సింగరేణిపై ప్రభుత్వ నిర్లక్ష్యం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 26 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. కేసీఆర్ మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులు సింగరేణిలో లేరని అసెంబ్లీలో అబద్ధపు ప్రకటన చేశారని విమర్శించారు.
కాంట్రాక్టు ఉద్యోగులపై సభను తప్పుదోవ పట్టించిన సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన తర్వాతనే తాను యాత్రను ప్రారంభించినట్టుగా చెప్పారు. కేంద్రం వేతనాలు పెంచుతూ గత ఏప్రిల్లో ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలోనూ ఎడమచేతితో ఆదేశాలు ఇచ్చి, కుడిచేతితో వాటిని గుంజుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీజేయూ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.