Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు | Sakshi Special: Little Stars Meet with suicide farmer childrens with Sakshi | Sakshi
Sakshi News home page

Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు

Published Sat, Nov 9 2024 12:57 AM | Last Updated on Sat, Nov 9 2024 10:06 AM

Sakshi Special: Little Stars Meet with suicide farmer childrens with Sakshi

మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు  మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్‌ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?

ప్రతిరోజూ పొలానికి వెళ్లి  తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు  దక్కకుండా చేశావ్‌’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే  మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’  సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.

‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’
‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’
‘నైట్‌టైమ్‌ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్‌ కనపడతాయా?
‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’
‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...

సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్‌ స్టార్స్‌ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్‌స్టార్స్‌ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, మెదక్‌ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్‌ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్‌’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్‌ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు.

 లిటిల్‌ స్టార్స్‌ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు.  ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని  ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?

జీవితం అంటే ఏమిటో తెలిసింది
రైతు బిడ్డలను చూసిన స్టార్‌ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్‌ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్‌ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్‌. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్‌ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.

వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి
‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.  అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.

‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు.   దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.

చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు
‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో  7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.  ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి  రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్‌వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.
– కొండల్‌ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌

లాయర్‌ అవుతాను
8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్‌లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్‌ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది.                         
– మింటూ

అమ్మను బాగా చూసుకుంటా
నాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్‌ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు.            
– తేజస్విని

మేమే తయారవుతాం
ఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. 
– చింటూ
 

అమ్మ కోసం నవ్వుతా
హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్‌ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్‌లో ఫ్రెండ్స్‌ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా.                
– అక్షిత

– హనుమాద్రి శ్రీకాంత్‌
– డి.జి. భవాని
ఫొటోలు: పి. మోహనాచారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement