విద్యుత్ ఉద్యోగులకు ఆరు లక్ష్యాలు
సిబ్బందికి ఇంధన శాఖ నిర్దేశం
పనితీరే భవితకు ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ఇంధన శాఖ ఆరు లక్ష్యాలను నిర్దేశించింది. పని తీరే భవిష్యత్తుకు ప్రామాణికమని తేల్చి చెప్పింది. రాబోయే నాలుగేళ్లలో ఉద్యోగులు, సంబంధిత కంపెనీలు నిర్ణీత లక్ష్యాలను సాధించాలని స్పష్టంచేసింది. ప్రస్తుత వేతన సవరణ ఉద్యోగుల పనితీరు, ప్రమాణాలకు లోబడి ఉంటుందని తెలిపింది. 2017-18 నాటికి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను రెండు శాతం తగ్గించాలని, ఏటా నూటికి నూరు శాతం బిల్లులు వసూలు చేయాలని సూచించింది. దీంతో పాటు ప్రస్తుతం జెన్‌కో అధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటా సగటున 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (వాస్తవ సామర్థ్యంలో విద్యుత్ ఉత్పాదకత)ను సాధించాలని నిర్దేశించింది.
వేతన సవరణకు అధికారికంగా అనుమతిస్తూ... ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసుకునేందుకు రాసిన లేఖలో ఇంధన శాఖ ఈ లక్ష్యాలను ప్రత్యేకంగా పొందుపరిచింది. ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చేపట్టబోయే ప్లాంట్ల అంచనా వ్యయం పెరిగిపోకుండా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. నిర్వహణ ఖర్చులు, సాధారణ మరమ్మతుల వ్యయాన్ని రాబోయే నాలుగేళ్లలో ఏటా 5 శాతం చొప్పున తగ్గించాలి. ప్రతి కేటగిరీలో ఏటా 5 శాతం చొప్పున మీటర్ సేల్స్ పెంచాలి’’ అని లేఖలో ఇంధన శాఖ పేర్కొంది.
టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ వేతన సవరణ అమలు చేస్తున్నట్లు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణకు ఆదేశాలు జారీ చేశారు. 15 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. పెన్షనర్లు, వారి కుటుంబీకులకు కూడా 30 శాతం ఫిట్‌మెంట్ ప్రయోజనం వర్తించే పెన్షన్‌కు అంగీకరించారు. ఈ వేతన సవరణకు అధికారికంగా అనుమతి జారీ చేస్తున్నట్లు ఇంధన శాఖ టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కోకు లేఖ రాసింది.
భవిష్యత్తు పీఆర్‌సీపై పీటముడి
భవిష్యత్తులో విద్యుత్ విభాగానికి ప్రత్యేకంగా పీఆర్‌సీ ఉండదని ఇంధన శాఖ ఇదే లేఖలో స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పీఆర్‌సీతో అనుసంధానమై ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనను విద్యుత్ శాఖలోని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. మంగళవారం టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు వేతన సవరణ ఒప్పందంపై గుర్తింపు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇంధన శాఖ లేఖలోని అంశాలన్నింటికీ సమ్మతి తెలిపిన ఉద్యోగ సంఘాలు... ప్రత్యేక పీఆర్‌సీ తొలగింపు నిబంధనపై మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 327, 1104, టీఎన్‌టీయూసీ సంఘాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. రేయిం బవళ్లు.. ఆకస్మిక విధులు నిర్వహించే విద్యుత్ విభాగానికి ఇప్పుడున్న పీఆర్‌సీ యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.