Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే! | Child actors met thalassemia patients under the guidance of Sakshi | Sakshi
Sakshi News home page

Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!

Published Mon, Nov 11 2024 3:59 AM | Last Updated on Mon, Nov 11 2024 6:53 AM

Child actors met thalassemia patients under the guidance of Sakshi

మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.

చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్‌ ఆర్టిస్ట్‌లు.

నవంబర్‌ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి.  సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్‌ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...

వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్‌ బ్లడ్‌ డిజార్డర్‌) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని  ‘తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ’  బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన  చైల్డ్‌ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు.  

తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...
తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్‌ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్‌.  
ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.

డాక్టర్‌ కావాలని ఉంది...
‘‘నేను ఏడో క్లాస్‌ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్‌ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని  ఉంది. గేమ్స్‌ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.

మా గురించి ఆలోచించండి...
‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నాను. మా  భోజనం అందరిలానే  ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.

భయపడితే బతకలేము...
నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్‌ లెవల్స్‌ పెరగకుండా ట్యాబ్‌లెట్‌లు ఇస్తారు.  దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్‌ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్‌ అండగా ఉంటోంది.  
– మెహవీన్‌ ఫాతిమా

నేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు.                   – నిహారిక

ప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్‌ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్‌లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. 
– సంకీర్తన, కరీంనగర్‌

రక్తదాతలు ముందుకు రావాలి...
తలసేమియాతో  నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు.  దేశంలోని ఎన్నో హాస్పిటల్‌లు, మెడికల్‌ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి  బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్‌ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. 

విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది.  ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా  రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 
– రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ

ఏడుపొచ్చింది...
ఇక్కడి రాగానే  ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్‌ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్‌’ అనే డైలాగ్‌ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ  రైమ్స్‌ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. 
– తనస్వీ,  చైల్డ్‌ ఆర్టిస్ట్‌

పెద్దయ్యాక సహాయం చేస్తాను...
తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్‌ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్‌ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్‌ నాకు ఫ్రెండ్‌ అయ్యాడు. తను డాక్టర్‌ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను.     – మోక్షఙ్ఞ, చైల్డ్‌ ఆర్టిస్ట్‌

ప్రభుత్వం ఆదుకోవాలి...
ఇది జెనెటిక్‌ డిసీజ్‌ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. 
– సుమాంజలి, సెక్రటరీ– సీఈఓ

ఈ టెస్ట్‌ తప్పనిసరి చేయాలి...
మేము ఆశ వర్కర్‌లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్‌ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. 
– చంద్రకాంత్‌ అగర్వాల్, ప్రెసిడెంట్‌

సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...
ఈ పిల్లలను చూడగానే  కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్‌ చెప్పాను. నా షూటింగ్స్‌ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్‌ చేసే ప్రయత్నం చేస్తాను.
– అనన్య, చైల్డ్‌ ఆర్టిస్ట్‌

 

తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.

గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్‌ స్టార్స్‌’ పేజీ ఇస్తున్నాం.

– డి.జి. భవాని
– హనుమాద్రి శ్రీకాంత్‌
ఫొటోలు: అనీల్‌ మోర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement