జెన్‌కో సొమ్ము ‘బొగ్గు’ పాలు
నాణ్యతలేని బొగ్గు, అధిక ధరలు, రవాణా లోపాలపై కాగ్ మొట్టికాయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇంధన నిర్వహణ లోపాలను కాగ్ ఎత్తిచూపింది. 2010-15 మధ్య బొగ్గు నాణ్యతలో లోపాలతో రూ. 2,082.44 కోట్లు, అధిక ధరతో అదనపు బొగ్గు కొనుగోళ్లతో రూ.170 కోట్లు, మండకుండా మిగిలిన బొగ్గును బూడిద పాలు చేసి రూ.66.73 కోట్లు, బొగ్గు రవాణాలో లోపాలతో సుమారు రూ.20 కోట్లను జెన్‌కో యాజమాన్యం దుబారా చేసిందని స్పష్టం చేసింది.
బొగ్గు కొనుగోలు చేసి బిల్లులో పేర్కొన్న ‘స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ)’కు, విద్యుత్ కేంద్రంలో వినియోగించినప్పుడు వచ్చిన ‘జీసీవీ’కి వ్యత్యాసం అధికంగా ఉందని.. దాంతో 2010-15 మధ్య ఏకంగా రూ.2,082.44 కోట్ల విలువైన 76.02 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వినియోగించాల్సి వచ్చిందని కాగ్ ఆక్షేపించింది. బొగ్గులోని మండే సామర్థ్యాన్నే కెలోరిఫిక్ విలువ అంటారు. దీన్నే బొగ్గు నాణ్యతగా పరిగణించి ధరను నిర్ణయిస్తారు. కేంద్ర విద్యుత్ పరిశోధన సంస్థ (సీపీఆర్‌ఐ) మార్గదర్శకాల ప్రకారం బిల్లు చేసినప్పటితో పోలిస్తే... వినియోగ సమయంలో బొగ్గు జీసీవీ విలువ వ్యతాస్యం 150 కిలో కేలరీస్/కేజీలోపు మాత్రమే ఉండాలి.
కానీ పలు విద్యుత్ కేంద్రాల్లో ఈ వ్యత్యాసం ఏకంగా 300-500 జీసీవీ వరకూ ఉందని కాగ్ స్పష్టం చేసింది. బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసమున్నట్లు జెన్‌కో యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వ నూతన బొగ్గు విధానం 100 శాతం బొగ్గు సరఫరాకు హామీ ఇచ్చినా... బొగ్గు అవసరమైనప్పుడు కేంద్రాన్ని సంప్రదించకుండా జెన్‌కో అధిక ధరతో బొగ్గు కొనుగోళ్లు చేసిందని కాగ్ ఎత్తిచూపింది. తద్వారా 2011-12 నుంచి 2014-15 మధ్య రూ.170.56 కోట్లను అదనంగా ఖర్చు చేసిందని తప్పుబట్టింది.
జెన్‌కో విద్యుత్ కేంద్రాల వద్ద 2010-15 మధ్యకాలంలో రూ.66.73 కోట్లు విలువ చేసే 3.53 లక్షల టన్నుల బొగ్గు బూడిద పాలైంది. విద్యుత్ కేంద్రంలో మండిపోకుండా ఫ్లైయాష్, బాటమ్ యాష్‌లో మిగిలిపోయిన బొగ్గు పరిమాణం అధికంగా ఉందని కాగ్ తేల్చింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 20 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా సలహాలు, సివిల్ పనుల కోసం సింగరేణి సంస్థ రూ.4.35 కోట్లను ఖర్చు చేసిందని... కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణ ఆలోచనను విరమించుకుందని కాగ్ పేర్కొంది.
78 శాతం పెరిగిన విద్యుదుత్పత్తి వ్యయం
ఐదేళ్లలో జెన్‌కో విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పత్తి వ్యయం 78% పెరిగిందని కాగ్ తేల్చింది. 2010-11లో రూ.2.01గా ఉన్న యూనిట్ విద్యుదుత్పత్తి వ్యయం 2014-15 నాటికి రూ.3.58కి పెరిగిపోయిందని పేర్కొంది. విద్యుదుత్పత్తి ధరలో ఇంధనం (బొగ్గు) ధర కీలకం కావడం వల్ల ప్రభావం పడుతోం దని వెల్లడించింది. 2014-15 మధ్య ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 84% బొగ్గు ఆధారితమేనని పేర్కొంది.