సౌర విద్యుత్ హబ్‌గా ఏపీ!
కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
జజ్జర్ ప్లాంటు నుంచి 200 మె.వా. అదనపు విద్యుత్
రాష్ట్రంలో బొగ్గు కొరత రానీయం
హైదరాబాద్: ఏపీని సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అదనంగా కేటాయించిన 200 మెగావాట్ల విద్యుత్‌ను జజ్జర్ ప్లాంటు నుంచి అందించనున్నట్టు తెలిపారు. 2015 వరకు ఈ సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. గృహాలు, పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారని, అది త్వరలోనే సాకారమవుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి విద్యుత్తు సమస్య తలెత్తకుండా ఉండేందుకు సెప్టెంబర్ వరకు 500 మెగావాట్లు, జనవరికి మరో 500 మెగావాట్లు ఉత్పత్తికి వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత 3 నెలలుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గాయని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఏపీలు సహకరించుకోవాలని సూచించారు.
ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇది వరకే ఓ కమిటీని నియమించామని, మరో 15 రోజుల్లో ఈ కమిటీ తన నివేదిక అందించనుందని వివరించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును తరలిస్తున్నామని, దీనికిగాను అదనంగా ర్యాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ) కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.