
గిరిపుత్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం!
♦ పెద్దసంఖ్యలో బయటపడుతున్న థలసేమియా, సికిల్‌సెల్ కేసులు
♦ ఎస్టీ విద్యార్థులకు రక్తపరీక్షల నిర్వహణలో అధికారుల అలసత్వం
సాక్షి, హైదరాబాద్ : ఏజెన్సీల్లో గిరిపుత్రులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన పిల్లల్లో ప్రాణాంతకమైన థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. పరిమితంగా నిర్వహించిన పరీక్షల్లోనే అనేక పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరుల (ఐటీడీఏల) పరిధిలో 27,856 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే మొత్తం 1,889 మంది ఈ వ్యాధుల బారిన పడినట్లు తేలింది. ఇందులో 992 మందికి థలసేమియా, 753 మందికి సికిల్‌సెల్ అనీమియా, 144 మందికి రెండూ ఉన్నట్లుగా బయటపడింది.
అధికారుల నిర్లక్ష్యం...
ఎస్టీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రక్తపరీక్షలను నిర్వహించి, మ్యాపింగ్ చేయాల్సిన జిల్లాల్లోని అధికారయంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. సికిల్‌సెల్ అనీమియా, థలసేమియాలకు సంబంధించి గత ఏడాది చివరలోగా రాష్ర్టంలోని అన్ని ఎస్టీ విద్యాసంస్థల్లో రక్తపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయగా, వాటిని కూడా సక్రమంగా ఖర్చు చేస్తున్న దాఖ లాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా కేవలం 28 వేల లోపే పరీక్షలు నిర్వహించారు. వాటిలో కూడా గణనీయంగా ఈ కేసులు వెలుగు చూశాయి. ఎస్టీ విద్యార్థులందరికీ హెల్త్‌మ్యాపింగ్ చేసి, మలేరియాతో పాటు థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ గతంలోనే సూచించినా రాష్ర్ట అధికారయంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.
ఇవీ సమస్యలు ...
రక్తహీనత జబ్బు ‘థలసేమియా’లో రక్త కణాల పునరాభివృద్ధి జరగదు. ఎప్పటికప్పుడు ఎర్రరక్త కణాలు క్షీణిస్తుండడంతో వారికి క్రమం తప్పకుండా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కొత్త రక్తం ఎక్కించడం వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పుడూ మందులు వాడాల్సి ఉంటుంది. మూలకణ (బోన్‌మారో) చికిత్స ద్వారానే ఈ వ్యాధిని నివారించే అవకాశముంటుంది. సికిల్‌సెల్ అనీమియా కేసుల్లో గుండ్రటి ఆకారంలో ఉండాల్సిన ఎర్రరక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారడంతో రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రయాణించడం కష్టంగా మారుతుంది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. తద్వారా ఆయా శరీరభాగాలకు ఆక్సిజన్ అందదు. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణం ఆయుఃప్రమాణం 125 రోజులు కాగా, సికిల్‌సెల్ ఆయుప్రమాణం కేవలం 20 రోజులే. త్వరగా నశించిపోయే రక్తకణాలకు దీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. దీనితో రోగి రక్తహీనత బారిన పడి చనిపోతాడు.