నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య, భారీ స్థాయిలో కాలుష్యం
బిల్డింగ్‌సైట్లు, బేకరీల్లో పెద్దమొత్తంలో కలప వినియోగం, క్షీణిస్తున్న వాయునాణ్యత
నిర్మాణ పనుల్లో నిబంధనలను బేఖాతరు చేస్తున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లపై బీఎంసీ ఫోకస్
మొదట నోటీసులిస్తామని అయినా తీరు మారకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిక
బహిరంగ ప్రదేశాల్లో వంటలు, చలి మంటలు వేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటన
దాదర్: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం అప్రమత్తమైంది. పరిస్ధితులు మరింత చేయి దాటకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయనుంది. అంతేగాకుండా భవన నిర్మాణాలు జరిగేచోట కూలీలు సామూహికంగా వంట చేసుకోవడం, రాత్రుళ్లు చలి కాచుకునేందకు మంటలు వేసుకోవడాన్ని కూడా నిషేధించనుంది.
పరిస్థితి చేయి దాటకముందే...
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంవల్ల ఏస్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే గత కొద్దిరోజులుగా ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కారణాలేవైనా రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ముంబై సహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో అనేక చోట్ల నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని నివాస భవనాలు కాగా మిగతావి షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు వంటి నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాల వద్ద వాయు కాలుష్య నివారణకు సంబంధించిన నియమాలు పాటించడం లేదని బీఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో నియమాలు పాటించనివారికి మొదటి హెచ్చరికగా ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఇచ్చిన గడువులోపు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సైట్‌కు సీలువేసి పనులు నిలిపివేస్తారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లపై తగిన చర్యలు తీసుకుంటారు.
పలుకారణాలతో వాయుకాలుష్యం..
భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వేలాది మంది కూలీలు, కార్మికులు పనులు చేస్తారు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఉదయం, రాత్రుళ్లలో అక్కడే వంట చేసుకుంటారు. ఇందుకోసం వీరు కిరోసిన్ స్టౌ లేదా వంట గ్యాస్ సిలిండర్లను వాడరు. సైటువద్ద వృథాగా పడి ఉన్న కలపను వినియోగిస్తారు. ఈ కలప నుంచి భారీగా వెలువడే పొగ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. చలి బారి నుంచి తట్టుకునేందుకు నగరంలోని మురికివాడల్లో, ఫుట్‌పాత్‌లు, రోడ్లపక్కన నివసించే పేదలు చలిమంట కాచుకుంటారు. చెత్త కాగితాలు, నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ చెత్త, కట్టెలు, గడ్డి తదితర సామాగ్రిని ఈ మంటలో వేస్తారు. వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాకుండా వాయునాణ్యత క్షీణించేందుకు ఇవి కూడా కారణాలవుతున్నాయి. అదేవిధంగా నగరంలో దాదాపు 50 వేలకుపైగా పాత కాలం నాటి బేకరీలున్నాయి. అందులో 24 గంటలు బ్రెడ్లు, పావ్‌లు, కేక్‌లు తయారవుతూనే ఉంటాయి. వీటి తయారీకి బేకరీ నిర్వాహకులు కలపనే వినియోగిస్తారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగ గాలి స్వచ్చతను దెబ్బతీస్తోంది.
ప్రతీ వార్డులో వాటర్ స్ప్రింక్లర్...
ఈ నేపథ్యంలో బీఎంసీ నూతన నిర్మాణాలు జరుగుతున్న చోట దుమ్ము, ధూళీ వెలువడకుండా చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లేదనని హెచ్చరించింది. ఇందుకోసం ప్రతీ వార్డులో 5 నుంచి 9 వేల లీటర్ల నీరు వెదజల్లే వాటర్ స్ప్రింక్‌ర్లను అందుబాటులో ఉంచింది. ఈ స్ప్రింక్లర్లు రోడ్లపై గాలిలో ఎగురుతున్న దుమ్ము, ధూళిని నియంత్రిస్తాయి. ఫలితంగా కొంత శాతం కాలుష్యం నియంత్రణలోకి వస్తుందని బీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేసే యోచనలో కూడా ఉంది.
వాయు కాలుష్య నివారణ కోసం కొత్తగా అమలు చేయనున్న నియమాలు
నిర్మాణ పనులు జరుగుతున్న భవనం చుట్టూ 35 అడుగుల ఎత్తున్న ఇనుప రేకులతో ప్రహరీ గోడను నిర్మించాలి.
భవనానికి ఏర్పాటు చేసిన వెదురు బొంగుల కంచెకు జూట్ వస్త్రం లేదా ఆకుపచ్చ బట్ట చుట్టాలి.
నిర్మాణాలు జరుగుతున్న సైట్ల వద్ద వాటర్ స్ప్రింక్లర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. రోజుకు 4 లేదా5 సార్లు నీటిని స్ర్పింకిల్ చేయాలి.
కూలీలు, కార్మికులు కచ్చితంగా ముఖానికి మాస్క్, కళ్లద్దాలు ధరించాలి.
భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కాపలగా ఉండే సెక్యూరిటీ గార్డులు చలికాచుకునేందుకు ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి కొనివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment