thalassemia
-
Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!
మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్ ఆర్టిస్ట్‌లు.నవంబర్ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్ సెల్ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి. సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్ బ్లడ్ డిజార్డర్) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ’ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు. తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్. ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.డాక్టర్ కావాలని ఉంది...‘‘నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.మా గురించి ఆలోచించండి...‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. మా భోజనం అందరిలానే ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.భయపడితే బతకలేము...నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్ లెవల్స్ పెరగకుండా ట్యాబ్లెట్లు ఇస్తారు. దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్ అండగా ఉంటోంది. – మెహవీన్ ఫాతిమానేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు. – నిహారికప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. – సంకీర్తన, కరీంనగర్రక్తదాతలు ముందుకు రావాలి...తలసేమియాతో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు. దేశంలోని ఎన్నో హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీఏడుపొచ్చింది...ఇక్కడి రాగానే ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్’ అనే డైలాగ్ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ రైమ్స్ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. – తనస్వీ, చైల్డ్ ఆర్టిస్ట్పెద్దయ్యాక సహాయం చేస్తాను...తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. తను డాక్టర్ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను. – మోక్షఙ్ఞ, చైల్డ్ ఆర్టిస్ట్ప్రభుత్వం ఆదుకోవాలి...ఇది జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. – సుమాంజలి, సెక్రటరీ– సీఈఓఈ టెస్ట్ తప్పనిసరి చేయాలి...మేము ఆశ వర్కర్లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. – చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...ఈ పిల్లలను చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్ చెప్పాను. నా షూటింగ్స్ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తాను.– అనన్య, చైల్డ్ ఆర్టిస్ట్ తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్ స్టార్స్’ పేజీ ఇస్తున్నాం.– డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనీల్ మోర్ల -
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ ఆధ్వర్యంలో తలసేమియా పరీక్షలు
హైదరాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ అధ్వర్యంలో తలసేమియా(సికిల్ సెల్ అనీమియా) వ్యాధిని గుర్తించే హెచ్పీఎల్సీ(హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) పరీక్షలను నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నర్గీస్ సకీనా యార్ ఖాన్, కార్యదర్శి ఫాతిమా తాహిర్‌లు.. జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో 23 మంది మహిళలకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ హానికర రక్త హీనత(సికిల్ సెల్ అనీమియా) వంశపారంపర్యంగా వ్యాపిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్లో లోపం కారణంగా ఇది సంభవిస్తుంది. జన్యువులలో మ్యుటేషన్ కారణంగా ఈ వ్యాధి రావచ్చని వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి తల్లి నుంచి శిశువుకు వ్యాపించకుండా నిరోధించడానికి గర్భిణీలకు ముందస్తు నిర్ధారణ చాలా ముఖ్యమని డాక్టర్లు వెల్లడించారు. తలసేమియా వ్యాధి కలిగిన వ్యక్తులను గుర్తించడానికి ఈ హెచ్పీఎల్సీ (హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు వ్యాధి వ్యాపించకుండా నిర్దారణకు ఈ టెస్టు ఉపయోగపడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. సికిల్ సెల్ అనీమియాను కనిపెట్టడానికి హెచ్పీఎల్సీ టెస్టింగ్ నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి తమకు ఎఫ్‌పీఏఐ సహాయం చేసినట్లు చెప్పారు. తలసేమియాను గుర్తించిన మహిళలకు కాల్షియం సిరప్, మల్టీవిటమిన్ సిరప్ బాటిల్లను అందించారు. ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
వారి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వ అభయం
సాక్షి, అమరావతి : తరచూ రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి జబ్బులతో బాధపడే రోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ వీరి పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు వలంటీర్లు ఠంఛన్‌గా గుమ్మం వద్దకే పింఛన్ చేరవేస్తున్నారు. అంతే కాకుండా వీరికి ఉచితంగా రక్తమార్పిడి సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఆరోగ్యానికి మరింత అండగా నిలిచే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ తరహా జబ్బులతో బాధపడే వారికి వైద్య సేవల కోసం ప్రత్యేక వార్డులను ఆస్పత్రుల్లో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల వీరి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖ కేజీహెచ్, కర్నూల్, కాకినాడ, గుంటూరు జీజీహెచ్‌లలో హిమోగ్లోబినోపతీస్, హీమోఫిలియా సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల వైద్య సేవల కోసం ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను వైద్య శాఖ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40 లక్షల చొప్పున రూ.1.60 కోట్లు వెచ్చిస్తోంది. ప్రతి కేంద్రంలో పది పడకలు, ఒక మెడికల్ ఆఫీసర్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు, రక్త మార్పిడికి సంబంధించిన అధునాతన పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. వీలైనంత త్వరగా పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శ్యాక్స్ పీడీ నవీన్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
AP: వలంటీర్ నిబద్ధత.. చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేత
నందిగామ: తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి వలంటీర్ చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేశాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వరరావు, అమల దంపతుల కుమారుడు భూక్యా జ్యోతీశ్వర్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ప్రభుత్వం నెలవారీ పింఛన్ అందిస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడిని శస్త్ర చికిత్స నిమిత్తం చెన్నైలోని రేలా ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో గ్రామానికి చెందిన వలంటీర్ బాణావత్ రాముడునాయక్ శుక్రవారం చెన్నై వెళ్లి జ్యోతీశ్వర్‌కు పింఛను నగదు అందజేసి పని పట్ల నిబద్ధతను చాటుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు వలంటీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. -
డాక్టర్ కాకుండానే ప్రాణాలు కాపాడొచ్చు!
బ్లడ్ వారియర్స్: ఒక జీవితాన్ని కాపాడాలంటే మీరు డాక్టర్ కావాల్సిన అవసరంలేదు. రక్తదానం చేసి జీవితాన్నికాపాడండి. కోవిడ్-19 మనందరినీ కఠినమైన సమయాల్లోకి తీసుకువెళ్ళి మన జీవితాలను చాలావరకు స్తంభింపజేసింది. మనలో చాలా మందికి మన భద్రతావలలు వెనక్కితగ్గగా, కష్టాల్లో, బాధల వలలో ఉన్నఎంతో మంది జీవితాలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి బాధలు అనుభవించే ఎంతోమందిలో తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న రోగులు కూడా ఉన్నారు. తలసేమియా మేజర్ బాధితులు ప్రతి 15-20 రోజులకు రక్తం ఎక్కించుకోకుంటే బతకడం కష్టం. భారతదేశంలో సుమారు లక్షకు పైగా తలసేమియా మేజర్ రోగులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 10,000 నుంచి12,000 వరకు కొత్తగా తలసేమియా బాధిత పిల్లలు మనదేశంలో జన్మిస్తున్నారు. అవగాహన తక్కువగా ఉండటం దీనికి పెద్దకారణం. పిల్లల పుట్టుకకు ముందు తలసేమియా క్యారియర్స్‌ను పరీక్షించడం, నిర్ధారించడం గురించి చాలా మంది వైద్యులకు కూడా తెలియదు. లాక్డౌన్లో చాలామందికి రక్తం దొరకడం కష్టం అవుతుందని తెల్సి మనవల్ల చేతనైనంత సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో మొదలైన యువ సంస్థ బ్లడ్ వారియర్స్ హైదరాబాద్. కొద్దిమంది రోగులకు మద్దతు ఇవ్వాలనే ప్రయత్నంతో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఈ సంస్థ గత 6 నెలల్లో 340పైగా రక్తదానాలు చేయించి 200 మందికిపైగా రోగులకు అండగా నిలిచింది. బ్లడ్ వారియర్స్ ఇప్పుడు 24 మంది వలంటీర్లు 250 మందిపైగా రక్తదాతలతో మరింత మందికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. బ్లడ్బ్రిడ్జి అనే ఒక ప్రక్రియ రూపొందించి, ప్రతిరోగికి ఒక సంవత్సరం పాటు రక్తదానం ఇచ్చేలా దాతల బృందం తయారు చేశారు. ప్రస్తుతం బ్లడ్బ్రిడ్జిలో భాగంగా14 మంది రోగులకు రక్తం అందిస్తున్నాము. ఒక సంస్థగా బ్లడ్ వారియర్స్, రక్తదానంతో తలాసేమియా రోగులకు అండగా ఉంటూ, రక్తరుగ్మతపై అవగాహన చే ప్రయత్నం చేస్తూ ఇంకా ఎంతో మంది రోగులకు సేవలు అందించాలని ఆశిస్తోంది. సమాజంతో కలిసి ప్రినేటల్రోగ నిర్ధారణ నిర్వహించడానికి, తలసేమియా క్యారియర్లను గుర్తించడానికి విధాన స్థాయి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. (Advertorial) ఒక జీవితాన్ని కాపాడాలంటే మీరు డాక్టర్ కావాల్సిన అవసరంలేదు. రక్తదానం చేసి జీవితాన్నికాపాడండి. వివరాలకు: 9030111742, 9700388428 https://bit.ly/bloodbridge -
తలసేమియా చంపేస్తోంది...!
మంచిర్యాలటౌన్: తలసేమియా.. ఓ ప్రాణాంతక వ్యాధి. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేలకుపైగా తలసేమియా బాధితులు ఉన్నారు. వాస్తవానికి వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్యపరీక్షలు చేస్తేగానీ ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించలేకపోతున్నారు. దీంతో ఎంత మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారనే దానిపై పూర్తిస్థాయిలో లెక్కలు లేవు. తలసేమియా వ్యాధికి గురైన బాధితులు 15 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఒక్కో రోగి మందుల కోసం నెలకు రూ.6 వేలకుపైగా అయ్యే ఖర్చు బాధితులకు మిగులుతోంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా కావాల్సింది రక్తమే. ఆ రక్తమే ప్రస్తుతం వారికి దొరకడం కష్టంగా మారింది. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. బాధితులు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వ్యాధి లక్షణాలు.. జాగ్రత్తలు తలసేమియా వంశపారపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. మైనర్, ఇంటర్మీడియెట్, మేజర్ దశల్లో ఉంటుంది. తలసేమియా అల్ఫా, బీటా రెండు రకాలు. ఒక అల్ఫా చెంజ్ కానీ, ఒక బీటా చెంజ్ తగ్గినప్పుడు మైనర్ వ్యాధి ఉన్నట్లు. వీళ్లు వ్యాధిగ్రస్తులైనప్పటికీ రక్త మార్పిడి అవసరం లేదు. వీరు వ్యాధి తీవ్రతతో బాధపడరు. కానీ వారి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది. ఇంటర్మీడియెట్, మేజర్స్‌లో చెన్స్ ఎక్కువగా దెబ్బతింటాయి. హిమోగ్లోబిన్(హెచ్‌బీ) తగ్గుతుంది. వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రోగి శరీరంలో ఒక యూనిట్ రక్తం ఎక్కిస్తే, ఒక గ్రాము హెచ్‌బీ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ మెయింటనెన్స్ కనీసం 10.5 గ్రాములు శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రతి పదిహేను రోజులకోసారి వీరికి రక్తం అవసరం. జ్వరం రావడం, ఆకలి తగ్గడం, కామెర్లు, మూత్రం పసుపు రంగులో రావడం, ఇన్ఫెక్షన్ జరగడం వంటి లక్షణాలతో మనిషి ఎదుగుదల నిలిచిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గి ఎముకలు విరిగే అవకాశాలుంటాయి. వ్యాధిగ్రస్తులు ఐరన్ సంబంధిత మందులు, ఆహార పదార్థాలు, వంటపాత్రలు వాడరాదు. కాల్షియం (ఎముకలను బలపరిచే) పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచిర్యాల బ్లడ్‌బ్యాంక్‌లో సేవలు.. ఉమ్మడి జిల్లాలోనే తలసేమియా వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకులో లభిస్తున్నాయి. 514 మందికి ప్రతినెలా రక్తాన్ని ఉచితంగా ఎక్కిస్తున్నారు. తలసేమియా వ్యాధి సోకిందో..? లేదో..? తెలుసుకునేందుకు అవసరమైన హెచ్‌బీ ఏ2 పరీక్ష చేసే హెచ్‌పీసీఎల్ మిషన్‌ను మంచిర్యాలలోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకుకు అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఐటీడీఏ తరఫున అందించారు. దీంతో ఇప్పుడు ఎవరికి తలసేమియా వ్యాధి సోకిందో పరీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. సహజంగా తలసేమియా బాధితులకు 15 యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాలి. ఈ మెడిసిన్ రోగి శరీరంలోకి తరుచూ రక్తాన్ని ఎక్కించడం వల్ల పేరుకుపోయిన ఐరన్‌ను తగ్గిస్తుంది. దీంతో రోగిలో హెచ్‌బీ శాతం పెరుగుతుంది. ఈ మందు అందించే సెలైన్ బాక్స్ ఆర్బీసీ మిషన్(సీబీఆర్‌ఎం)ను మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీకి సింగరేణి సంస్థ అందజేసింది. తలసేమియా వ్యాధిని గుర్తించే రక్తపు క్షీణతను గుర్తించే హెచ్‌పీఎల్‌పీ పరికరం ఉట్నూరు, మంచిర్యాలలో అందుబాటులో ఉంది. శరీరంలో ఐరన్ లెవల్స్ పెరగడం వల్ల, తలసేమియా వ్యాధిగ్రస్తులు 30 ఏళ్ల వరకే జీవిస్తున్నారు. ఉచితంగా రక్తం మార్పిడి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని బ్లడ్‌బ్యాంకులో 514 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నాం. రక్తం ఎక్కించిన ప్రతిసారి ఐరన్ నిల్వ ఎంత మేర ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన సీరం అబార్ట్ ఐ 100 ఎస్ఆర్ మిషన్‌ను సింగరేణి అందించింది. ఆరోగ్యశ్రీలో ఉండడంతో 514 మందికి ఉచితంగా రక్తం ఎ క్కించడంతో పాటు, మందులను అందిస్తున్నాం.– చందూరి మహేందర్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ -
మృత్యువుతో చిన్నారి పోరాటం
మండ్య: తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతోఆనందంగా గడపాల్సిన ఓ చిన్నారిని రక్తదాహానికి మారుపేరైన తలసీమియా వ్యాధి పట్టి పీడిస్తోంది. నాలుగేళ్ల వయస్సులోనే మంచం పట్టిన కుమార్తెను కాపాడుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక పోషకులు తల్లడిల్లుతున్నారు. మారాజులు మంచి మనస్సు చేసుకొని ఆపన్నహస్తం అందించి తమ కుమార్తె వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని పోషకులు కోరుతున్నారు. వివరాలు..మండ్య తాలూకా, హాడ్యా గ్రామానికి చెందిన సుధాకర్, భవాని దంపతులకు మనస్వి అనే నాలుగు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉంది. పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులకు చూపించారు. తరచూ రక్తం అవసరమయ్యే తలసీమియా అనే వ్యాధికి బాలిక గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు రూ.30లక్షలు వ్యయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసేవరకు బాలికను కాపాడుకోవాలంటే 15 రోజులకు ఒక మారు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. దీంతో పోషకులు అప్పులు చేసి రక్తం కొనుగోలు చేసి చిన్నారిని కాపాడుకుంటున్నారు. ఇప్పటివరకు ఐదారు లక్షల రూపాయల వరకు వ్యయం చేశారు. ప్రాణభిక్ష పెట్టండి:చిన్నారి మనస్వి తండ్రి సుధాకర్ మండ్యలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారి రూ. ఐదారువేలు వ్యయం అవుతోందని, అయితే చేతిలో చిల్లిగవ్వలేక అప్పులు చేస్తున్నామని వాపోయాడు. తన కుమార్తె ఆపరేషన్‌కు 30లక్షల రూపాయలు వ్యయం అవుతుందని వైద్యులు చెప్పారని, మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మండ్య శాఖ ఖాతా నంబర్ 39024499683 ఐఎఫ్ఎస్సీ కోడ్–ఎస్బీఐ 0040326 సెల్‌నంబర్లు:9538716450, 953598590 -
‘తలసేమియా’తో విద్యార్థిని మృతి
సుజాతనగర్ : సీతంపేట బంజరకు చెందిన ధారావత్ స్వాతి (15) విద్యార్థిని మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వీరు, నీలావతి దంపతుల కుమార్తె స్వాతి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. కొన్ని సంవత్సరాలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, వైద్యం కోసం కుటుంబ సభ్యులు కొత్తగూడెం తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఖమ్మంలో వైద్యం పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా స్వాతి ఇంట్లో గతంలో రెండేళ్ల బాలుడు కూడా తలసేమియా వ్యాధితోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థి మృతిపై వైద్యాధికారి భూక్యా నాగమణిని వివరణ కోరగా స్వాతి వైద్య రిపోర్టులు పరీక్షించిన ఆమె ‘సికిల్ సెల్ ఎనీమియా’ అనే వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. స్వాతి మృతికి సంతాప సూచకంగా పాఠశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. -
చిన్నారి వైద్యం కోసం వినతి
వాల్మీకిపురం: చిన్నారి మహ్మద్ అమాన్‌బాషా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యానికి రూ.13 లక్షలు కావాలని వైద్యులు చెప్పారని, తమ వద్ద డబ్బులు లేవని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలసి విన్నవించారు. గుర్రంకొండ మండలం, అమిలేపల్లికు చెందిన షఫీ కుమారుడు మహ్మద్ అమాన్‌బాషా (5) పుట్టిన ఆరునెలల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, 15 రోజులకు ఒకసారి బెంగళూరు రక్తమార్పిడి చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి ఖర్చుచేశారని, ప్రస్తుతం బిడ్డను కాపాడుకునే స్థితిలో లేరని, దయ చూపాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే బెంగళూరులోని వైదేహి ఆస్పత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్ దుర్గాప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. దయతో ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరారు. దాతల సహకారంతో శస్త్రచికిత్స చేయించే విధంగా చూస్తామని డాక్టర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషంతో వెనుదిరిగారు. -
రక్తదానం కోసం.. రంజాన్ దీక్షను పక్కనబెట్టాడు
సాక్షి, పట్నా: మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువైంది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తాను చేస్తోన్న ఉపవాస దీక్షను పక్కనబెట్టాడు ఓ మహమ్మదీయుడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా సదార్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు రాజేశ్‌కుమార్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడిని తీసుకువచ్చాడు అతని తండ్రి. తలసేమియా వ్యాధి కారణంగా బాలుడికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పడంతో ఆ తండ్రి ప్రతీ బ్లండ్ బ్యాంకును సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రాణాలతో పోరాడుతున్న రాజేశ్ దీనగాథ విని జావెద్ ఆలం అనే వ్యక్తి రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అప్పటికే జావెద్ రంజాన్ దీక్షలో ఉన్నాడు. సాధారణంగా రంజాన్ ఉపవాసంలో ఉన్నవారు ఆ రోజు దీక్ష ముగిసేదాకా మంచినీళ్లయినా ముట్టరు. కానీ, రక్తదానం తరువాత జావెద్ పళ్లరసాలు, కొన్ని పండ్లను తీసుకున్నాడు. బాబు ప్రాణాలు కాపాడేందుకు దీక్ష భగ్నం చేశాడని తెలిసి.. స్నేహితులు జావెద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తలసేమియా వ్యాధి ఉన్న వారికి మూడు, నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. -
తలసేమియా చిన్నారులకు చేయూత
న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడే దాదాపు 200 మంది చిన్నారులకు ఈ ఏడాది చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా టాటామెడికల్ రీసెర్చ్ సెంటర్(కోల్‌కతా), సీఎంసీ(వెల్లూర్), రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్(ఢిల్లీ) కేంద్రాల్లో వీరికి చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఖర్చయ్యే రూ.20 కోట్ల మొత్తాన్ని కోల్ ఇండియా(సీఐఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద అందించనుంది. తల్లిదండ్రుల జీతం రూ.20 వేల కంటే తక్కువగా ఉన్న చిన్నారులకే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతిఏటా సుమారు 12,000 మంది చిన్నారులు తలసేమియా సమస్యతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స అందించడానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో రోగికి రూ.22–25 లక్షల వరకూ ఖర్చవుతోంది. -
'రక్త' కన్నీరు!
* థలసీమియా చిన్నారుల హాహాకారాలు * రక్త దాతల కోసం ఎదురు చూపులు * థలసీమియా సొసైటీలో 50 యూనిట్లకు పడిపోయిన రక్త నిల్వలు * ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: థలసీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారులు రక్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తనిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వారం రోజులుగా థలసీమియా బాధితులు ప్రాణాలకోసం పోరాడుతున్నారు. వీరిలో మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసుగల చిన్నారులున్నారు. బాధితులకు పదిరోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉండగా 16 రోజులకు కూడా రక్తం దొరకడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ థలసీమియా సికిల్‌సెల్ సొసైటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సొసైటీ పరిధిలో ఇప్పటివరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన థలసీమియా బాధితులు సుమారు 2,500 మంది వరకూ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లుగాక మరో 2,500 మంది వరకూ బాధితులు ఉన్నారని అంచనా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పురాణాహవేలి ప్రాంతంలో ప్రత్యేక రక్తనిధి కేంద్రం నడుస్తోంది. దీనిద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, సేకరించిన రక్తాన్ని శుద్ధిచేసి బాధితులకు ఎక్కించడం చేస్తుంటారు. కానీ రక్త దాతలు కరువవడంతో ఇక్కడ నిల్వలు తీవ్రంగా పడిపోయినట్టు సొసైటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 యూనిట్లనుంచి 50కి పడిపోయిన నిల్వలు థలసీమియా సొసైటీ పరిధిలో నడుస్తున్న రక్తనిధి కేంద్రంలో ఎప్పుడూ 300 యూనిట్ల రక్తం స్టాకు ఉంటుంది. రోజూ 50 యూనిట్ల రక్తం వ్యయమవుతూ ఉంటుంది. అలాంటిది స్టాకు 50 యూనిట్లకు పడిపోవడం, దాతలు సకాలంలో స్పందించకపోవడంతో బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. బాధితులకు సమయానికి రక్తం ఎక్కించకపోతే ఒకవిధంగా మృత్యువుతో పోరాడినట్టే ఉంటుంది. ఆరేళ్లలోపు చిన్నారులకు నెలకు ఒకసారి, తొమ్మిదేళ్లు దాటితే 20 రోజులకు రెండుసార్లు యూనిట్ రక్తం చొప్పున ఎక్కించాలి. థలసీమియా బాధితులకు సెలైన్వాష్ చేసిన రక్తాన్నే ఎక్కించాలి మిగతా రక్తనిధి కేంద్రాల్లోని రక్తం వీరికి ఎక్కించేందుకు వీలుండదు. ఇలాంటి రక్తం థలసీమియా సొసైటీ కేంద్రంలోనే లభిస్తుంది. పైగా 5 రోజులకు మించి నిల్వ ఉన్న రక్తం వీరికి పనికిరాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులు చాలామంది ఇక్కడ రక్తం కొరత ఉండటంతో అక్కడే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. బాధితులకు రక్త దాతలు యువ విద్యార్థులే. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచే రక్తం సేకరిస్తారు. కానీ ప్రస్తుతం అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌లు ఉండటంతో విద్యార్థులు రక్తమివ్వడానికి రావడం లేదు. దీంతో ఒక్కసారిగా థలసీమియా బాధితుల ఇబ్బందులు మొదలయ్యాయి. దాతను నేనే తెచ్చుకోవాల్సి వస్తోంది నాది నల్లగొండ జిల్లా మిర్యాల గూడ. నా కొడుకు వయసు 13 నెలలు. 25 రోజులకోమారు రక్తం ఎక్కించాలి. కానీ దొరకడం లేదు. నేనే దాతను వెతుక్కుని హైదరాబాద్‌కొచ్చి బిడ్డకు రక్తం ఇప్పిస్తున్నా. ఇది తలకు మించిన భారమవుతోంది. - నాగేశ్వరరావు, మిర్యాలగూడ -
గిరిపుత్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం!
♦ పెద్దసంఖ్యలో బయటపడుతున్న థలసేమియా, సికిల్‌సెల్ కేసులు ♦ ఎస్టీ విద్యార్థులకు రక్తపరీక్షల నిర్వహణలో అధికారుల అలసత్వం సాక్షి, హైదరాబాద్ : ఏజెన్సీల్లో గిరిపుత్రులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన పిల్లల్లో ప్రాణాంతకమైన థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. పరిమితంగా నిర్వహించిన పరీక్షల్లోనే అనేక పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరుల (ఐటీడీఏల) పరిధిలో 27,856 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే మొత్తం 1,889 మంది ఈ వ్యాధుల బారిన పడినట్లు తేలింది. ఇందులో 992 మందికి థలసేమియా, 753 మందికి సికిల్‌సెల్ అనీమియా, 144 మందికి రెండూ ఉన్నట్లుగా బయటపడింది. అధికారుల నిర్లక్ష్యం... ఎస్టీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రక్తపరీక్షలను నిర్వహించి, మ్యాపింగ్ చేయాల్సిన జిల్లాల్లోని అధికారయంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. సికిల్‌సెల్ అనీమియా, థలసేమియాలకు సంబంధించి గత ఏడాది చివరలోగా రాష్ర్టంలోని అన్ని ఎస్టీ విద్యాసంస్థల్లో రక్తపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయగా, వాటిని కూడా సక్రమంగా ఖర్చు చేస్తున్న దాఖ లాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా కేవలం 28 వేల లోపే పరీక్షలు నిర్వహించారు. వాటిలో కూడా గణనీయంగా ఈ కేసులు వెలుగు చూశాయి. ఎస్టీ విద్యార్థులందరికీ హెల్త్మ్యాపింగ్ చేసి, మలేరియాతో పాటు థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ గతంలోనే సూచించినా రాష్ర్ట అధికారయంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇవీ సమస్యలు ... రక్తహీనత జబ్బు ‘థలసేమియా’లో రక్త కణాల పునరాభివృద్ధి జరగదు. ఎప్పటికప్పుడు ఎర్రరక్త కణాలు క్షీణిస్తుండడంతో వారికి క్రమం తప్పకుండా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కొత్త రక్తం ఎక్కించడం వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పుడూ మందులు వాడాల్సి ఉంటుంది. మూలకణ (బోన్‌మారో) చికిత్స ద్వారానే ఈ వ్యాధిని నివారించే అవకాశముంటుంది. సికిల్‌సెల్ అనీమియా కేసుల్లో గుండ్రటి ఆకారంలో ఉండాల్సిన ఎర్రరక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారడంతో రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రయాణించడం కష్టంగా మారుతుంది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. తద్వారా ఆయా శరీరభాగాలకు ఆక్సిజన్ అందదు. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణం ఆయుఃప్రమాణం 125 రోజులు కాగా, సికిల్‌సెల్ ఆయుప్రమాణం కేవలం 20 రోజులే. త్వరగా నశించిపోయే రక్తకణాలకు దీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. దీనితో రోగి రక్తహీనత బారిన పడి చనిపోతాడు. -
ఈ బుజ్జాయిలను ఆదుకోండి
-
11 ఏళ్ల అబ్బాయి 'పైలట్' కల తీరింది
చెన్నై: తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల ముఖిలేష్కు పైలట్ కావాలన్నది జీవితాశయం. అతని ఆశయానికి అనారోగ్యం అడ్డుగా వచ్చింది. ముఖిలేష్ తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఓ ఎన్జీవో ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. ఐఏఎఫ్ ముఖిలేష్ను 'ఒక్క రోజుకు గౌరవ పైలట్'గా నియమించి అతడి కోరిక తీర్చింది. కోయంబత్తూరులోని వైమానిక దళ బృందానికి ఈ బాధ్యతను అప్పగించింది. ముఖిలేష్కు స్క్వాడ్రన్ బ్యాడ్జి, క్యాప్‌ను బహూకరించారు. విమానంలో పైలట్ సీటులో కూర్చోబెట్టడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతేగాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ముఖేష్‌కు ఎయిర్ ఫోర్స్ అధికారులు సహకరించారు. ఈ విధంగా ముఖిలేష్కు పైలట్ కావాలన్న కల నెరవేరింది. ఐఏఎఫ్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడే ముఖిలేషే. అనంతరం అతణ్ని చికిత్స కోసం కోయంబత్తూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
విమాన పైలెట్‌గా బాలుడు
చెన్నై : కోయంబత్తూరు జేఎన్ఎం హాస్పిటల్లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు ముకిలేష్ కోరికను సులూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని స్క్వాడ్రన్ పైలెట్ లు తీర్చారు. అతి పిన్న వయస్సు గల ముకిలేష్ను గౌరవ పైలెట్‌గా ప్రశంసిస్తూ హెలికాప్టర్లో తిప్పి బాలుడి కలను నిజం చేశారు. శుక్రవారం బాలుడు తల్లిదండ్రులతో కలసి కోయంబత్తూరు కేన్సర్ ఫౌండేషన్ డెరైక్టర్ బాలాజితో పాటు పలువురు వలంటరీలతో కలసి స్క్వాడ్రన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఎస్కే గుప్తాను కలిసి ముకిలేష్ గురించి వివరించడంతో స్వాగతించారు. ఆ బాలుడిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా పైలెట్ లు విమానంలో ఎక్కించి చక్కెర్లు కొట్టించారు. దీంతో ఆ బాలుడిలో సంతోషం వెల్లివిరిసింది. త్వరలో తలసీమియా నుంచి కోలుకోవాలని పైలెట్ లు చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.