thalassemia disease
-
శాన్వికకు సీఎం జగన్ ఆపన్నహస్తం.. కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఆదేశాలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన తలసేమియా బాధిత బాలికకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. దర్శిలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి రిసెప్షన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నిషితకుమారి ఏకైక సంతానం అయిన ఎనిమిదేళ్ల బసవనాట శాన్విక అనారోగ్య పరిస్థితిని స్థానికులు, నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శాన్విక తలసేమియాతో బాధపడుతోందని, నెలకు రెండుసార్లు రక్త మార్పిడి చేయించాల్సి వస్తోందని చెప్పారు. నెలకు రూ.12 వేలకుపైగా ఖర్చవుతున్నట్లు తెలిపారు. ఓ నెగిటివ్ గ్రూపు రక్తం దొరకటం కూడా కష్టంగా ఉందన్నారు. పాపకు బోన్‌మ్యారో (ఎముక మజ్జ) చికిత్స చేయించాలని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు సీఎంకు తెలిపారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని, సుమారు ఆరేళ్ల కిందట తన భర్త తనను పట్టించుకోకుండా వదిలేసి ఇంటినుంచి వెళ్లిపోయాడని బాలిక తల్లి నిషితకుమారి చెప్పారు. తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, వారి పోషణ బాధ్యత కూడా తానే చూసుకుంటున్నానని తెలిపారు. చిన్నారి శాన్వికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యే కంగా మాట్లాడారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం పాపే నాకు ప్రాణం.. నా పాపకు ప్రాణం పోస్తానన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను జీవితాంతం రుణ పడి ఉంటా. నువ్వు బాధపడకు.. నేను చూసుకుంటానని ఆయన నాకు భరోసా ఇచ్చారు. వెంటనే నా పాపకు వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం కల్లా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి, కలెక్టర్ దినేష్‌కుమార్ నుంచి, తహశీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి పాప వివరాలు తీసుకున్నారు. నా పాపకు ప్రాణం పోస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. – నిషితకుమారి, శాన్విక తల్లి దర్శి పర్యటనలో సీఎంను కలిసిన చిన్నారి శాన్విక, తల్లిదండ్రులు. తలసేమియాతో బాధపడుతున్న శాన్వికకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. pic.twitter.com/LoI5tSCegA — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 20, 2022 -
సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు
సాక్షి, అమలాపురం టౌన్: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్‌ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది. కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ కేన్సర్ సెంటరు పేర చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్‌కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్) -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
8 ఏళ్లకే 87 సార్లు రక్తం ఎక్కించారు..
సాక్షి, అలంపూర్: ఆ బాలుడి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే.. కానీ, మాయదారి జబ్బు సోకడంతో జీవితానికి ఎదురీదుతున్నాడు.. రక్తపిపాసి తలసేమియా సోకడంతో ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించారు.. వ్యాధి శాశ్వత నివారణకు ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి సంతానమే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డికి చెందిన భాస్కర్, లక్ష్మీదేవిల మొదటి సంతానంగా జన్మించిన హేమంత్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగదు. దీంతో తల్లిదండ్రులు బాబుకు ఏడాదిన్నర వయస్సు నుంచి వైద్యుల సూచన మేరకు నిర్ణీత రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి బాబుకు 87 సార్లు రక్తం ఎక్కించారు. ఇలా ఎక్కువగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని ప్రతి అవయవంలో ఐరన్ ఎక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బాబుకు అవయవాల్లో ఐరన్ ఎక్కువ కావడంతో, దాని కోసం కూడా మందులు వాడుతున్నారు. బాబు కోసం గ్రామం వదిలి.. తమ కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు మారుమూల గ్రామం మాన్‌దొడ్డి నుంచి జడ్చర్లకు తమ నివాసాన్ని మార్చారు. తండ్రి భాస్కర్ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో వైద్యం తీసుకునేందుకు, హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి దగ్గరవుతుందని జడ్చర్లలోనే ఉంటున్నామని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. బాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు ఆపరేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు రూ.10 లక్షల అవసరం కాగా.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, కడుపు కట్టుకుని రూ.2 లక్షలు పోగు చేసుకున్నామని, మిగతా డబ్బును దాతలు ఎవరైనా అందిస్తే తమ కుమారుడికి నిండు జీవితాన్ని అందించినవారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 8985548806 గూగుల్ పే నంబర్ ద్వారా, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 32383343535 శాంతినగర్ శాఖ ద్వారా కానీ సహాయం చేయాలని, పూర్తి వివరాలకు సెల్ నం. 85550 40715ను సంప్రదించాలని హేమంత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రక్తదానం..నిలుపుతోంది ప్రాణం
చార్మినార్: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు విరివిరిగా ముందుకొచ్చి సహాయ సహకారాలను అందజేయాలని తలసేమియా చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మేరకు రక్తాన్ని అందజేస్తున్నారు. తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరముంది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలప్పుడు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా వేసవిలో స్వచ్చందంగా రక్తదానం చేయడానికి యువతీ యువకులు ముందుకు రావాల్సిన అవసరముంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ అవసరమైనప్పుడల్లా ఉచితంగా రక్తం అంది స్తోంది. రక్తం ఎక్కించుకోవడానికి (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) దిక్కు తోచని స్థితిలో ఉన్న బాధితులను సొసైటీ ఆదుకుని ఆపన్న హస్తం అందిస్తోంది. రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో... రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో తలసేమియా వ్యాధి సోకుతుంది. పుట్టినప్పటి నుంచే చిన్నారులకు ఈ వ్యాధి వస్తుండటంతో వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్ (రక్తం ఎక్కించుకోవడం) జరిగితే తప్పా... చిన్నారులు బతకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది పేద చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరికి రక్తంతో పాటు ఆర్థిక అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మానవతా ధృక్పథంతో యువత ముందుకొచ్చి తలసేమియా చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరముంది. పిల్లలకు ఈ వ్యాధి వారసత్వంగా ఎలా సంక్రమిస్తుందంటే.. ♦ తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా క్యారియర్ కలిగి ఉంటే, 50 శాతం వారి పిల్లలు తలసేమియా క్యారియర్‌గా ఉంటారు. 50 శాతం ఏ వ్యాధి లేకుండా మాములుగా ఉంటారు. ♦ తల్లిదండ్రులిద్దరూ తలసేమియా క్యారియర్స్ అయితే పిల్లల్లో 25 శాతం సాధారణమైన వారు, 50 శాతం క్యారియర్స్, 25 శాతం తలసేమియా వ్యాధి గ్రస్తులుంటారు. ♦ తల్లిదండ్రుల్లో ఒకరు తలసేమియా వ్యాధి, ఇంకొకరు క్యారియర్‌గా ఉంటే వారి పిల్లలు 50 శాతం క్యారియర్, 50 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు. ♦ తల్లిదండ్రులిద్దరూ తలసేమియా వ్యాధితో బాధపడుతుంటే.... వారి పిల్లలు 100 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులవుతారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి... చిన్నారుల జీవితాలను కాపాడడానికి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. సొసైటీ సభ్యులు చిన్నారుల జీవిత కాలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోని చిన్నారులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. మూడు వారాలకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో ఇబ్బందులను తట్టుకుని చిన్నారుల తల్లిదండ్రులు శివరాంపల్లిలోని ఎన్పీఏ దగ్గరలోని కార్యాలయానికి చేరుకుంటున్నారు. సకాలంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగకపోతే...చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులను రక్షించడానికి సొసైటీ కృషి చేస్తోంది. తలసేమియా వ్యాధి నుంచిచిన్నారులను రక్షించడానికి.. ♦ పెళ్లికి ముందు వధువు, వరుడు హెచ్‌బీఏ2 పరీక్ష ద్వారా వ్యాధి రోగ నిర్ధారణ చేయించుకోవాలి. ♦ ఏదైనా కుటుంబంలో ఎవరైన తలసేమియా వ్యా«ధి కలిగి ఉన్నట్లయితే... ఆ కుటుంబంలోని సభ్యులందరూ హెచ్‌బీఏ2 రోగ నిర్ధారణ రక్త పరీక్ష చేయించుకోవాలి. ♦ తలసేమియా వ్యాధికి ఒక వ్యక్తి రోగ నిర్ధారణ అనుకూలంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ♦ గర్భిణీలు హెచ్‌బీఏ2 పరీక్ష చేయించుకోవాలి. ♦ గర్భధారణ సమయంలో మద్యపానం, ధూమపానం చేయరాదు. -
కండాక్టరమ్మ
అనిత డాక్టరమ్మ కాదు. కండక్టరమ్మ. ప్రయాణికులను గమ్యం చేరుస్తూనే.. ప్రాణాంతక తలసేమియా నుంచి చిన్నారుల ఊపిర్లను నిలుపుతున్నారు! ప్రాణం పోసేవారే కాదు.. ప్రాణం పోయాలని తపించేవారూ డాక్టర్లే. అందుకే ఆమె కండాక్టరమ్మ. అరవై ఏళ్ల అత్తగారు కోడలి ముందుకు వచ్చి, ‘ఆ చిన్నపిల్లల కోసం నీవు చేస్తున్న సేవకు నా పెన్షన్‌లో మూడొంతులమ్మా’ అంటూ డబ్బులు కోడలి చేతిలో పెట్టింది. అత్త చూపిన ఔదార్యం కోడలు అనిత సేవను మరింత ముందుకు కొనసాగించేలా చేసింది. అత్తతో పాటు భర్త, తోటికోడలు, బావ, మరిది ‘మేమూ సాయం చేస్తామం’టూ తలా ఓ చేయి కలిపారు. కుటుంబంలో అందరూ చేయీ చేయీ కలిపితే కొండంత పనైనా దూదిపింజెంత తేలికవుతుందనిపించింది అనితకు. అలా తమందరి వేతనంలో నుంచి కొంత భాగంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను విగతజీవులుగా మారకుండా కాపాడేందుకు వినియోగిస్తున్నారు అనిత.. ఆమె ‘సంకల్ప’బలంతో నేడు వందలాది తలసేమియా చిన్నారులు ఊపిరి నిలుపుకొని హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నారు. మొగ్గ రాలిపోవడం.. దగ్గరగా చూసి! ఖమ్మం ఆర్టీసీ బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు పొద్దుటూరి అనిత. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సమీప బంధువు కుమారుడు తలసేమియా వ్యాధితో బాధపడుతూ మరణించాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పడిన బాధను చూసిన అనిత ‘ఈ వ్యాధితో పసిమొగ్గలు రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా, ఏమీ చేయలేమా..? అని ఆలోచించారు. ఎలాగైనా ఇలాంటి పిల్లలకు బాసటగా నిలవాలని అనుకున్నారు. ‘కదిలిన’.. కుటుంబం తొలుత ఒంటరిగానే తలసేమియా పిల్లలకు సేవ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనిత. వచ్చే వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం అందించడానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు హోంగార్డుగా పనిచేస్తున్న అనిత భర్త రవిచంద్ర ప్రోత్సాహం తోడైంది. అత్త చంద్రలీల, తోడికోడళ్లు పావని, ప్రియ, బావ ఉదయ్‌భాస్కర్, మరిది వంశీకిరీటి ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకొచ్చారు. అలా ఇంట నిలిచిన అనిత బయట గెలవడానికి బయల్దేరారు. 2010లో తలసేమియా వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నిరాశ ఎదురైనా వెరవలేదు! సేవ స్వచ్ఛందమైనా ఇందుకోసం సహకరించే వారే కొరవడటంతో పిల్లలకు ఇవ్వాల్సిన రక్తం కోసం ఎక్కని గడప లేదు.. అడగని సంస్థా లేదు అన్న రీతిలో తన లక్ష్య సాధన కోసం అందరినీ అభ్యర్థించారు అనిత. మొదట్లో ‘ఇదేమి సేవ.. ఎంత చేసినా ఎక్కువ కాలం బతకని పిల్లల కోసం ఎందుకింత ఆరాటం. వాళ్లేమైనా నూరేళ్లూ బతికి బట్టకడతారా.. ’ అంటూ నిరుత్సాహంగా మాట్లాడినవారే ఎక్కువ. అయినప్పటికీ అనిత మాత్రం కుటుంబ సభ్యుల అండతో రక్త సేకరణకు పూనుకున్నారు. మొదట్లో.. కుటుంబంలో ఎవరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వచ్చినా బంధుమిత్రులను కలుపుకుంటూ రక్తదాన శిబిరాలను నిర్వహించేవారు. ఈ క్రమంలో తలసేమియా వంటి భయంకర వ్యాధితో పిల్లలు అనుభవిస్తున్న నరకం, వారి తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభను సమాజానికి అర్థమయ్యేలా చెప్పడంలో కొన్నాళ్లలోనే అనిత అనితర సాధ్యురాలు అనిపించుకున్నారు. దాంతో జిల్లాల్లోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అనిత అందిస్తున్న సేవలు అందరి దృష్టిలో పడ్డాయి. యజ్ఞంలా.. ప్రతినెలా రక్త సేకరణ! తలసేమియా వ్యాధి కారణంగా పిల్లలు చిరుప్రాయంలోనే మరణించిన ఘటనలు తరచూ నమోదు అయ్యేవి. అనిత ‘సంకల్ప’ సంస్థ ఆచరణలోకి వచ్చాక జిల్లాలో తలసేమియా వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. తొలుత రెండు, మూడు బ్యాగుల రక్త సేకరణ నుంచి ప్రారంభమైన అనిత సేవ.. నేడు నెలకు 250 బ్యాగుల రక్తం సేకరించి చిన్నారులకు ఎక్కించే స్థాయికి చేరింది. ఈ రక్తం ఇస్తేనే ఆ నెలకు 180 మంది చిన్నారుల ఆయుష్షు మరో నెలకు పొడిగించబడుతుంది! దాంతో ప్రతినెలా ఈ రకమైన రక్తయజ్ఞం చేయడం ఆమెకు అలవాటైంది. ఒకవైపు కండక్టర్ వృత్తి చేస్తూ.. మరోవైపు సంసారం చక్కదిద్దుకుంటూ, భర్త, అత్త, తోటికోడళ్ల సహకారంతో ‘సంకల్ప’ స్వచ్ఛంద సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్నారు అనిత. ఇప్పుడు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం లోటు లేదు. ప్రతి 15 రోజులకోసారి 180 మంది బాధితులకు రక్తం ఎక్కించడానికి కావాల్సినంత రక్తం ఆమె స్థిరీకరించుకోగలిగారు. కష్టార్జితాన్ని ఖర్చుపెట్టాకే.. ఇంటి నుంచి మొదలైన ఆర్థిక సహాయంతో పాటు దాతల సహకారమూ తోడై ఇప్పుడు ప్రతి నెలా రూ.3లక్షల వరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులను అనిత ఆధ్వర్యంలోని ‘సంకల్ప’.. ఉచితంగా పంపిణీ చేస్తోంది. ‘మా కష్టార్జితాన్ని సేవకు వినియోగించిన తర్వాతే దాతలను ఆశ్రయిస్తామ’న్న అనిత ఆలోచన మరికొందరు సమాజ సేవకులను ఈ సేవలో పాలుపంచుకునేలా చేసింది. తలసేమియా బాధితులకు సేవ చేస్తున్నందుకు, సదస్సుల ద్వారా ప్రజలలో తలసేమియా పట్ల అవగాహన కల్పిస్తున్నందుకు ఈ ఏడాది జూలై నెలలో ఉత్తమ మోటివేటర్ అవార్డును గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నారు అనిత. ‘మేము సైతం’ తలసేమియా వ్యాధి ప్రధానంగా మేనరికపు వివాహాల వల్ల సంతానానికి సంక్రమిస్తుంది. ఆరు నెలల నుంచి ఒకటిన్నరేళ్ల వయసులో ఈ వ్యాధిని గుర్తిస్తే సకాలంలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టి.. మరణం అంచున ఉన్న వారిని సైతం కాపాడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఉండదు.. అందుకే ప్రతి 15, 20 రోజులకోసారి శుద్ధి చేసిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇది శ్రమతో కూడిందే కాదు.. ఖర్చుతో కూడుకున్నది. అయితే అనిత చేసిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. మేము సైతం అంటూ జిల్లాలోని పలువురు వైద్యులు, పోలీస్ అధికారులూ బాసటగా నిలిచారు. జాతీయపర్వదినాలలో రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ‘సంకల్ప’ సంస్థకు శివ బ్లడ్ బ్యాంక్ యజమాని రాజేశ్గార్గె సేవలు తోడయ్యాయి. అలాగే పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, అంకుర ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాకేశ్ తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. – మాటేటి వేణుగోపాల్, సాక్షి, ఖమ్మం -
సముద్రమంత పెద్ద కష్టం తలసేమియా
తలసేమియా.. అంటే గ్రీకు భాషలో సముద్రం అని అర్థం. మనకు మాత్రం ఇదో వ్యాధి అనే విషయం తెలుసు. వ్యాధిగ్రస్తుల కష్టం సముద్రమంత పెద్దది. అందుకే దానికి ఆ పేరు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆవహించే ఈ మహమ్మారి.. పుట్టిన మరుక్షణం నుంచే నరకం చూపిస్తుంది. ఒకసారి ఆపరేషన్ చేస్తే సమసిపోయే సమస్య కాదు.. జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిస్తున్నాడు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్. ముంబై: తలసేమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి – అమావాస్యలను తలపిస్తాయి. ఒంటినిండా రక్తం ఉన్నప్పుడు.. బిడ్డ పున్నమి చంద్రుడిలా కళకళలాడుతుంటాడు. హుషారుగా కన్పిస్తాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతాడు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి ఇది. దురదృష్టం ఏమిటంటే.. ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా జన్యువాహకులైన తల్లిదండ్రులకు (తలసేమియా మైనర్) జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులయ్యే (తలసేమియా మేజర్) అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసేమియా వాహకులు ఉన్నారు. సమస్య ఏంటంటే..: మనం పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణం పోతుంది. ఏటా దేశంలో 12000 చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారట. చికిత్స ఏంటంటే..: తలసేమియా రోగులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. మరోదారి లేదు. నెలనెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్స్ వాడాలి. క్రమం తప్పకుండా దంత, గుండె, మూత్రపిండాల, కాల్షియం, ఫాస్పరస్ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తుండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఏదో ఓ రోగం వస్తుంది. తలసేమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. అవగాహన అవసరం దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న యువతీయువకులు తలసేమియాపై అవగాహన పెంచుకోవాలని బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ పిలుపునిస్తున్నారు. ఆరోగ్యకరమైన కుటుంబం కోసం ముందుగానే తలసేమియాను గుర్తించే రక్తపరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో తలసేమియాపై అవగాహన కల్పించే ప్రచారకర్తగా కొనసాగుతున్న జాకీష్రాఫ్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు తలసేమియాకు సంబంధించిన నిజాలు తెలుసుకోవాలి. తాము వాహకులం కాదని నిర్ధారించుకున్నాకే బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధం కావాలి. ఇందుకోసం వైద్యశాస్త్రంలో ఎన్నో మార్గాలున్నాయి. అలా కాదని నిర్లక్ష్యం చేస్తే.. పుట్టబోయే బిడ్డ మాత్రమే కాదు.. తల్లిదండ్రులు కూడా నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంద’న్నారు. -
మా ఆసరాకు మన ఆసరా
పిల్లలకు రక్తదానం చేయాలి అన్న ఒకే ఒక స్పృహతో ‘మా ఆసరా’ మొదలుపెట్టినప్పుడు తలసీమియా వ్యాధి గురించి దేచిరాజు మాలతికేమీ తెలియదు. ఆ మాటకొస్తే ‘మా ఆసరా’ ఆర్గనైజేషన్‌కూ పెద్ద అవగాహన లేదు. కానీ ఒకరోజు ఆమెకు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆమె ఆలోచనా దృక్పథాన్నే మార్చేసింది. ‘రిథమ్ ఆఫ్ లైఫ్’ అనే కాన్సెప్టుకు ఊపిరిపోసింది. రెండేళ్ల క్రితం ఓ రోజు ఖమ్మం జిల్లా పాల్వంచ, సాక్షి రిపోర్టర్ నుంచి మాలతికి ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ఇక్కడి తండాలో ఓ ఆర్నెల్ల పిల్లాడున్నాడు. వాడికి ఏదో జబ్బు వచ్చి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. దానికి యాభై లక్షలు ఖర్చువుతుందట. మీరేమైనా ఆర్థిక సహాయం అందించగలరా?’’ అని. పిల్లాడిని తీసుకొని హైదరాబాద్ రమ్మనండి అని చెప్పారు మాలతి. పిల్లాడిని హైదరాబాద్ తీసుకువచ్చిన తల్లిదండ్రులను ‘మా ఆసరా’ గ్రూప్‌లోని ఇద్దరు సభ్యులకు పరిచయం చేసి వాళ్లతో నిలోఫర్ హాస్పిటల్‌కు పంపించారు మాలతి. పిల్లాడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ‘తలసీమియా’ అని తేల్చారు. తలసీమియాకూ ‘మా ఆసరా’ ఆ సందర్భంగా, తలసీమియా గురించి సరైన అవగాహన లేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పోగొట్టుకుంటున్నారు అని గ్రహించిన మాలతి ఈ వ్యాధి మీద ‘మా ఆసరా’ తరపున గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులూ నిర్వహించడం మొదలుపెట్టారు అయినా ఈ సేవ సరిపోదు. ఏదైనా చేయాలి. చేయాలీ అంటే డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఎలాంటి సేవైనా చేయొచ్చు అన్న తన మాటనే... డబ్బుతో అత్యంత అవసరమున్న సేవను కొంతైనా చేయొచ్చు అని తిరిగి చెప్పుకున్నారు. ఆ మాటకు ఆచరణ రూపమే... రిథమ్ ఆఫ్ లైఫ్. ఫిల్టర్ పాయింట్ ఒక్కటే!: తలసీమియా పిల్లలకు తరచు రక్తం ఇవ్వాలి. అయితే ఆ పిల్లలకు ఇచ్చే రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ ఒక్క హైదరాబాద్‌లోనే, అదీ ఛత్తాబజార్‌లోని ల్యుకో డిప్లెషన్ ఫిల్టర్ తలసీమియా సిక్లీసెల్ సొసైటీలో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాళ్లయినా, తెలంగాణలోని ఆదిలాబాద్ వాళ్లయినా పిల్లల్ని తీసుకొని ఇంతదూరం నెలకు కనీసం రెండుసార్లయినా రావాల్సి ఉంటుంది. ఎంత కష్టం? ఎంత ఖర్చు! దీనికి పరిష్కారం ఆలోచించాలి. అది డబ్బుతో ముడిపడ్డది. అయినా సరే ముందుకెళ్లాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడే రిథమ్ ఆఫ్ లైఫ్ మాలతి మదిలో మెదిలింది. వెంటనే ఫేస్బుక్లో ఉన్న తమ రైటర్స్ గ్రూప్‌తో చర్చించారు. అందరూ రైటర్సే కాబట్టి వాళ్లకు నచ్చిన అంశంమీద ఓ పాట రాయమని, అలా ఆ పాటలన్నిటికీ సంగీతం సమకూర్చి రికార్డు చేయించి సీడీలా రూపొందించి.. ఆ పాటల ప్రోగ్రామ్ని లైవ్ మ్యూజిక్ నైట్ ఈవెంట్‌గా చేసి వచ్చిన డబ్బుతో తలసీమియా పిల్లలకు బ్లడ్ ప్యూరిఫై చేసే ఫిల్టర్స్ కొనిద్దాం అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సీడీ రెడీ : అందరికీ ఈ పనిపట్ల ఆసక్తి ఉన్నా పాటలు రాయడానికి మాత్రం ముగ్గురే ముందుకు వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు మాలతి, ఇంకొకరు ఇమ్రాన్శాస్త్రి, మూడోవారు వినీల్. వీళ్లు రాసిన పదకొండు పాటలకు నయా పైస తీసుకోకుండా సంతోష్ కావలి అనే సినీ సంగీతదర్శకుడు స్వరాలు అందించారు. ఉచితంగా రికార్డ్ కూడా చేయించి ఇచ్చారు. రమ్యా బెహ్ర, అనఘా లాంటి వర్తమాన గాయనీగాయకులు ఈ గీతాలను ఆలపించారు. ఈ సీడీని ఏప్రిల్ 25న, హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఆవిష్కరిసు ్తన్నారు. దీంతోపాటు తలసీమియా మీద చైతన్యం కలిగించడానికి ఈ వ్యాధి బాధితుల మీద మా ఆసరా సంస్థ తీయించిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌నీ విడుదల చేస్తున్నారు. ఈ రెండిటితోపాటు సీడీలో పాడిన గాయనీగాయకులతో లైవ్‌మ్యూజిక్ ప్రోగ్రామ్‌నూ నిర్వహిస్తున్నారు. దీనికి ఆరువందల రూపాయల టికెట్ పెట్టారు. ఈ టికెట్ కొనడమంటే తలసీమియా బాధితులకు కొనే ఫిల్టర్‌కోసం డొనేట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని తలసీమియా పిల్లలకు నాలుగు యూనిట్ల రక్తాన్ని శుద్ధిచేసే ల్యూకో డిప్లెషన్ ఫిల్టర్లు కొనివ్వడానికి వెచ్చిస్తున్నారు. - సరస్వతి రమ -
ప్రాణాలు తీస్తున్న తలసేమియా..!
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : తలసేమియా.. ఇదొక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే..! ప్రాణాలు కాపాడుకోవాలంటే పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిందే. జిల్లాలో రక్తం కొరత, సీబీఆర్‌ఎం యూనిట్ అందుబాటులో లేక బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లక్షణాలు.. తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధి సక్రమిస్తుంది. పుట్టుకతోనే వచ్చే ఈ వ్యాధి.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బయటపడుతుంది. మూడు నుంచి 18నెలల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన వారిలో రక్తహీనత మొదలవుతుంది. జీర్ణశక్తి మందగించడం, మొహం పాలిపోవడం, పిల్లల్లో అల్లరి తగ్గిపోవడం, ఎదుగుదల లోపించడం, హుషారుగా కనిపించేవారు కాస్తా నీరసించడం జరుగుతుంది. పచ్చకామెర్లు, కీళ్లనొప్పులు, కడుపునొప్పి, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి వ్యాధులు కూడా వెంటాడుతాయి. సరైన వైద్య సౌకర్యాలు లేని జిల్లాలో రోగ నిర్దారణ కొంత కష్టమే. అందుకే వైద్యులు జ్వరం, విరేచనాలు, రక్తహీనత అని చెబుతారు. ఒక్కోసారి ప్రాణం పోయినా వ్యాధి తెలియకుండా పోతుంది. మంచిర్యాల ఏరియా ఆస్పత్రి, రిమ్స్‌లో వైద్యం, ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నా.. మందుల కోసం ఒక్కో రోగి నెలకు రూ.3వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత నాలుగేళ్లలో తలసేమియా వ్యాధిగ్రస్తులు సుమారు 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అవగాహన లోపం.. తలసేమియా వ్యాధిపై చాలా మందిలో అవగాహన లేదు. మేనరికం, వ్యాధిగ్రస్తులు వివాహం చేసుకోవడం వల్ల వ్యాధి పిల్లలకు సంక్రమిస్తుంది. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చు. అలా చేయకపోవడం వల్ల పిల్లలు వ్యాధి బారిన పడాల్సి వస్తోంది. పెళ్లికి ముందు కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ), హెచ్‌బీఏ 2 పరీక్షలు చేయించుకుంటే సమస్యలు ఏర్పడ వు. పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునేలా ఎలా ప్రచారం చేస్తున్నారో తలసేమియాపైనా ప్రచారం చేయాలని పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ దుస్థితి.. జిల్లాలో ఏటా దాదాపు వంద నుంచి 150 మంది వ్యాధి బారిన పడుతున్నారు. గతేడాది 600 మంది వ్యాధిగ్రస్తు లు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 1,500కు చేరింది. ఒక్క తూర్పు జిల్లాలోనే 400 మంది వరకు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు 15రోజులకోసారి సెలైన్ వాష్డ్ రక్తం ఎక్కిస్తే జీవిస్తారు. ఒకటి రెండుసార్లు కాదు జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. 20 సార్లకు పైగా రక్తం ఎక్కిస్తే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుం ది. ఆ తర్వాత 40 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉం టుంది. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. నెలలో రెండు సార్లు వెళ్లి రావడం తో అన్నీ కలిపి దాదాపు రూ.5వేలకు పైగా ఖర్చయ్యేది. పేదలకు ఈ ఖర్చు భారమయ్యేది. ప్రస్తుతం మంచిర్యాలలోనూ రక్తం ఎక్కిస్తుండడంతో కొంత భారం తగ్గింది. రక్తం కొరత.. తలసేమియా లక్షణాలు ప్రజలకు వివరించడంలో విఫలమైన అధికారులు రక్తదాన శిబిరాల నిర్వహణలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి పైగా బాధితులు ఉన్నారు. వీరిలో 600 మంది రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌ల్లో రక్తం ఎక్కించుకుంటున్నారు. మిగతా వారు హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒక్క మంచిర్యాలలోనే ఇప్పటి వరకు 400 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందరికీ రక్తం ఎక్కించాలంటే రక్తం నిల్వలు అవసరం. తూర్పు జిల్లాలో అందరికీ రక్తం అందించాలంటే నెలకు 20 క్యాంపులు అవసరం అవుతాయి. కానీ బ్లడ్‌బ్యాక్ అతికష్టం మీద పది వరకు మాత్రమే క్యాంపులు నిర్వహించగలుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. జిల్లాలో తలసేమియా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. వ్యాధిగ్రస్తులకు 15యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీలో తయారయ్యే ఈ మెడిసిన్ రోగి శరీరంలో పేరుకుపోయిన ఐరన్‌ను తగ్గిస్తుంది. దీంతో రోగిలో హెచ్‌బీ శాతం పెరుగుతుంది. ఈ మందు అందించే సెలైన్ బాక్స్ ఆర్బీసీ మిషన్(సీబీఆర్‌ఎం) యూనిట్ కేవలం హైదరాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ, కోఠిలోని తలసేమియా సికిల్‌సెల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యూనిట్ల ఏర్పాటు బాధ్యత తన పరిధిలో లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో బతకాలనే ఆశతో రూ.10వేల వరకు అప్పు చేసి హైదరాబాద్‌లో మందులు వాడుతున్నారు. మంచిర్యాలతోపాటు సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో యూనిట్ ఏర్పాటు కోసం సింగరేణి ముందుకొచ్చింది. 2008లో రూ.23.40లక్షలతో పరికరాలు కొనుగోలు చేసింది. కానీ కాంపొనెంట్ యూనిట్ ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా.. నాలుగేళ్ల నుంచి ఆ పరికరాలు మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలోనే నిరుపయోగంగా ఉన్నాయి. అందుబాటులో సేవలు... మంచిర్యాలలో బ్లడ్ కంపోనెంట్ నిర్వహణకు అనుమతి లభించడంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు చాలా వరకు వ్యయప్రయాసాలు తగ్గాయి. ఇప్పుడిప్పుడే తలసేమియా వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందుబాటులోకి వస్తోంది. సింగరేణి సహాయంతో ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్ కంపోనెంట్(సెలైన్ వాష్డ్ రక్తం) ఏర్పాటు చేశారు. రిమ్స్‌లో ఏడాది క్రితమే ఈ మిషన్ ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఐరన్ చిల్లేషన్ మందు లు కూడా అందిస్తున్నారు. దీంతో ఇటు రక్తనిధి కేంద్రం లో అందుబాటులో రక్తంతోపాటు ఐరన్ చిల్లేషన్ మందు లు లభిస్తుండడంతో రోగుల జీవితాల్లో కొంత వెలుగు కనిపిస్తోంది.