సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం ప్రతాపం చూపనుంది. రుతుపవనాల ఆగమనానికి ముందు ఒక్కసారిగా అలజడి రేగనుంది. భారీ గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు ఆవల సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్(తూర్పు, పశ్చిమ గాలుల కలయిక) కూడా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమ గాలులు, ఉత్తరాది నుంచి వేడి గాలులు వీస్తున్నాయి.
వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం తెలిపింది. ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షం, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశానికి ముందు ఇలాంటి వాతావరణ పరిస్థితులు సహజమేనని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.
కాగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 39 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. గత 24 గంటల్లో అమరాపురంలో 13, ఆత్మకూరులో 9, తిరువూరు 8, అవుకు 7, చిలమత్తూరు, లేపాక్షి, గజపతినగరంలలో 6, బలిజపేట, రోళ్ల, వెంకటగిరి, పలమనేరుల్లో 5, పాడేరు, చోడవరంలలో 4 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment