సాక్షి, అమరావతి: అవే పైత్యపు కథనాలు.. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు.. విలువలు లేకుండా అడ్డగోలుగా అచ్చేస్తున్న అవాస్తవాల పరంపరలో మరో నీతిమాలిన వార్తను రామోజీరావు ‘బొగ్గు రాదు.. బకాయిలే కారణం’ శీర్షికతో ఈనాడులో వండివార్చారు. కళ్లముందు నిజాలు కనిపిస్తున్నా.. టీడీపీ హయాంలో బొగ్గు సేకరణ ఇప్పటి కన్నా తక్కువే ఉన్నా ఆ నిజాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కథనంలో విశ్వప్రయత్నం చేశారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసిన కంపెనీలకు ఇంధన సరఫరా ఒప్పందాల (ఫ్యూయల్ సప్లయి అగ్రిమెంట్స్–ఎఫ్‌ఎస్‌ఏ) ప్రకారం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఈనాడు కథనంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఏపీజెన్‌కో ఎండీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
‘ఎఫ్‌ఎస్‌ఏ’ ప్రకారం సకాలంలో చెల్లింపులు
మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)కు ఏపీజెన్‌కో సెప్టెంబర్‌లో రూ. 554.57 కోట్ల బకాయిలు చెల్లించింది. గడువులోగా చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవు. సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు చెల్లింపులకు ‘బిల్ ఆఫ్ ఎఎక్స్చేంజ్’ విధానం వల్ల ఆ సంస్థకు పెండింగ్ బకాయిలు లేవు. ఎస్‌సీసీఎల్, ఎంసీఎల్ నుంచి ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం ఏపీజెన్‌కో బొగ్గు సేకరిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం నిర్ణీత గడువులో బకాయిలు చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సరఫరా కానందున అన్ని రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి.
పైగా నైరుతీ రుతుపవనాల సీజన్‌లో బొగ్గు తవ్వకాలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీజెన్‌కో వారం వారం జరిగే కేంద్ర ఉపసంఘం సమీక్షల్లో, ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) సమావేశాల్లో బొగ్గు సరఫరా పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడానికి, పెరిగిన ఏపీ గ్రిడ్ డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి పెంచేందుకు ఏపీజెన్‌కో ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇందులో భాగంగానే అదనపు బొగ్గు సేకరణ కోసం కోల్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత బొగ్గు కొరత పరిస్థితుల్లో సైతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎఫ్‌ఎస్‌ఏ లక్ష్యంలో 95.67 శాతం మేరకు బొగ్గును ఏపీ జెన్‌కో సేకరించగలగడం విశేషం. టీడీపీ అధికారంలో ఉన్న 2018 ఇదే కాలంలో ఒప్పందంలోని 81.02 శాతం బొగ్గు మాత్రమే సేకరించడం గమనార్హం.
పెరిగిన విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు ప్రణాళిక
ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున ఏపీజెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం కూడా పెరిగింది. మరోవైపు ఏపీజెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 75 శాతం పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు, బొగ్గు నిర్వహణ యూనిట్‌ను ఏపీజెన్‌కో పటిష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాల సాధన దిశగా ముందుకెళుతోంది.
జెన్‌కోను దెబ్బతీసింది చంద్రబాబే
చంద్రబాబు హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్‌కోకు భారీ నష్టం వాటిల్లింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు గత టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగ్ సైతం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి.
కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీనివల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ. 2.94 నుంచి రూ. 4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ. 675.69 కోట్లు నష్టం వాటిల్లింది. మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడం లేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్‌లను సమీక్షిస్తే జెన్‌కో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యతలేని రూ. 3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరను కొనుగోలు చేయడం వల్ల జెన్‌కోకు రూ. 918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. అప్పట్లో విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెరవెనుక కోల్‌మాఫియా చక్రం తిప్పింది. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment