ప్రత్యామ్నాయ గ్యాస్‌తో సర్దుబాటు | Alternative gas adjustment | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ గ్యాస్‌తో సర్దుబాటు

Published Sat, Feb 7 2015 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ఆర్‌ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌ను పరస్పర బదిలీ పద్ధతిలో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

హైదరాబాద్: గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ఆర్‌ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌ను పరస్పర బదిలీ పద్ధతిలో సర్దుబాటు చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏపీలో గ్యాస్ కొరతతో మూతపడ్డ మూడు పవర్ ప్లాంట్లకు గ్యాస్‌ను కేటాయించేందుకు అనుమతించింది. రెండు నెలల కిందట టీఎస్ జెన్‌కో చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని జీవీకే, స్పెక్ట్రమ్, లాంకో, కోనసీమ, వేమగిరి గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో మొత్తం 2499 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యముంది. సరిపడా గ్యాస్ అందుబాటులో ఉంటే ఇందులో నుంచి 53.89 శాతం (1346 మెగావాట్లు) విద్యుత్తు తెలంగాణకు పంపిణీ అయ్యే వీలుంది.

ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా లేకపోవటంతో ఈ ప్లాంట్ల నుంచి తెలంగాణకు అందుతున్న విద్యుత్తు 150 మెగావాట్లకు మించటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ) ధర గతంలో ఒక్కో యూనిట్‌కు 20 నుంచి 25 డాలర్లుండగా, ప్రస్తుతం 10 నుంచి 15 డాలర్లకు పడిపోయింది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి బ్యారెళ్లలో దిగుమతి చేసుకొని తిరిగి ద్రవాన్ని గ్యాస్‌గా మార్చడమే ఆర్‌ఎల్‌ఎన్‌జీ. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఫెర్టిలైజర్ కంపెనీలకు గ్యాస్ సరఫరా అవుతోంది.

అక్కడి నుంచి తూర్పు తీరంలో ఉన్న ఏపీకి గ్యాస్ సరఫరా చేసుకునేందుకు పైపులైన్లు లేవు. అందుకే ఆర్‌ఎల్‌ఎన్‌జీని అక్కడి కంపెనీలకు కేటాయించి  కేజీ బేసిన్ నుంచి సరఫరా అవుతున్న గ్యాస్‌ను ఇక్కడ వినియోగించుకునేలా గ్యాస్ స్వాపింగ్ (పరస్పర గ్యాస్ కేటాయింపుల బదిలీ)కు అనుమతించాలని రాష్ట్ర ఇంధన శాఖ నెల రోజుల కిందట కేంద్రాన్ని అభ్యర్థించింది. మూడు గ్యాస్ ఆధారిత కేంద్రాలకు 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అందించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో దాదాపు 450 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. గ్యాస్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైతే తెలంగాణకు  242 మెగావాట్ల విద్యుత్తు అందే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement