సచివాలయం వద్ద కుండపోత వర్షం
సాక్షి, హైదరాబాద్ : గాలివాన బీభత్సం మరోసారి హైదరాబాద్ నగరాన్ని వణికించింది. దట్టంగా కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు, ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో జడివాన కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి 4.30 గంటల వరకు వర్షం పడింది. నాంపల్లి, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో దాదాపు గంట వ్యవధిలోనే నాలుగు సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడం గమనార్హం. ఇక గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీయడంతో.. పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లు, షెడ్డులపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో నగరంలో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బందిని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టింది. జడివానతో ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తడంతో సుమారు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
నగరమంతా బీభత్సం
హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన జడివానతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, గచ్చిబౌలి, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గాలివానకు చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటం, పలు చోట్ల స్తంభాలు కూడా పడిపోవడంతో 300 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్యారడైజ్, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల అపార్ట్‌మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి.
జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్
జడివాన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బంది వెంటనే రోడ్లు, విద్యుత్ లైన్లపై విరిగిపడిన చెట్లను తొలగించే పనిలో పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో.. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు.
నేడు కూడా వానలు..
రాష్ట్రం మీదుగా ఉపరితల ద్రోణి, ఆవర్తనం ఉండటంతోపాటు అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ఉధృతి కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. వర్షం బీభత్సం సృష్టించిందని బేగంపేట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. అంబర్‌పేట్‌లో 4.9 సెంటీమీటర్లు, నారాయణగూడలో 4.2, శ్రీనగర్‌కాలనీ, నాంపల్లిలలో 4.1, గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌లలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
బంజారాహిల్స్‌లో ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు
బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం
Comments
Please login to add a commentAdd a comment