ముంబైసహా రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత
అత్యవసరం మినహా సాధారణ ఆపరేషన్లను వాయిదా వేసుకోవలసిన అగత్యం
ఇలాంటి పరిస్థితుల్లోనూ పొరుగు రాష్ట్రాలకు రక్తాన్ని అమ్ముకుంటున్న బ్లడ్‌బ్యాంకులు
దీనిపై రాష్ట్ర రక్తనిల్వల పరిషద్ సీరియస్
పరిస్థితులు చక్కబడేవరకూ అమ్మకాలను నిషేధించాలని నిర్ణయం
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్‌బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది.
ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకుల దోపిడీ...
సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు.
ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి.
అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment