వర్షాకాలంలో తరచూ పిడుగులు పడి మనుషులూ, పశువులూ చనిపోవడం తెలిసిందే. నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు. వర్షం రాగానే చెట్ల కిందికి పరుగెత్తకూడదు. ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం. చెట్లు, స్తంభాల కిందకు వెళ్లకుండా ఇళ్లకు, సురక్షిత భవనాలకు చేరుకోవాలి. కారులో ఉంటే అందులో కూర్చొని, కిటికీ అద్దాలు మూసివేయాలి. చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి. లోహపు తలుపులను తాకరాదు. ఇంటిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. విద్యుత్ పరికరాలను ఆపేయాలి. ఛార్జింగ్ చేస్తున్న ఫోన్ తాకకూడదు. కాంక్రీటు గోడలను, నేలను తాకకూడదు. బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉండకూడదు. నల్లా నీటిని తాకరాదు. తాము నిలబడిన భూమి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే దగ్గరలో పిడుగు పడితే విద్యుత్‌ఘాతానికి గురి కావచ్చు.
చర్మంపై గుచ్చినట్లున్నా, వెంట్రుకలు నిక్క బొడిచినా వెంటనే పిడుగు పడబోతోందని అర్థం (ఈ సూచికలు గుర్తించే అవకాశం ప్రతిసారీ ఉండక పోవచ్చు). పొలాల్లో ఉన్నప్పుడు కాలి మునివేళ్ళ పైన తల వంచి, చెవులు మూసుకొని కూర్చోవడం ఒక మార్గం. ఇందువల్ల నేరుగా పిడుగు పడే అవకాశాలు తగ్గుతాయి. రెండు కాలి మడమలు ‘V’ ఆకారంలో వెనక తాకి ఉండాలి. ఇందువల్ల భూమిపై పిడుగు పడితే ఒక కాలిలోకి ప్రవేశించిన విద్యుత్ మరో కాలిలోంచి భూమిలోకి త్వరగా వెళ్ళిపోతుంది.
అడవిలో ఉంటే గుంపుగా ఉన్న చిన్న చెట్ల కింద ఉండవచ్చు. అప్పటికే కొండపై ఉంటే ఏదేని గుహ కనిపిస్తే వెళ్ళవచ్చు. తాటి చెట్లు ఎత్తుగా, తడిగా ఉండటం వల్ల సహజంగా పిడుగులను ఆకర్షించి భూమిలోకి విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇంటిలో ఉండడం క్షేమమే, అయినా పక్కనే పెద్ద చెట్టు ఉంటే ఏమి జరుగుతుందో సూర్యారావుపాలెం పిడుగుపాటు చెబుతోంది. చెట్టుకు దగ్గరలో ఎండు కర్రలు, దహనశీల పదార్థాలు ఉంటే అగ్ని తీవ్రత పెరుగుతుంది. కానీ అసలు చెట్లే లేకపోతే మైదాన ప్రాంతంలో కూడా పిడుగు పడుతుంది. కనుక గ్రామాల్లో చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండేట్లు పై కొమ్మలు తొలగిస్తే ప్రమాదావకాశాలు కొంత తగ్గుతాయి. మైదాన ప్రాంతంలో ఉండే పాన్ డబ్బాల దగ్గర మరీ ప్రమాదకరం.
చదవండి: చలికాలంలో పొంచివున్న వ్యాధులు.. జాగ్రత్తలు ఇవే
‘పిడుగు వాహకాలు’ (లైట్నింగ్ కండక్టర్) గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇవి 20 ఏళ్ళకు పైగా పని చేస్తాయి. పిడుగు వాహకాలు కొద్ది మీటర్ల మేరకే రక్షణ కల్పిస్తాయి గనుక అన్ని ఎత్తైన ఇళ్ళపై ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర భూవిజ్ఞాన శాఖ ‘దామిని’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. రానున్న 40 నిమిషాల్లో చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment