ఏమోనయా..?!
కొత్త గనులు.. ఆ మాటెత్తితే చాలు.. ఏమో.. ఎప్పటికి ప్రారంభమవుతాయో..! అనే సందేహం సింగరేణివ్యాప్తంగా వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపాదించిన వాటికి అనుమతులు రావడంలో జాప్యం చోటు చేసుకుంటుండడంతో నూతన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారుతోంది. - కొత్తగూడెం (ఖమ్మం)
- కొత్త గనుల ఏర్పాటుపై సర్వత్రా సందేహం..
- పెండింగ్‌లో 21 ప్రాజెక్టులు..
- పదేళ్లుగా అనుమతుల కోసం నిరీక్షణ
- ప్రారంభమైతే మరో 39 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం
రోజురోజుకూ పెరుగుతున్న కరెంట్ వినియోగం, అందుకు అనుగుణంగా జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అవసరాన్ని సూచిస్తున్నాయి. అదీగాక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సర్కారు కొత్త థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు మొగ్గు చూపితే, వాటికి సరిపడా బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆధీనంలో 15 ఓపెన్ కాస్ట్ గనులు, 34 భూగర్భ గనులు ఉన్నాయి.
వీటి ద్వారా ఏడాదికి 54మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అయితే, కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే.. వాటికి సరిపడా బొగ్గును అందించాలంటే నూతన గనుల ఏర్పాటు తథ్యమని సింగరేణి యాజమాన్యం పదేళ్ల కిందటే సూచించింది. దాదాపు 21 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు నివేదించింది. కారణాలేమిటో గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్కదానికి కూడా అనుమతులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సైతం అనుమతుల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భూ సేకరణే సమస్యా?
అనుమతుల సంగతేమిటో గానీ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కావలసిన భూ సేకరణ సింగరేణికి సవాల్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినప్పటికీ స్థానిక సమస్యల కారణంగా నూతన గనుల ఏర్పాటుకు యాజమాన్యం ఆచీతూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 21 ప్రాజెక్టుల్లో 13 ఓపెన్ కాస్టు గనులే. వీటిని నెలకొల్పే ప్రదేశంలోని ప్రజలను మరోచోటికి తరలించాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే భూ సేకరణ సులువవుతుంది. పరిహారం విషయంలో స్థానికుల డిమాండ్, సర్వే నిర్వహణలో జాప్యం ఇతరత్రా ఎదురయ్యే సమస్యలతో భూసేకరణ సింగరేణికి ఒకింత భారంగా మారుతోంది.
కొంగొత్త ఆశలు..!
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే... అదనంగా 39.31 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అదే క్రమంలో ఇటు సింగరేణిలోనూ, అటు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.