ఇసుక తుఫాన్‌తో అతలాకుతలం..
♦ 40 కి.మీ వేగంతో వీస్తున్న పడమటి గాలులు
♦ రోడ్డు, పంటలను కప్పేస్తున్న ఇసుక
♦ ఇళ్లల్లోకి దూసుకొస్తున్న ఇసుక రేణువులు
అనంతపురం: ఇసుక తుఫాన్‌తో ఆ పల్లెవాసులు అతలాకుతలమవుతున్నారు. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని 20 గ్రామాల్లో విస్తరించిన ఇసుక మేటలు నిత్యం రహదారులను కప్పి వేస్తున్నాయి. దీంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గోవిందవాడ, దర్గాహొన్నూరు, మాల్యం, నాగేపల్లి గ్రామాల వద్ద ఈ ఇసుక ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. మీన్లపల్లిలో ఇసుకమేటలకు ఆనుకుని ఉన్న 20 కుటుంబాలకు పైగా వారు ఇళ్లు ఖాళీ చేసి, చేరువలో ఉన్న మరో మెట్ట భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు.
ఆషాఢ మాసంలో వీచే పడమటి గాలులు తీవ్ర ప్రతాపం చూపుతుండటంతో ఇంటి నిండా ఇసుక చేరుకుంటోంది. మొలకెత్తిన పంటనూ కప్పేస్తుండటంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు గాలులకు అడ్డంగా కంది, పత్తి కట్టె లాంటి వాటిని ప్రహరీగా నిర్మిస్తున్నారు. గాలులు వేగంగా వీచినా పంటను ఇసుక కప్పేయకుండా అవి నివారిస్తాయి.
ఖరీఫ్‌కు గడ్డు పరిస్థితులు..
సాధారణంగా వర్షాలు కురవడానికి పది కిలోమీటర్లలోపు వేగంతో గాలులు వీయాలి. గాలితో తేమ శాతం 60 నుంచి 70 శాతం వరకు ఉండాలి. అప్పుడే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ఉద్ధృతికి మేఘాలు చెదిరిపోతున్నాయి. అరకొరగా వస్తున్న మేఘాలను సైతం గాలుల వేగం తరిమేస్తోంది. తేమ శాతం తక్కువగా ఉండటంతో వర్షాలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఖరీఫ్ సాగుకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగు కావాల్సి ఉంది. వర్షా భావ పరిస్ధితుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.