ప్రాణాలు తీస్తున్న తలసేమియా..! | Talasemiya kills ..! | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న తలసేమియా..!

Published Thu, May 8 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

ప్రాణాలు తీస్తున్న తలసేమియా..!

ప్రాణాలు తీస్తున్న తలసేమియా..!

మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :  తలసేమియా.. ఇదొక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే..! ప్రాణాలు కాపాడుకోవాలంటే పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిందే. జిల్లాలో రక్తం కొరత, సీబీఆర్‌ఎం యూనిట్ అందుబాటులో లేక బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

లక్షణాలు..
తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధి సక్రమిస్తుంది. పుట్టుకతోనే వచ్చే ఈ వ్యాధి.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బయటపడుతుంది. మూడు నుంచి 18నెలల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన వారిలో రక్తహీనత మొదలవుతుంది. జీర్ణశక్తి మందగించడం, మొహం పాలిపోవడం, పిల్లల్లో అల్లరి తగ్గిపోవడం, ఎదుగుదల లోపించడం, హుషారుగా కనిపించేవారు కాస్తా నీరసించడం జరుగుతుంది. పచ్చకామెర్లు, కీళ్లనొప్పులు, కడుపునొప్పి, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి వ్యాధులు కూడా వెంటాడుతాయి.

సరైన వైద్య సౌకర్యాలు లేని జిల్లాలో రోగ నిర్దారణ కొంత కష్టమే. అందుకే వైద్యులు జ్వరం, విరేచనాలు, రక్తహీనత అని చెబుతారు. ఒక్కోసారి ప్రాణం పోయినా వ్యాధి తెలియకుండా పోతుంది. మంచిర్యాల ఏరియా ఆస్పత్రి, రిమ్స్‌లో వైద్యం, ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నా.. మందుల కోసం ఒక్కో రోగి నెలకు రూ.3వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత నాలుగేళ్లలో తలసేమియా వ్యాధిగ్రస్తులు సుమారు 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

అవగాహన లోపం..
తలసేమియా వ్యాధిపై చాలా మందిలో అవగాహన లేదు. మేనరికం, వ్యాధిగ్రస్తులు వివాహం చేసుకోవడం వల్ల వ్యాధి పిల్లలకు సంక్రమిస్తుంది. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చు. అలా చేయకపోవడం వల్ల పిల్లలు వ్యాధి బారిన పడాల్సి వస్తోంది. పెళ్లికి ముందు కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ), హెచ్‌బీఏ 2 పరీక్షలు చేయించుకుంటే సమస్యలు ఏర్పడ వు. పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకునేలా ఎలా ప్రచారం చేస్తున్నారో తలసేమియాపైనా ప్రచారం చేయాలని పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ దుస్థితి..
జిల్లాలో ఏటా దాదాపు వంద నుంచి 150 మంది వ్యాధి బారిన పడుతున్నారు. గతేడాది 600 మంది వ్యాధిగ్రస్తు లు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 1,500కు చేరింది. ఒక్క తూర్పు జిల్లాలోనే 400 మంది వరకు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు 15రోజులకోసారి సెలైన్ వాష్‌డ్ రక్తం ఎక్కిస్తే జీవిస్తారు. ఒకటి రెండుసార్లు కాదు జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే.

 20 సార్లకు పైగా రక్తం ఎక్కిస్తే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుం ది. ఆ తర్వాత 40 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉం టుంది. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. నెలలో రెండు సార్లు వెళ్లి రావడం తో అన్నీ కలిపి దాదాపు రూ.5వేలకు పైగా ఖర్చయ్యేది. పేదలకు ఈ ఖర్చు భారమయ్యేది. ప్రస్తుతం మంచిర్యాలలోనూ రక్తం ఎక్కిస్తుండడంతో కొంత భారం తగ్గింది.

రక్తం కొరత..
తలసేమియా లక్షణాలు ప్రజలకు వివరించడంలో విఫలమైన అధికారులు రక్తదాన శిబిరాల నిర్వహణలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి పైగా బాధితులు ఉన్నారు. వీరిలో 600 మంది రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌ల్లో రక్తం ఎక్కించుకుంటున్నారు. మిగతా వారు హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నారు.

ఒక్క మంచిర్యాలలోనే ఇప్పటి వరకు 400 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందరికీ రక్తం ఎక్కించాలంటే రక్తం నిల్వలు అవసరం. తూర్పు జిల్లాలో అందరికీ రక్తం అందించాలంటే నెలకు 20 క్యాంపులు అవసరం అవుతాయి. కానీ బ్లడ్‌బ్యాక్ అతికష్టం మీద పది వరకు మాత్రమే క్యాంపులు నిర్వహించగలుగుతోంది.

అధికారుల నిర్లక్ష్యం..
జిల్లాలో తలసేమియా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. వ్యాధిగ్రస్తులకు 15యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీలో తయారయ్యే ఈ మెడిసిన్ రోగి శరీరంలో పేరుకుపోయిన ఐరన్‌ను తగ్గిస్తుంది. దీంతో రోగిలో హెచ్‌బీ శాతం పెరుగుతుంది. ఈ మందు అందించే సెలైన్ బాక్స్ ఆర్‌బీసీ మిషన్(సీబీఆర్‌ఎం) యూనిట్ కేవలం హైదరాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ, కోఠిలోని తలసేమియా సికిల్‌సెల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ యూనిట్ల ఏర్పాటు బాధ్యత తన పరిధిలో లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో బతకాలనే ఆశతో రూ.10వేల వరకు అప్పు చేసి హైదరాబాద్‌లో మందులు వాడుతున్నారు. మంచిర్యాలతోపాటు సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో యూనిట్ ఏర్పాటు కోసం సింగరేణి ముందుకొచ్చింది.

2008లో రూ.23.40లక్షలతో పరికరాలు కొనుగోలు చేసింది. కానీ కాంపొనెంట్ యూనిట్ ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా.. నాలుగేళ్ల నుంచి ఆ పరికరాలు మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలోనే నిరుపయోగంగా ఉన్నాయి.

అందుబాటులో సేవలు...
మంచిర్యాలలో బ్లడ్ కంపోనెంట్ నిర్వహణకు అనుమతి లభించడంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు చాలా వరకు వ్యయప్రయాసాలు తగ్గాయి. ఇప్పుడిప్పుడే తలసేమియా వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందుబాటులోకి వస్తోంది. సింగరేణి సహాయంతో ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్ కంపోనెంట్(సెలైన్ వాష్‌డ్ రక్తం) ఏర్పాటు చేశారు.

రిమ్స్‌లో ఏడాది క్రితమే ఈ మిషన్ ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఐరన్ చిల్లేషన్ మందు లు కూడా అందిస్తున్నారు. దీంతో ఇటు రక్తనిధి కేంద్రం లో అందుబాటులో రక్తంతోపాటు ఐరన్ చిల్లేషన్ మందు లు లభిస్తుండడంతో రోగుల జీవితాల్లో కొంత వెలుగు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement