
చెరువు కాదు రోడ్డే... నీట మునిగిన మూసాపేట శ్రీహరినగర్ రోడ్డు
గ్రేటర్ శివార్లలో కుండపోత ∙కీసరలో అత్యధికంగా 17.4 సెం.మీ.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లను దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేశాయి. జడివానతో దడ పుట్టిం చాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు కురిసిన కుండపోత వర్షానికి శివారు ప్రాంతాలు విలవిలలాడాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లు, సెల్లార్లలోకి భారీగా చేరిన వరదనీటిని తోడేందుకు స్థానికులు, జీహెచ్ ఎంసీ అత్యవసర సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. పలు కాలనీలు, బస్తీల్లో రహదారు లపై మొకాలి లోతు వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు.
భారీ వర్షానికి నాచారం, కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కీసర, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్ తదితర ప్రాంత వాసులు బెంబేలెత్తారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోతట్టుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జాగారం చేయాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. సెల్లార్‌లలో నీటిని తోడిన తరవాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు.
క్యుములోనింబస్ మేఘాలే కారణం..
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం, కర్ణాటక మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా బుధవారం సాయం త్రం ఒక్కసారిగా ఉధృతమైన క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్కసారిగా కారుచీకట్లు అలముకొని భారీ వర్షం కురిసిందని తెలిపారు. కీసరలో అత్యధికంగా 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఎల్లుండి వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్, సంగారెడ్డి, తాండూరులో గరిష్టంగా 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది.