Cumulonimbus Clouds
-
హైదరాబాద్‌లో రికార్డు వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో శుక్రవారం మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కురిసిన హోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేయడంతో నగరం నిండా ముని గింది. మూడు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5–8 గంటల మధ్యన అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీ మీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. ఖైరతా బాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ 12 సెం. మీ.కి పైగా వర్షం కురిసింది. గతంలో 2013 అక్టో బర్లో బేగంపేట్‌లో రెండుగంటల వ్యవధిలో 9.8 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఆ తరవాత ఇప్పుడే రికార్డుస్థాయిలో జడివాన కురిసినట్లు బేగం పేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో పలు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీ మీటర్ల జడి వాన కురియడంతో ప్రధాన రహదా రులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. సుమారు వంద సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభిం చింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వరద నీటిలో వాహనాలు నిలిచిపోయి నానా అవస్థలు పడ్డారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. వర్ష బీభత్సానికి పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపడి కొన్నిగంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షబీభత్సం ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు లోతట్టు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. విద్యుత్ హైఅలర్ట్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీవర్షం కురిసిన నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండి జి.రఘుమారెడ్డి నగరంలోని విద్యుత్‌శాఖ చీఫ్ జనరల్ మేనేజర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షబీభత్సం కారణంగా రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని కోరారు. వోల్టేజ్లో హెచ్చుతగ్గులున్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 నంబర్లకు, స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌లకు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లోని 7382072104, 7382072106, 7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. నేడు వాయుగుండం ఉత్తర అండమాన్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. ఇది ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఉత్తర అండమాన్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపొస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శనివారం మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంలో అక్టోబర్ 12వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
నల్లని మబ్బు చల్లని కబురేనా?
సాక్షి, హైదరాబాద్: మొన్న రామగుండంలో 26 సెంటీమీటర్లు.. నిన్న నల్లగొండలో 20 సెంటీమీటర్లు.. ఇలా రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతతో కుమ్మేస్తు న్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్ణీత ప్రాంతాల్లో ఒకేసారి కుండపోతగా కురుస్తుండటానికి క్యుములో నింబస్ మేఘాలే కారణం. సాధారణంగా వేస విలో అధికంగా వచ్చే క్యుములోనింబస్ మేఘాలు వానాకాలంలోనూ ఏర్పడ్డాయంటే.. వాతా వరణంలో వచ్చిన మార్పులే కారణమని అధి కారులు పేర్కొంటున్నారు. నల్లగొం డలో అప్పటికప్పుడు పరిస్థితులు మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి తక్కువ సమయంలో 20సెం.మీ. వర్షం కురిసింది. ఎలా ఏర్పడతాయంటే.. క్యుములోనింబస్ మేఘాలు సహజంగా తేమ గాలులు, పొడిగాలులు వ్యతిరేక దిశలో వచ్చి ఒకేచోట కలవడం వల్ల ఏర్పడతాయి. సాధారణ మేఘాలు సమాంతరంగా వ్యాపిస్తే, క్యుములో నింబస్ మేఘాలు మాత్రం భూమి నుంచి పైకి నిట్టనిలువుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడ తాయి. ఇవి ఏర్పడితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తాయి. తక్కువ సమయంలో కుంభవర్షం కురుస్తుంది. ఇటీవల రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసిన అన్ని సంద ర్భాల్లోనూ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు చెబుతున్నారు. ఆగ్నేయం నుంచి తేమ గాలులు, ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వచ్చి సంఘర్షించుకోవడం వల్ల నల్లగొండలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు. వాతావరణంలో అనూహ్యమార్పులు.. భూతాపం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడుతున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాల కాలం ఈ నెలాఖరుకు ముగియాల్సి ఉండగా, అక్టోబర్ వరకూ కొనసాగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ అధికారులు అంటున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అంటే సకాలంలో నైరుతి ప్రవేశించి ఉంటే ఈ నెలాఖరుకు వర్షాలు తగ్గుముఖం పట్టాలి. కానీ సీజన్ దారితప్పడంతో వచ్చే నెల వరకు కొనసాగే పరిస్థితి నెలకొంది. గతేడాది మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకితే, ఈసారి జూన్ 8న తాకాయి. దీనివల్ల ఈసారి జూలై 20 వరకు తెలంగాణలో వర్షాలే కురవలేదు. దీనివల్ల పత్తి సాగు ఆలస్యమైంది. ఆలస్యం కారణంగా పత్తికి గులాబీ రంగు పురుగు సోకింది. కాగా, ఆగస్టులోనే వరినాట్లు పడాల్సి ఉండగా, సెప్టెంబర్‌లోనూ కొనసాగుతున్నాయి. అక్టోబర్ వరకు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. ఇలా సీజన్ ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల పంటల ఉత్పాదకత, నాణ్యత పడిపోయే ప్రమాదం ఉంది. చీడపీడలు పట్టిపీడిస్తాయి. జ్వరాల విజృంభణ.. కాలం కాని కాలంలో వర్షాలు కురవడం వల్ల దోమలు పెరుగుతాయి. విషజ్వరాలు వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జ్వరాలు పెరిగాయి. డెంగీ ప్రభావం తెలంగాణ అంతటా కనిపిస్తోంది. భూతాపం వల్ల ఎండల తీవ్రత పెరిగింది. 2018లో 8 వడగాడ్పుల రోజులు నమోదైతే, ఈ ఏడాది వేసవి కాలంలో ఏకంగా 44 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. అతి ఎండలు, అతి వర్షాలు రెండూ కూడా వాతావరణంలో మార్పుల వల్లే ఏర్పడుతున్నాయని రాజారావు అంటున్నారు. గ్లోబల్‌వార్మింగ్ వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురవగా, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షం కురిసింది. దేశంలోనూ ఇటువంటి పరిస్థితే ఉందని, వాతావరణంలో మార్పులే ఇందుకు కారణమని మరో వాతావరణ విశ్లేషకుడు కమలనాథ్ పేర్కొన్నారు. బలహీనపడిన ఎల్‌నినో.. జూన్, జూలై వరకు రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు పుంజుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పుడు వర్షాలు తక్కువ పడడానికి ఎల్‌నినో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎల్‌నినో మరింత బలహీనంగా మారింది. దీంతో వర్షాలు మరింత పుంజుకున్నాయని కమల్‌నా«థ్ చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎలినినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలïßహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్‌నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆగస్టు నుంచి బలహీన పడడంతో వర్షాలు పుంజుకోవడం జరిగిందని అంటున్నారు. -
గర్జించిన క్యుములోనింబస్!
సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాలు భాగ్యనగరంపై మళ్లీ గర్జించాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నగరంలో పలు చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండ పోతకు గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఆసిఫ్‌నగర్, చార్మినార్, విరాట్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా సద్దుల బతుకమ్మ వేడుకలకు తీవ్ర ఆటంకం కలిగింది. దసరా సందర్భంగా షాపింగ్, దూర ప్రాంతాలకు బయలుదేరిన వారు వర్షంలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. పలు ప్రధాన రహదారులపై నడుములోతున వరదనీరు పోటెత్తడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు భారంగా ముందు కు కదిలాయి. భారీ వర్షానికి చాలాచోట్ల దాదాపు 2–4 గంటల పాటు ట్రాఫిక్ జాం నగరవాసులకు నరకం చూపించింది. సాయంత్రం 6 గంటల వరకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లోనూ ఈ మేఘాల ప్రభావంతో పలుచోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అధికార యంత్రాంగం అలర్ట్ భాగ్యనగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల మధ్య భారీ వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు, వర్షాకాల అత్యవసర బృందా లు రంగంలోకి దిగాయి. నగరంలో పలు ప్రాంతాల్లో జడివాన ఉధృతి నేపథ్యంలో.. అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ సమీక్ష నిర్వహించారు. వర్షం కురిసే ప్రాంతాల్లో తాత్కాలికంగా పర్యటనలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ట్యాంక్‌బండ్, కోఠి, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హైదర్ గూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రోడ్లపై ఎక్కడికక్కడే నీరు నిలవడంతో రోడ్లపై చిన్న కొట్లు పెట్టుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను సమీక్షించారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగటమే! ఇటీవల దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగిన కారణంగా భూవాతావరణం వేడెక్కింది. ఈ తరుణం లో బుధవారం ఒక్కసారిగా అండమాన్ నికోబార్, తూర్పు దిశ నుంచి వీస్తున్న తేమగాలులు నగరాన్ని తాకడంతో అకస్మాత్తుగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుండపోత కురిసిందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో అస్థిర పరిస్థితులు చోటుచేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. తరచుగా వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు.. ఈ సారి వర్షాకాలం పూర్తవుతున్న సమయంలో ఏర్పడుతున్నాయని రాజారావు వెల్లడించారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి రుతుపవనాలు ఈ నెల 20వ తేదీ నాటికి దేశం నుండి పూర్తిగా ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తదుపరి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. -
ఏపీలో పెనుగాలులు, పిడుగుల వానలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం ప్రతాపం చూపనుంది. రుతుపవనాల ఆగమనానికి ముందు ఒక్కసారిగా అలజడి రేగనుంది. భారీ గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు ఆవల సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్(తూర్పు, పశ్చిమ గాలుల కలయిక) కూడా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమ గాలులు, ఉత్తరాది నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం తెలిపింది. ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షం, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశానికి ముందు ఇలాంటి వాతావరణ పరిస్థితులు సహజమేనని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 39 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. గత 24 గంటల్లో అమరాపురంలో 13, ఆత్మకూరులో 9, తిరువూరు 8, అవుకు 7, చిలమత్తూరు, లేపాక్షి, గజపతినగరంలలో 6, బలిజపేట, రోళ్ల, వెంకటగిరి, పలమనేరుల్లో 5, పాడేరు, చోడవరంలలో 4 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
గంటలో కుండపోత
సాక్షి, హైదరాబాద్ : గాలివాన బీభత్సం మరోసారి హైదరాబాద్ నగరాన్ని వణికించింది. దట్టంగా కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు, ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో జడివాన కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి 4.30 గంటల వరకు వర్షం పడింది. నాంపల్లి, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో దాదాపు గంట వ్యవధిలోనే నాలుగు సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడం గమనార్హం. ఇక గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీయడంతో.. పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లు, షెడ్డులపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో నగరంలో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బందిని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టింది. జడివానతో ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తడంతో సుమారు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరమంతా బీభత్సం హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన జడివానతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గాలివానకు చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటం, పలు చోట్ల స్తంభాలు కూడా పడిపోవడంతో 300 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్యారడైజ్, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. జీహెచ్ఎంసీ హైఅలర్ట్ జడివాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. సిబ్బంది వెంటనే రోడ్లు, విద్యుత్ లైన్లపై విరిగిపడిన చెట్లను తొలగించే పనిలో పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో.. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. నేడు కూడా వానలు.. రాష్ట్రం మీదుగా ఉపరితల ద్రోణి, ఆవర్తనం ఉండటంతోపాటు అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ఉధృతి కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. వర్షం బీభత్సం సృష్టించిందని బేగంపేట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. అంబర్‌పేట్‌లో 4.9 సెంటీమీటర్లు, నారాయణగూడలో 4.2, శ్రీనగర్‌కాలనీ, నాంపల్లిలలో 4.1, గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌లలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బంజారాహిల్స్‌లో ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం -
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్ : క్యుములోనింబస్ మేఘాల కారణంగా రుతుపవనాలు రాకముందే వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. తర్వాత వాతావరణం మేఘాలు కమ్ముకుని, కొన్నిచోట్ల వర్షం పడింది. పలుచోట్ల బలమైన గాలులు వీచాయి. నగరంలో ఇంకా మేఘాలు కమ్ముకున్నాయి. కాగా, తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రానున్న నాలుగైదు రోజుల వరకు ఇదే రకమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకేరోజు భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
క్యుములోనింబస్ మేఘాలు ఎలా ఏర్పడతాయి?
-
క్యుములోనింబస్ కుమ్మేసింది
గ్రేటర్ శివార్లలో కుండపోత ∙కీసరలో అత్యధికంగా 17.4 సెం.మీ. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లను దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేశాయి. జడివానతో దడ పుట్టిం చాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు కురిసిన కుండపోత వర్షానికి శివారు ప్రాంతాలు విలవిలలాడాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లు, సెల్లార్లలోకి భారీగా చేరిన వరదనీటిని తోడేందుకు స్థానికులు, జీహెచ్ ఎంసీ అత్యవసర సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. పలు కాలనీలు, బస్తీల్లో రహదారు లపై మొకాలి లోతు వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి నాచారం, కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కీసర, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్ తదితర ప్రాంత వాసులు బెంబేలెత్తారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోతట్టుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జాగారం చేయాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. సెల్లార్లలో నీటిని తోడిన తరవాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. క్యుములోనింబస్ మేఘాలే కారణం.. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం, కర్ణాటక మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా బుధవారం సాయం త్రం ఒక్కసారిగా ఉధృతమైన క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్కసారిగా కారుచీకట్లు అలముకొని భారీ వర్షం కురిసిందని తెలిపారు. కీసరలో అత్యధికంగా 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఎల్లుండి వరకు ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్, సంగారెడ్డి, తాండూరులో గరిష్టంగా 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. -
ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు అలముకున్నాయి. చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా, యారాడ బీచ్‌లో యువకుడిని రక్షించబోయిన గజ ఈతగాడు మహేష్ గల్లంతయ్యారు. -
'క్యుములోనింబస్ మేఘాలే కారణం'
విశాఖపట్నం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. క్యుములో నింబస్ మేఘాలే కారణమని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం, సీతానగరం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాల వర్షం కారణంగా వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. తగరపువలసలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది.