రక్తదాన శిబిరం (పాత చిత్రం)
సాక్షి, అమరావతి : తరచూ రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి జబ్బులతో బాధపడే రోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ వీరి పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు వలంటీర్లు ఠంఛన్‌గా గుమ్మం వద్దకే పింఛన్ చేరవేస్తున్నారు.
అంతే కాకుండా వీరికి ఉచితంగా రక్తమార్పిడి సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఆరోగ్యానికి మరింత అండగా నిలిచే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ తరహా జబ్బులతో బాధపడే వారికి వైద్య సేవల కోసం ప్రత్యేక వార్డులను ఆస్పత్రుల్లో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల వీరి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
విశాఖ కేజీహెచ్, కర్నూల్, కాకినాడ, గుంటూరు జీజీహెచ్‌లలో హిమోగ్లోబినోపతీస్, హీమోఫిలియా సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల వైద్య సేవల కోసం ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను వైద్య శాఖ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40 లక్షల చొప్పున రూ.1.60 కోట్లు వెచ్చిస్తోంది. ప్రతి కేంద్రంలో పది పడకలు, ఒక మెడికల్ ఆఫీసర్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు.
రక్త పరీక్షలు, రక్త మార్పిడికి సంబంధించిన అధునాతన పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్‌ల దశలో ఉంది. వీలైనంత త్వరగా పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శ్యాక్స్ పీడీ నవీన్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment