Shortage blood
-
‘బ్లడ్‌బ్యాంకులకు ‘రక్తహీనత’ అధ్వాన్నంగా పరిస్థితి
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్‌బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది. ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకుల దోపిడీ... సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి. అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది. -
ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. ఎండలు.. వైరస్ భయంతో ముందుకు రావట్లేదు
సాక్షి, హైదరాబాద్: రక్తానికి రక్తం! ఇదేదో సినిమాలో విన్పించే డైలాగ్ కాదు. నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లినా ప్రస్తుతం ఇదే డైలాగ్ రిపీటవుతోంది. ‘మీ సంబంధీకులు ఎవరైనా ఆస్పత్రిలో ఉండి.. రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటే... మీలో ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే. లేకుంటే రక్తం ఇవ్వలేం’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనికి కారణం తీవ్రంగా ఏర్పడిన రక్తం కొరతే. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం రక్త నిల్వలు లేవు. అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. చదవండి: మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ ఆందోళనలో క్షతగాత్రులు..సర్జరీ బాధితులు ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పని చేస్తున్న బోధనాసుపత్రులతో పాటు కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున వెయ్యికిపైగా చికిత్సలు జరుగుతున్నట్లు అంచనా. వీరిలో రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులతో పాటు, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, కేన్సర్, గుండె పోటు, కాలేయం, మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారే అధికం. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అధిక రక్తస్త్రావంతో బాధపడుతుంటారు. కేవలం గాయాలైన సందర్భంలోనే కాదు సర్జరీ సమయంలో రక్తస్త్రావం అవుతుంది. వీరికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉంది. ఇలా రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్లడ్ దొరకడం లేదు. అంతేకాదు కాలేయ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలకు 20–30 యూనిట్లు అవసరం. ఆ మేరకు లభ్యత లేక పోవడంతో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. ఒ–నెగటివ్ నిల్ హైదరాబాద్ జిల్లాలో 70 రక్తనిధి కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ జిల్లాలో 8 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్, రెడ్‌క్రాస్, ఆదిత్య, ఒవైసీ, స్టార్, ఆస్పత్రుల్లో మాత్రమే కొన్ని గ్రూపుల రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి లభ్యత లేదు. అది కూడా ఎ, బి, ఏబీ పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన రక్తపు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కీలకమైన ఒ–నెగటివ్ గ్రూప్ రక్తం అసలే లేదు. తలసీమియా బాధితుల ప్రాణసంకటం తలసీమియా సికిల్ సొసైటీలో 3031 మంది బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 2235 మంది ఉండగా, ఏపీ కి చెందిన వారు 705 మంది ఉన్నారు. మరో 91 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొంత మందికి నెలకు రెండు యూనిట్లు (500 ఎంఎల్) రక్తం అవసరం కాగా, మరికొంతమందికి ఒక యూనిట్ (250 ఎంఎల్) అవసరమవుతుంది. రక్తనిధి కేంద్రాల్లో వీరికి అవసరమైన గ్రూపు రక్తం దొరక్కపోవడంతో బాధితులే దాతలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. నెలకు రెండు సార్లు రక్తాన్ని ఎక్కించుకోవాల్సిన వారు ఒకసారితో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి..చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రాణాలు తీస్తున్న తలసేమియా..!
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : తలసేమియా.. ఇదొక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే..! ప్రాణాలు కాపాడుకోవాలంటే పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిందే. జిల్లాలో రక్తం కొరత, సీబీఆర్‌ఎం యూనిట్ అందుబాటులో లేక బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లక్షణాలు.. తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధి సక్రమిస్తుంది. పుట్టుకతోనే వచ్చే ఈ వ్యాధి.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బయటపడుతుంది. మూడు నుంచి 18నెలల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన వారిలో రక్తహీనత మొదలవుతుంది. జీర్ణశక్తి మందగించడం, మొహం పాలిపోవడం, పిల్లల్లో అల్లరి తగ్గిపోవడం, ఎదుగుదల లోపించడం, హుషారుగా కనిపించేవారు కాస్తా నీరసించడం జరుగుతుంది. పచ్చకామెర్లు, కీళ్లనొప్పులు, కడుపునొప్పి, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి వ్యాధులు కూడా వెంటాడుతాయి. సరైన వైద్య సౌకర్యాలు లేని జిల్లాలో రోగ నిర్దారణ కొంత కష్టమే. అందుకే వైద్యులు జ్వరం, విరేచనాలు, రక్తహీనత అని చెబుతారు. ఒక్కోసారి ప్రాణం పోయినా వ్యాధి తెలియకుండా పోతుంది. మంచిర్యాల ఏరియా ఆస్పత్రి, రిమ్స్‌లో వైద్యం, ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నా.. మందుల కోసం ఒక్కో రోగి నెలకు రూ.3వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత నాలుగేళ్లలో తలసేమియా వ్యాధిగ్రస్తులు సుమారు 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అవగాహన లోపం.. తలసేమియా వ్యాధిపై చాలా మందిలో అవగాహన లేదు. మేనరికం, వ్యాధిగ్రస్తులు వివాహం చేసుకోవడం వల్ల వ్యాధి పిల్లలకు సంక్రమిస్తుంది. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చు. అలా చేయకపోవడం వల్ల పిల్లలు వ్యాధి బారిన పడాల్సి వస్తోంది. పెళ్లికి ముందు కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ), హెచ్‌బీఏ 2 పరీక్షలు చేయించుకుంటే సమస్యలు ఏర్పడ వు. పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునేలా ఎలా ప్రచారం చేస్తున్నారో తలసేమియాపైనా ప్రచారం చేయాలని పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ దుస్థితి.. జిల్లాలో ఏటా దాదాపు వంద నుంచి 150 మంది వ్యాధి బారిన పడుతున్నారు. గతేడాది 600 మంది వ్యాధిగ్రస్తు లు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 1,500కు చేరింది. ఒక్క తూర్పు జిల్లాలోనే 400 మంది వరకు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు 15రోజులకోసారి సెలైన్ వాష్డ్ రక్తం ఎక్కిస్తే జీవిస్తారు. ఒకటి రెండుసార్లు కాదు జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. 20 సార్లకు పైగా రక్తం ఎక్కిస్తే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుం ది. ఆ తర్వాత 40 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉం టుంది. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. నెలలో రెండు సార్లు వెళ్లి రావడం తో అన్నీ కలిపి దాదాపు రూ.5వేలకు పైగా ఖర్చయ్యేది. పేదలకు ఈ ఖర్చు భారమయ్యేది. ప్రస్తుతం మంచిర్యాలలోనూ రక్తం ఎక్కిస్తుండడంతో కొంత భారం తగ్గింది. రక్తం కొరత.. తలసేమియా లక్షణాలు ప్రజలకు వివరించడంలో విఫలమైన అధికారులు రక్తదాన శిబిరాల నిర్వహణలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి పైగా బాధితులు ఉన్నారు. వీరిలో 600 మంది రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌ల్లో రక్తం ఎక్కించుకుంటున్నారు. మిగతా వారు హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒక్క మంచిర్యాలలోనే ఇప్పటి వరకు 400 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందరికీ రక్తం ఎక్కించాలంటే రక్తం నిల్వలు అవసరం. తూర్పు జిల్లాలో అందరికీ రక్తం అందించాలంటే నెలకు 20 క్యాంపులు అవసరం అవుతాయి. కానీ బ్లడ్‌బ్యాక్ అతికష్టం మీద పది వరకు మాత్రమే క్యాంపులు నిర్వహించగలుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. జిల్లాలో తలసేమియా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. వ్యాధిగ్రస్తులకు 15యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీలో తయారయ్యే ఈ మెడిసిన్ రోగి శరీరంలో పేరుకుపోయిన ఐరన్‌ను తగ్గిస్తుంది. దీంతో రోగిలో హెచ్‌బీ శాతం పెరుగుతుంది. ఈ మందు అందించే సెలైన్ బాక్స్ ఆర్బీసీ మిషన్(సీబీఆర్‌ఎం) యూనిట్ కేవలం హైదరాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ, కోఠిలోని తలసేమియా సికిల్‌సెల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యూనిట్ల ఏర్పాటు బాధ్యత తన పరిధిలో లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో బతకాలనే ఆశతో రూ.10వేల వరకు అప్పు చేసి హైదరాబాద్‌లో మందులు వాడుతున్నారు. మంచిర్యాలతోపాటు సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో యూనిట్ ఏర్పాటు కోసం సింగరేణి ముందుకొచ్చింది. 2008లో రూ.23.40లక్షలతో పరికరాలు కొనుగోలు చేసింది. కానీ కాంపొనెంట్ యూనిట్ ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా.. నాలుగేళ్ల నుంచి ఆ పరికరాలు మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలోనే నిరుపయోగంగా ఉన్నాయి. అందుబాటులో సేవలు... మంచిర్యాలలో బ్లడ్ కంపోనెంట్ నిర్వహణకు అనుమతి లభించడంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు చాలా వరకు వ్యయప్రయాసాలు తగ్గాయి. ఇప్పుడిప్పుడే తలసేమియా వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందుబాటులోకి వస్తోంది. సింగరేణి సహాయంతో ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్ కంపోనెంట్(సెలైన్ వాష్డ్ రక్తం) ఏర్పాటు చేశారు. రిమ్స్‌లో ఏడాది క్రితమే ఈ మిషన్ ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఐరన్ చిల్లేషన్ మందు లు కూడా అందిస్తున్నారు. దీంతో ఇటు రక్తనిధి కేంద్రం లో అందుబాటులో రక్తంతోపాటు ఐరన్ చిల్లేషన్ మందు లు లభిస్తుండడంతో రోగుల జీవితాల్లో కొంత వెలుగు కనిపిస్తోంది.