సాక్షి, హైదరాబాద్: రక్తానికి రక్తం! ఇదేదో సినిమాలో విన్పించే డైలాగ్ కాదు. నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లినా ప్రస్తుతం ఇదే డైలాగ్ రిపీటవుతోంది. ‘మీ సంబంధీకులు ఎవరైనా ఆస్పత్రిలో ఉండి.. రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటే... మీలో ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే. లేకుంటే రక్తం ఇవ్వలేం’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనికి కారణం తీవ్రంగా ఏర్పడిన రక్తం కొరతే. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం రక్త నిల్వలు లేవు.
అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది.
చదవండి: మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ
ఆందోళనలో క్షతగాత్రులు..సర్జరీ బాధితులు
ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పని చేస్తున్న బోధనాసుపత్రులతో పాటు కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున వెయ్యికిపైగా చికిత్సలు జరుగుతున్నట్లు అంచనా. వీరిలో రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులతో పాటు, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, కేన్సర్, గుండె పోటు, కాలేయం, మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారే అధికం. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అధిక రక్తస్త్రావంతో బాధపడుతుంటారు.
కేవలం గాయాలైన సందర్భంలోనే కాదు సర్జరీ సమయంలో రక్తస్త్రావం అవుతుంది. వీరికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉంది. ఇలా రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్లడ్ దొరకడం లేదు. అంతేకాదు కాలేయ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలకు 20–30 యూనిట్లు అవసరం. ఆ మేరకు లభ్యత లేక పోవడంతో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది.
ఒ–నెగటివ్ నిల్
హైదరాబాద్ జిల్లాలో 70 రక్తనిధి కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ జిల్లాలో 8 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్, రెడ్‌క్రాస్, ఆదిత్య, ఒవైసీ, స్టార్, ఆస్పత్రుల్లో మాత్రమే కొన్ని గ్రూపుల రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి లభ్యత లేదు. అది కూడా ఎ, బి, ఏబీ పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన రక్తపు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కీలకమైన ఒ–నెగటివ్ గ్రూప్ రక్తం అసలే లేదు.
తలసీమియా బాధితుల ప్రాణసంకటం
తలసీమియా సికిల్ సొసైటీలో 3031 మంది బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 2235 మంది ఉండగా, ఏపీ కి చెందిన వారు 705 మంది ఉన్నారు. మరో 91 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొంత మందికి నెలకు రెండు యూనిట్లు (500 ఎంఎల్) రక్తం అవసరం కాగా, మరికొంతమందికి ఒక యూనిట్ (250 ఎంఎల్) అవసరమవుతుంది. రక్తనిధి కేంద్రాల్లో వీరికి అవసరమైన గ్రూపు రక్తం దొరక్కపోవడంతో బాధితులే దాతలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. నెలకు రెండు సార్లు రక్తాన్ని ఎక్కించుకోవాల్సిన వారు ఒకసారితో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి..చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment