సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్) హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు.
ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది.
ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు.
రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన
ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్‌ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం.
ఎలాంటి పొరపాటు జరుగలేదు
రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్‌ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం.
బాలుడికి హెచ్‌ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్‌ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం.
– డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment