కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్‌ | Pollution control plant in KTPS | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్‌

Published Sat, May 25 2019 1:54 AM | Last Updated on Sat, May 25 2019 1:56 AM

Pollution control plant in  KTPS - Sakshi

పాల్వంచ: విద్యుత్‌ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొత్తగా నిర్మాణం చేస్తున్న కర్మాగారాల్లో ఫ్లూ గ్యాస్‌ డిసల్ఫరైజేషన్‌ ప్లాంట్‌ (ఎఫ్‌జీడీ) నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ సెంట్రల్‌ బోర్డు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) కేంద్రంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ఈ మేరకు టీఎస్‌ జెన్‌కో అధికారులు స్థల సేకరణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులను సుమారు రూ.300 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు.

దీని వల్ల కర్మాగారం నుంచి వెలువడే పొగలో హానికర వాయువులను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్‌ 7వ దశ (800మెగావాట్లు), మణుగూరు వద్ద బీటీపీఎస్‌ (1080 మెగావాట్లు), నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ (4వేల మెగావాట్లు) నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో కేటీపీఎస్‌ 7వ దశ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 2018 డిసెంబర్‌ 26న సీవోడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) చేశారు. అప్పటి నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి నిరంతరాయంగా వస్తోంది.

భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉత్పత్తి సాధిస్తున్న కేటీపీఎస్‌ 7వ దశ సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్లాంట్‌ కేంద్రంగా కాలుష్య నియంత్రణ కోసం ఇప్పుడు పాటిస్తున్న ప్రమాణాలతో పాటు కొత్తగా ఫ్లూ గ్యాస్‌ డిసల్ఫరైజేషన్‌ ప్లాంట్‌ నిర్మించి కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపడుతుండటం గమనార్హం. దీని ద్వారా బొగ్గు మండినప్పుడు వచ్చే సల్ఫర్‌ వాయువు (పొగ)లో నార్మల్‌ మీటర్‌ క్యూబ్‌ 50 మిల్లి గ్రామ్స్‌కు మించకుండా ఈ ప్లాంట్‌ ఉపయోపడుతుంది. దీని వల్ల హానికర వాయువులు తగ్గుతాయి.  
స్థల సేకరణకు యాజమాన్యం కసరత్తు
బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్‌ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందుకు గాను కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌ పరిధిలో స్థల సేకరణ పనుల్లో జెన్‌కో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 420 ఎకరాల్లో కేటీపీఎస్‌ 7వ దశను నిర్మించగా పక్కనే ఉన్న సెక్యూరిటీ కాలనీని ఎఫ్‌జీడీ ప్లాంట్‌ కోసం కేటాయించారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం సెక్యూరిటీ కాలనీలో నిర్మించిన క్వార్టర్లలో సిబ్బందిని ఖాళీ చేయించారు. వెంటనే వాటిని నేలమట్టం చేసే పనులు చేపట్టారు. 16 బ్లాక్‌లు(92 క్వార్టర్లు) గతంలో చాలా వరకు శిథిలావస్థకు చేరడంతో వీటిని తొలగించి నిర్మిస్తే మేలనే నిర్ణయంతో వీటిని తొలగిస్తున్నారు.  

క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు
కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల సమీప జీవరాశులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉండటంతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో పాటు ఆంబియస్ట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్ల (ఎఎక్యూఎంఎస్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. కేటీపీఎస్‌ 7వ దశ పరిధిలో గల సురారం, పునుకుల, పుల్లాయిగూడెం, పాత ప్లాంట్, కూలింగ్‌ టవర్, బొల్లేరుగూడెం ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గాలిలో వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దీనిని ఇక్కడి అధికారులతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌లో ఉండే పొల్యూషన్‌ సెంట్రల్‌ బోర్డు అధికారులు కూడా మానిటరింగ్‌ చేయనున్నారు.

ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో కాలుష్య నియంత్రణ
విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారాల్లో వెలువడే కాలుష్యాన్ని ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నియంత్రిస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు కొత్తగా ఈ ప్లాంట్‌ నిర్మాణం తప్పక చేయాలని పొల్యూషన్‌ బోర్డు అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి రూ.300కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. సెక్యూరిటీ కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖర్చు అధికమైనా ఈ ప్లాంట్‌ నిర్మాణం చేస్తున్నాం.    
జె.సమ్మయ్య,
సీఈ కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం, 7వ దశ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement