెహ్రూనగర్ వద్ద భారీ వృక్షం బందరు రోడ్డుపై పడిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోరంకిలో తాటిచెట్లు విద్యుత్ లైన్లపై పడటంతో కరెంటు తీగలు తెగిపోయాయి. స్తంభాలు పడిపోయాయి. చెట్టు కూలిపోయి వ్యక్తి మృతి కృష్ణా జిల్లాలో పెదపులిపాక గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్(56) అనే వ్యక్తి పశువులను మేపడానికి ఉంగరం కరకట్ట వద్దకు వెళ్లాడు. భీకర గాలులకు చెట్టు కూలి అతడిపై పడిపోయింది. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడి, మృతి చెందాడు. గుంటూరు జిల్లాలో పండ్ల తోటలు ధ్వంసం అకాల వర్షం కారణంగా గుంటూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ప్రజలు అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లో అరటి, మామిడి, సపోటా తోటలకు నష్టం వాటిల్లింది. మంగళగిరి నియోజకవర్గంలో వడగళ్ల వాన కురిసింది. పసుపు పంట వర్షం నీటికి తడిసిపోయింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పిడుగు పడి గొర్రెల కాపరి కావలి దానయ్య(20) మృతి చెందాడు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో పులిపాటి శ్రీనివాసరావుకు చెందిన గేదె పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. కొల్లిపర, తెనాలి మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేమూరు నియోజకవర్గంలో పెరవలిపాలెంలో అరటి తోటలు నేలకూలాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం వేమవరంలో స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులు నివాసం ఉంటున్న షెడ్లపై చెట్టు విరిగిపడడంతో మహిళకు గాయాలయ్యాయి. ఈదురుగాలులకు పూరిల్లు, గుడిసెలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. ‘పశ్చిమ’ ఏజెన్సీలో ఈదురు గాలులు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలుల వీచాయి. భారీ వర్షం కురిసింది. పోలవరం మండలంలోని వాడపల్లి నుంచి కొత్తూరు వరకు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. తల్లవరం, గాజులగొంది గ్రామాల్లో అరటి తోటలు పడిపోయాయి. కళ్లాల్లో మొక్కజొన్న పంట తడిచిపోయి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. గాజులగొంది గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగి పడిపోవడంతో మూలెం రామయ్యకు చెందిన ఎద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈదురుగాలుల వల్ల పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
గ్లోబల్ వార్మింగ్‌తో పెను వినాశనమే!
ప్రపంచదేశాలు గ్లోబల్‌వార్మింగ్‌ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెంది న ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని తీరప్రాంత నగరమైన కోల్‌కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని వెల్లడించింది. తద్వారా భూ తాపం పెరిగి భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 91 మంది నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అంటువ్యాధుల విజృంభన.. ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదని ఐపీసీసీ తెలిపింది. తొలుత వాతావరణ మార్పులతో అతివృష్టి, ఆపై అనావృష్టి సంభవిస్తాయని నివేదికలో వెల్లడించింది. ‘ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కీటకాల ద్వారా వ్యాప్తిచెందే అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఓవైపు ఆహారకొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడతారు. భారత్‌లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ఎండకు తోడు ప్రాణాంతకమైన వడగాలులు వీస్తాయి. ఇవి దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఉష్ణోగ్రతలు అదుపుకాకపోవడంతో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అతివృష్టి, అనావృష్టితో పాటు అంటువ్యాధుల దెబ్బకు నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీంతో పొట్టపోసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తారు. తద్వారా ప్రజల ఆదాయాలు భారీగా పడిపోతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అంతిమంగా తీవ్ర వినాశనం సంభవిస్తుంది’ అని ఐపీసీసీ తెలిపింది. 1.5 డిగ్రీలు నియంత్రిస్తే... పోలండ్‌లోని కటోవిస్‌లో ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 14 వరకూ జరిగే వాతావరణ మార్పుల సదస్సులో ఈ నివేదికపై ప్రపంచదేశాలు చర్చించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించనున్నాయి. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపు నియంత్రించగలిగితే వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే కోట్లాది మంది ముప్పు నుంచి బయటపడతారు. అలాగే ఆసియాలోని దేశాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల దిగుబడి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. 2050 నాటికి పేదరికం ఊహించినస్థాయిలో పెరగదు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాల పెరుగుదలను 10 సెం.మీ. మేరకు తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను 2035 నాటికి 45 శాతానికి తగ్గించాలని ఐపీసీసీ సూచించింది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురయ్యే పెనుముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలమని స్పష్టం చేసింది. -
గంటలో కుండపోత
సాక్షి, హైదరాబాద్ : గాలివాన బీభత్సం మరోసారి హైదరాబాద్ నగరాన్ని వణికించింది. దట్టంగా కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు, ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో జడివాన కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి 4.30 గంటల వరకు వర్షం పడింది. నాంపల్లి, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో దాదాపు గంట వ్యవధిలోనే నాలుగు సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడం గమనార్హం. ఇక గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీయడంతో.. పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లు, షెడ్డులపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో నగరంలో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బందిని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టింది. జడివానతో ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తడంతో సుమారు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరమంతా బీభత్సం హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన జడివానతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గాలివానకు చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటం, పలు చోట్ల స్తంభాలు కూడా పడిపోవడంతో 300 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్యారడైజ్, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. జీహెచ్ఎంసీ హైఅలర్ట్ జడివాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బంది వెంటనే రోడ్లు, విద్యుత్ లైన్లపై విరిగిపడిన చెట్లను తొలగించే పనిలో పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో.. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. నేడు కూడా వానలు.. రాష్ట్రం మీదుగా ఉపరితల ద్రోణి, ఆవర్తనం ఉండటంతోపాటు అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ఉధృతి కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. వర్షం బీభత్సం సృష్టించిందని బేగంపేట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. అంబర్‌పేట్‌లో 4.9 సెంటీమీటర్లు, నారాయణగూడలో 4.2, శ్రీనగర్‌కాలనీ, నాంపల్లిలలో 4.1, గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌లలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బంజారాహిల్స్‌లో ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం -
ప్రకృతి ప్రకోపానికి 86 మంది మృతి
న్యూఢిల్లీ: బలమైన ఈదురు గాలులు, ఇసుక తుపాను, పిడుగుపాట్లతో సంభవించిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఆది,సోమవారాల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే 136 మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. మొత్తం మృతుల్లో 51 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనంది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది, పశ్చిమబెంగాల్లో 14 మంది, బిహార్‌లో ఆరుగురు, ఢిల్లీలో ఇద్ద రు, ఉత్తరాఖండ్‌లో మరొకరు చనిపోయారంది. మరోవైపు మంగళవారం ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు. -
ఇసుక తుఫాన్‌తో అతలాకుతలం..
♦ 40 కి.మీ వేగంతో వీస్తున్న పడమటి గాలులు ♦ రోడ్డు, పంటలను కప్పేస్తున్న ఇసుక ♦ ఇళ్లల్లోకి దూసుకొస్తున్న ఇసుక రేణువులు అనంతపురం: ఇసుక తుఫాన్‌తో ఆ పల్లెవాసులు అతలాకుతలమవుతున్నారు. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని 20 గ్రామాల్లో విస్తరించిన ఇసుక మేటలు నిత్యం రహదారులను కప్పి వేస్తున్నాయి. దీంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గోవిందవాడ, దర్గాహొన్నూరు, మాల్యం, నాగేపల్లి గ్రామాల వద్ద ఈ ఇసుక ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. మీన్లపల్లిలో ఇసుకమేటలకు ఆనుకుని ఉన్న 20 కుటుంబాలకు పైగా వారు ఇళ్లు ఖాళీ చేసి, చేరువలో ఉన్న మరో మెట్ట భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. ఆషాఢ మాసంలో వీచే పడమటి గాలులు తీవ్ర ప్రతాపం చూపుతుండటంతో ఇంటి నిండా ఇసుక చేరుకుంటోంది. మొలకెత్తిన పంటనూ కప్పేస్తుండటంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు గాలులకు అడ్డంగా కంది, పత్తి కట్టె లాంటి వాటిని ప్రహరీగా నిర్మిస్తున్నారు. గాలులు వేగంగా వీచినా పంటను ఇసుక కప్పేయకుండా అవి నివారిస్తాయి. ఖరీఫ్‌కు గడ్డు పరిస్థితులు.. సాధారణంగా వర్షాలు కురవడానికి పది కిలోమీటర్లలోపు వేగంతో గాలులు వీయాలి. గాలితో తేమ శాతం 60 నుంచి 70 శాతం వరకు ఉండాలి. అప్పుడే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ఉద్ధృతికి మేఘాలు చెదిరిపోతున్నాయి. అరకొరగా వస్తున్న మేఘాలను సైతం గాలుల వేగం తరిమేస్తోంది. తేమ శాతం తక్కువగా ఉండటంతో వర్షాలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఖరీఫ్ సాగుకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగు కావాల్సి ఉంది. వర్షా భావ పరిస్ధితుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.