నిలిచిన విద్యుత్ ఉత్పత్తి...పునరుద్ధరణకు అనాసక్తి
డిప్యుటేషన్ పేరిట 48 మంది ఇంజనీర్ల బదిలీ
ఒకవైపు నిర్వహణ భారం... మరోమైపు ముగిసిన కేంద్రం జీవితకాలం
రామగుండం: నిర్వహణ భారం..జీవితకాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వారంరోజులు క్రితం 38 మంది ఇంజనీర్లు, ఐదుగురు సబ్ ఇంజనీర్లు, ఒకరు సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్‌లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. దీంతో మూసివేత తప్పదనే ప్రచారం జరుగుతోంది.
యూనిట్ ట్రిప్ అయినా...
ఈ నెల 4వ తేదీన యూనిట్‌లోని మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్యతో తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. పదిరోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
1965లో ప్లాంట్ ప్రారంభం
» అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహా్మనందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తితోపాటు పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి ఆరు దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది.
» బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్‌ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది.
» ఈ జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాతవాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు.
» సాంకేతిక సమస్యలతో మళ్లీమళ్లీ ట్రిప్పవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్టు సమాచారం. ∙వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది.
కొత్త ప్లాంటు ఏర్పాటు తప్పనిసరి
రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్ధ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తాం. అప్పటివరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్లను కలిసి విన్నవించా. అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉండడంతో కొందరిని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు.
– మక్కాన్‌సింగ్ ఠాకూర్, రామగుండం, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment