formers sucides
-
Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు
మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?ప్రతిరోజూ పొలానికి వెళ్లి తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు దక్కకుండా చేశావ్’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’‘నైట్‌టైమ్ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్ కనపడతాయా?‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్ స్టార్స్ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్స్టార్స్ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు. లిటిల్ స్టార్స్ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?జీవితం అంటే ఏమిటో తెలిసిందిరైతు బిడ్డలను చూసిన స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు. దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.– కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్లాయర్ అవుతాను8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మింటూఅమ్మను బాగా చూసుకుంటానాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు. – తేజస్వినిమేమే తయారవుతాంఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. – చింటూ అమ్మ కోసం నవ్వుతాహాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా. – అక్షిత– హనుమాద్రి శ్రీకాంత్– డి.జి. భవానిఫొటోలు: పి. మోహనాచారి -
పదింతలై పోరాడుతాం
సాక్షి, ముంబై: బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పది రెట్లు బలంగా పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. పరువు నష్టం కేసులో గురువారం ముంబైలోని మజ్గావ్–శివ్డీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు, ఉపాధి, యువత సమస్యలు తదితరాలపై మా పోరాటం కొనసాగుతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సైద్ధాంతికపరమైన పోరు కొనసాగిస్తా. ఐదేళ్లుగా సాగిస్తున్న దాని కంటే పది రెట్లు గట్టిగా పోరాడుతా’ అని ప్రకటించారు. నిర్దోషులమన్న రాహుల్, ఏచూరి పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మజ్గావ్–శివ్డీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. మేజిస్ట్రేట్ పీఐ మొకాషి కోర్టులో ఇద్దరు నేతల పేర్లను పిలవగానే వారు సాక్షుల బోనులోకి వెళ్లి నిలబడ్డారు. వారిపై వచ్చిన ఫిర్యాదును ఆయన చదివి వినిపించి.. నేరాన్ని అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించగా నిర్దోషులమని వారు బదులిచ్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వారిద్దరితోపాటు ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. రాహుల్, సీతారాం ఏచూరికి కోర్టు రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు హాజరు కానవసరం లేకుండా వారికి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 21వ తేదీన జరగనుంది. అవసరమైన పత్రాలపై సంతకాలు చేసిన ఇద్దరు నేతలు అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందంటూ రాహుల్, ఏచూరి ఆరోపించడంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధ్రుతిమన్ జోషి 2017లో కేసు వేశారు. కాంగ్రెస్, సీపీఎంలపైనా కేసులు నమోదు చేయాలని ధ్రుతిమన్ కోరారు. కానీ, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు పార్టీలను బాధ్యులుగా చేయడం తగదంటూ కోర్టు తిరస్కరించింది. ఆ మేరకు ఫిబ్రవరిలో ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. అంతకుముందు రాహుల్ కోర్టు గేట్ వద్దకు రాగానే అక్కడ వేచి ఉన్న దాదాపు 250 మంది పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ చీఫ్ పదవికి చేసిన రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాహుల్ మాత్రం వారికి అభివాదం చేస్తూ కోర్టు ఆవరణలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పించారు. అంతకుముందు ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇవే నినాదాలు చేశాయి. కాగా, ఇది మహారాష్ట్రలో రాహుల్‌పై దాఖలైన రెండో పరువు నష్టం కేసు. మహాత్మాగాంధీ హత్య కేసుతో ఆర్ఎస్ఎస్కు సంబంధముందని ఆరోపించారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు భివండీలో వేసిన కేసు ఇప్పటికే నడుస్తోంది. ఆ ధైర్యం కొందరికే ఉంటుంది: ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆమె.. అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ వీడియో ఆర్ఎస్ఎస్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నిమిషం నిడివి ఉన్న ఒక వీడియోను ట్విట్టర్లో గురువారం విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ ఫర్ డమ్మీస్ పేరుతో ఉన్న ఆ వీడియోలో... ‘ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలుసని అనుకోండి, మరోసారి ఆలోచించండి. బ్రిటిష్ పాలకులకు విధేయత ప్రకటించడం, మహాత్మాగాంధీని చంపడం వంటి హింసాత్మక చర్యల ద్వారా ఆర్ఎస్ఎస్ ఆది నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది’అని ‘ఆర్ఎస్ఎస్ వెర్సెస్ ఇండియా’అనే హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ పేర్కొంది. కోర్టు కేసులతో రాహుల్ బిజీ! ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో సతమతమైన రాహుల్ గాంధీ ఇక నుంచి కోర్టు కేసులతో బిజీ కానున్నారు. ఆరెస్సెస్ కార్యకర్త దాఖలు చేసిన ఒక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ గురువారం ఇక్కడి మజ్గావ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో నేరాన్ని అంగీకరించకపోవడంతో కేసు విచారణ కొనసాగనుంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసిన మేజిస్ట్రేట్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని రాహుల్‌కు మినహాయింపు ఇచ్చారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు ఆరెస్సెస్‌కు సంబంధం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యపై ఆరెస్సెస్ ఈ కేసు దాఖలు చేసింది. కాగా, థానే జిల్లా భివండీలో రాహుల్ మరో పరువునష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కూడా ఆరెస్సెస్ వేసిందే.ఈ కేసు విచారణ ఇంకా ప్రారంభం కావలసి ఉంది. గాంధీ హత్యకు సంఘ్‌పరివార్ బాధ్యులని రాహుల్ ఆరోపించడంతో ఆయనపై ఈ కేసు దాఖలయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘ఈ దొంగలందరికీ మోదీ అన్న పేరెందుకుందో’అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత సుశీల్ కుమార్ కేసు పెట్టారు. ఈ పరువునష్టం కేసులో రాహుల్ ఈ నెల 6వ తేదీన బిహార్‌లోని పాట్నా కోర్టులో హాజరు కావలసి ఉంది. అహ్మదాబాద్, సూరత్ కోర్టుల్లో కూడా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. -
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మోసపూరిత హామీలతో ప్రజలను దగాచేసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను కేసీఆర్ ఏనాడు పరామర్శించలేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, యాదాద్రి జిల్లా వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని, పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడుకుంటామన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడుకి చెందిన 400 మంది టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వారందరికీ ఉత్తమ్ కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు హుజూర్నగర్ నుంచి పోటీచేస్తున్న ఉత్తమ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘సోనియా దృఢసంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం’ మేడ్చల్: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దృఢసంకల్పంతోనే తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని సోనియా తెలంగాణను ఇస్తే మాయమాటలతో పీఠమెక్కిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క హమీని నెరవేర్చలేదని విమర్శించారు. సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఓకే సభలో పాల్గొనడం అరుదైన ఘటన అని అన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లను ఉత్తమ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సోనియా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, కృతజ్ఞతా భావంతో ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాయపోలు (దుబ్బాక): అప్పులబాధతో ఇద్దరు రైతులు బుధవారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం మంతూరులో మన్నె కిష్టయ్య, సుగుణ దంప తులకు నలుగురు కుమారులు. వీరి కుటుంబం తమకున్న ఎకరం 10 గుంటల సాగు భూమితో పాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకున్నా రు. ఇటీవల పంట పెట్టుబడులు, ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశా రు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణంకోసం భూసేకరణలో వీరి భూమి పూర్తిగా పోయింది. దీంతో పెద్ద కొడుకు నాగరాజు (28) అప్పుల విషయమై కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపం తో పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపా లెంలో పాగాల మల్లారెడ్డి (58) ఇరవై ఎక రా లు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా డు. రెండేళ్లుగా వచ్చిన కరువుతో పంటలు సరి గా పండలేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా లాభం లేకపోయింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరాయి. పం టలు పండకపోయినా రైతుకు ఏడాదికి రూ.1.50 లక్షల కౌలు చెల్లించాల్సి వస్తుండటం, అప్పులు తీర్చే మార్గం కానరాక పురుగు ల మందు తాగి బలవన్మరణం చెందాడు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
ముత్తారం/ఎలిగేడు: అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పపల్లి రామకృష్ణాపూర్‌కు చెందిన మర్రిపల్లి మల్లేశ్(45) తనకున్న అర ఎకరం భూమితోపాటు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఆశించిన స్థాయిలో దిగు బడి రాలేదు. పెట్టుబడుల కోసం తీసుకున్న రూ.3 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక ఇద్దరు కూతుళ్ల వివాహం చేసే స్థితిలో లేకపోవడంతో మనస్తాపం చెందిన మల్లేశ్ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన దేవరనేని సంపత్‌రావు(35) తనకున్న రెండెకరాలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. అయితే, పంట చేతికొచ్చే దశలో ఎండిపోయింది. రూ.4 లక్షలు అప్పు చేయగా.. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
పంటచేలకు సర్కారు మంట
- రైతు రుణం తిరోగమనం... రెండేళ్ల్లుగా లక్ష్యానికి ఆమడదూరం - ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి నెట్టేసిన టీడీపీ సర్కారు - ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యం రూ. 37,625 కోట్ల రుణాలు - ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ. 20,168 కోట్లే... - వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు.. కొత్త రుణాల ఊసే లేదు - వడ్డీలేని రుణాలకు బదులు 18 శాతం వడ్డీ మోత - పెట్టుబడి రాయితీ ఎగవేత.. పంటలు దెబ్బతింటే బీమా లేదు.. - మద్దతు ధరలపై చర్యలు శూన్యం - ఆత్మస్థైర్యం కోల్పోయి అన్నదాతలు ఆత్మహత్యల బాట - రైతు కుటుంబాలకు పరిహారమూ తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులను తీవ్ర సంక్షోభం వైపు నెట్టివేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పినా ఆచరణలో చంద్రబాబు రుణమాఫీ పేరిట ఇచ్చిన నిధులు.. రైతుల రుణాలకు అయిన వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోలేదు. దీంతో రుణమాఫీ కాక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక, ప్రైవేటుగా అప్పు పుట్టక.. రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. వారికి ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అన్నదాతలను గాలికి వదిలేసింది. రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. రుణమాఫీ చేయదు.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించదు.. పెట్టుబడి రాయితీకి ఎగనామం పెడుతోంది.. పంటల బీమా అందడం లేదు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వదు...దీంతో అప్పుల పాలై అన్ని విధాలా కుదేలైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. కనీసం వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకూ మనసు రావడం లేదు. రుణాల మంజూరులో మొండిచేయి ప్రస్తుత ఖరీఫ్‌లో వ్యవసాయ రంగానికి రూ.37,625 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా... కేవలం రూ.20,168 కోట్లు మాత్రమే రైతులకు అందాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాం నుంచి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకూ బ్యాంకులు లక్ష్యానికి మించి రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తూ వచ్చాయి. ఏటా నిర్దేశించుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా రుణాలు ఇచ్చాయితే తప్ప... ఒక్క ఏడాది కూడా మంజూరులో వెనుకడుగు వేయలేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలోనూ నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ పథకం అమలులో విఫలమై రైతులను బ్యాంకుల ముందు డిఫాల్టర్‌గా నిలబెడుతోంది. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండగా, మరోవైపు వ్యవసాయ రుణాలు పెనుభారమవుతున్నాయి. బాబు హయాంలో తిరోగమనం రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష్యం మేరకు కూడా రైతులకు రుణాలు అందడం లేదు. వైఎస్ హయాం నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం వరకూ రుణ లక్ష్యాల గమనాన్ని పరిశీలిస్తే.. గత ప్రభుత్వాల హయాంలో లక్ష్యానికి మించి రుణాలు అందగా, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ లక్ష్యం మేరకు కూడా రైతులు రుణాలు పొందలేకపోయారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పేర్కొన్న లెక్కల ప్రకారం... ఖరీఫ్‌లో మొత్తం వ్యవసాయ రంగానికి రూ.37,625 కోట్లు రుణ లక్ష్యం కాగా జూన్ నెలాఖరు నాటికి రూ.20,168 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత రబీలో మొత్తం వ్యవసాయ రంగానికి రూ.27,647 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించి, ఆ తర్వాత సవరించి ఆ లక్ష్యాన్ని కుదించారు. చంద్రబాబు హయాంలో గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో వ్యవసాయ రంగానికి రూ.56,019 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం కాగా కేవలం రూ.39,938 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అంటే ఇస్తామన్న దానికంటే రూ.16,081 కోట్లు తక్కువ. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు వ్యవసాయ రుణాలు లక్ష్యానికి మించి రైతులకు అందడం గమనార్హం. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 35,654 కోట్లు కాగా లక్ష్యానికి మించి రూ.50,060 కోట్లు మంజూరు చేశారు. అలాగే 2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.47,017 కోట్లు కాగా అంతకంటే ఎక్కువగా రూ.49,774 కోట్లు రుణంగా మంజూరు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో... ----------------------------------------- ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యం మంజూరు (రూ.కోట్లలో) ------------------------------------------ 2004-05 23,480 24,346 2005-06 28,600 28,899 2006-07 37,000 37,056 2007-08 42,000 42,773 మాఫీ మోసంతోనే బ్యాంకు అప్పు పుట్టని వైనం లక్ష్యానికి దగ్గరగా కూడా రైతులకు వ్యవసాయ రుణాలు అందకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం నుంచి వెనక్కిపోవడమే కారణం. రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారి కబంధ హస్తాల్లో నలిగిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బ్యాంకు రుణం మాఫీ కాకపోవడమే కాకుండా వడ్డీ భారం మోయలేక పరువు, ప్రతిష్టలు దెబ్బతినడంతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. ఈ మొత్తం అప్పుపై 18 నెలల కాలానికి వడ్డీ చెల్లించడానికే రూ.18 వేల కోట్లు అవసరం. అయితే, చంద్రబాబు ఇప్పటి వరకు రుణమాఫీలో భాగంగా రెండు విడతలగా వడ్డీలో నాల్గోవంతుకు కూడా సరిపోకుండా రూ.7,446 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల ముందు బంగారం కుదువపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నాయి. పెట్టుబడి రాయితీ ఎగనామం.. కరువు మండలాల కుదింపు చంద్రబాబు సర్కారు విపత్తు బాధిత రైతులకు 2013 సంవత్సరం ముందు నాటి రూ.1,690 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగనామం పెట్టింది. 2013కు ముందు నాటి పెట్టుబడి రాయితీ ఇచ్చేది లేదని, అవి తమ ప్రభుత్వ హయాంలోవి కావని బాబు సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. 2014 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 566 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. పెట్టుబడి రాయితీ భారాన్ని తగ్గించుకోవాలనే కుటిల యోచనతోనే ప్రభుత్వం కరువు మండలాలను సగానికిపైగా తగ్గించింది. గతేడాది ప్రభుత్వం కుదించి ప్రకటించిన 238 కరువు మండలాల్లో 50 శాతం మించి పంట నష్టపోయిన రైతులకు రూ.1,078.45 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ తదుపరి దాన్ని రూ.692.67 కోట్లకు కుదించింది. ఇలా గతేడాది కరువు రైతులకు ప్రభుత్వం రూ.385.78 కోట్ల పెట్టుబడి ఎగనామం పెట్టింది. చంద్రబాబు సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన 16 నెలల కాలంలోనే విపత్తు బాధిత రైతులకు మొత్తం రూ. 2075.78 కోట్ల పెట్టుబడి రాయితీ (1690 కోట్లు+ 385.78 కోట్లు ) ఎగొట్టేసింది. మద్దతు ధర అమలుకు చర్యలేవీ? రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించినా రాష్ట్రంలో వాటి అమలుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,400 కాగా వాస్తవంగా రైతులకు రూ.1,100 కూడా అందడంలేదు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,500 కాగా రైతుల నుంచి రూ.3,500కు కూడా కొనుగోలు చేయడంలేదు. పట్టుగూళ్లకు కిలోకు రూ.300 నుంచి రూ. 350 ధరకు గాను ఇప్పుడు రూ.150 కూడా కొనడం లేదు. పసుపు కిలోకు రూ.150 నుంచి రూ. 250 వరకూ ధర రావాల్సి ఉండగా కనీసం రూ.70 కూడా రావడంలేదు. చెరుకుకు టన్ను ధర రూ.2,300కు రూ.1,540 మాత్రమే వస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు, సేద్యపు ఖర్చులు విపరీతంగా పెరగడం, వ్యవసాయోత్పత్తుల గిట్టుబాటు ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంవల్ల రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. పంటల బీమాకు దూరం బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో రైతన్నలు పంటల బీమాకు నోచుకోని పరిస్థితి నెలకొంది. బ్యాంకు నుంచి పంట రుణం పొందిన సమయంలోనే పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించనున్నారు. రైతులకు గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో పంటల బీమాకు కూడా రైతుల దూరం అవుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పంటల బీమా కింద రైతులు రూ.980 కోట్లు చెల్లించారు. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన బీమా మాత్రం విడుదల కాలేదు. పరిహారం కూడా విదల్చడం లేదు.. రాష్ట్రంలో రైతాంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకొనిపోయి చేయూత ఇచ్చే వారు లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి రూ.1.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇది చంద్రబాబు సర్కారుకు రైతులపై చిత్తశుద్ధికి తార్కాణం. -
ఆత్మహత్యలు వద్దు
- మీ కోసమే బంగారు తెలంగాణ.. రైతులకు సీఎం కేసీఆర్ పిలుపు - కొత్తగా ఈరోజు వచ్చిన సమస్య కాదు.. రాత్రికి రాత్రి పోదు - నీళ్లు, నిధులు, నియామకాల్లో 58 ఏళ్ల దగా వల్లే ఈ దుస్థితి - ఆత్మహత్యల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు - సాగునీరే అంతిమ పరిష్కారం.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం - మిగతా ‘రుణమాఫీ’ని ఒకే దఫా చెల్లిస్తాం - రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన రాజధానిగా తీర్చిదిద్దుతాం - విత్తన కంపెనీలకు మండలాలను దత్తత ఇస్తాం - రాష్ట్రంలో దాదాపు 200 మండలాల్లో - కరువు పరిస్థితులు.. త్వరలో కేంద్రానికి నివేదిక - సలహాల విషయంలో విపక్షాలు నిరాశ కలిగించాయి - విపక్షాల ప్రశ్నలపై అసెంబ్లీలో సీఎం సుదీర్ఘ సమాధానం సాక్షి, హైదరాబాద్: ‘‘మీ కోసమే బంగారు తెలంగాణ నిర్మిస్తున్నాం. ప్రభుత్వం చేసేదంతా మీకోసమే. మీ చావును చూడడానికి కాదు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణతో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో 58 ఏళ్లుగా భయంకరమైన దోపిడీ జరగడం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. దీనిని చక్కదిద్దడం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఒకేసారి పూర్తి పంట రుణాల మాఫీతోపాటు కృష్ణా, గోదావరిల నుంచి 1,280 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఏటా రూ.25 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయంపై విస్తృత పరిశోధనలు వంటివి చేపట్టామన్నారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. బుధవారం రైతుల ఆత్మహత్యల అంశంపై శాసనసభలో చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. నీళ్ల విషయంలో వికృత క్రీడ సాగిందని, దశాబ్దాలైనా ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తిచేయలేదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో 58 ఏళ్లుగా అతి భయంకర దోపిడీ జరగడం వల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నామన్నారు. ‘‘రైతుల ఆత్మహత్యలు కొత్తగా ఈ రోజే వచ్చిన సమస్య కాదు. రాత్రికిరాత్రి పోదు. 58 ఏళ్ల ప్రాంతీయ వివక్ష వల్లే వైపరీత్యాలు వచ్చాయి. ఓయూ నుంచి వ్యవసాయ వర్సిటీని వేరుచేసి భ్రష్టు పట్టించారు. వ్యవసాయ పరిశోధనలు బంద్ అయ్యాయి. వ్యవసాయ శాఖలో 13 వేల పోస్టులుంటే 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పునాదుల మీదే ఈ దారుణ మారణకాండ వచ్చిపడింది. ఇదంతా ఒక వ్యక్తో, ప్రభుత్వమో చేసింది కాదు.. 58 ఏళ్లుగా నిరంతరం జరిగింది. కాకతీయ రాజులు 75 వేల చెరువులు, నిజాం పాలకులు కోయల్‌సాగర్, ఎగువ మానేరు, డిండి, ఆర్డీఎస్, నిజాంసాగర్, ఘణపూర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రస్తుతం వాటి గతి ఏమైంది? 15 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కొరత నుంచి మిగులు.. విద్యుత్ కొరతతోనే రాష్ట్రం ఆవిర్భవించిందని... 30 ఏళ్లుగా కరెంటు కోతలు, బిల్లుల మోతలు, బషీర్‌బాగ్ కాల్పుల రోతలను విన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వాటాలను ఏపీ ఇవ్వకపోయినా, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు. షోలాపూర్-రాయచూర్ కారిడార్ నిర్మాణం పూర్తయినప్పుడు అందులో నుంచి 1,000 మెగావాట్ల లైన్లను బుక్ చేసుకోవాలని నాటి సీఎం కిరణ్ వద్దకు 9సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పంపినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పీజీసీఎల్ నుంచి 2,000 మెగావాట్ల స్లాట్లను కొనుగోలు చేశామని చెప్పారు. గోదావరి, కృష్ణా ఎత్తిపోతల పథకాల కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని, 2018 ముగిసేలోగా వ్యవసాయానికి 24 గంటల త్రిఫేజ్ విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. దేశ విత్తన రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్నా... రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. హైదరాబాద్‌లో 364 విత్తన కంపెనీలున్నాయని, ఒక్కో కంపెనీకి ఒక్కో మండలాన్ని దత్తత ఇవ్వనున్నామని తెలిపారు. యావత్ తెలంగాణ రైతాంగం విత్తనాలు సాగుచేసే దిశగా ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే జూన్ నుంచి సగం మండలాల్లో విత్తనోత్పత్తి ప్రారంభిస్తామని, 100 దేశాలకు విత్తనాలను సరఫరా చేసే సామర్థ్యం సాధిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ కింద రూ.46,500 కోట్లతో చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, 6 వేల చెరువుల పనులు జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ పనులకు టెండర్లు జరగకముందే కమీషన్ల కాకతీయ అంటూ విపక్షాలు ఆరోపించాయని... ఇంత అసహనం, విచిత్ర పోకడలు సరికాదని హితవు పలికారు. ‘‘ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు ఆశించి.. నిరాశ చెందాను. రైతుల ఆత్మహత్యలకు పరిహారం పరిష్కారం కాదని, సమస్య మూలాల్లోకి వెళ్లాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలపాలని హైకోర్టు చేసిన సూచనను స్వాగతిస్తున్నా..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల కోసం ఎన్నో చర్యలు 1.08 లక్షల వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి రూ.70 కోట్ల రవాణా పన్నును రద్దు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ, ఉద్యన రైతులకు గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన రూ.540 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన 239 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చామని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కోసం గత పాలకుల హయాంలో లాఠీచార్జీలు జరిగేవని, ఇప్పుడు ముందుగానే నిల్వలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యం రాయితీల పరిమితిని హెక్టారు నుంచి 5 హెక్టార్లకు పెంచామన్నారు. ఒకేసారి రుణమాఫీకి యత్నిస్తాం.. విపక్షాల సూచనల మేరకు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, నిధుల సమీకరణ మార్గాలను అన్వేషిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వాణిజ్య శాఖకు రావాల్సిన రూ.4,500 కోట్ల పన్ను బకాయిలతో పాటు ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెరగడంతో వచ్చే రూ.3 వేల కోట్లు, భూముల క్రమబద్ధీకరణ ద్వారా రూ.1,000 కోట్లు, ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా రెండు మూడు వేల కోట్లను సమీకరించనున్నామని చెప్పారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 176 గోదాములను మాత్రమే నిర్మిస్తే... తాము అధికారంలోకి రాగానే రూ.1,000 కోట్ల నాబార్డు రుణంతో 330 కొత్త గోదాముల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కొన్ని మార్కెట్ యార్డుల్లో రైతులకు ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించామని, త్వరలో అన్ని మార్కెట్లకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి ఉండేలా పోస్టులను మంజూరు చేశామన్నారు. నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వ్యవసాయ వర్సిటీకి అన్ని గ్రాంట్లను ఇచ్చి పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు రుణం కోసం ప్రతిసారి పాస్‌బుక్, పహాణీల కోసం ఎమ్మార్వోల వద్ద వెళ్లకుండా త్వరలో ఈ-పాస్‌బుక్, ఈ-పహాణీలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలో ‘కరువు’ జాబితా.. రాష్ట్రంలో 175 నుంచి 200 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని... త్వరలోనే కేంద్రానికి మండలాల జాబితాలను పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 31 తర్వాతే ప్రతిపాదనలు పంపాలని కేంద్ర నిబంధనలు ఉండడం వల్లే ఇప్పటివరకు పంపలేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు పోగా రాష్ట్ర వాటా కింద దాదాపు రూ.1,000 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరువు నేపథ్యంలో ఉపాధి హామీ కింద 50 రోజుల అదనపు పనిదినాల మంజూరుకు కేంద్రం హామీ ఇచ్చిందని, త్వరలో మండలాల వారీగా దీనికీ ప్రతిపాదనలు పంపనున్నామని చెప్పారు. వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు త్వరలో మనీ లెండరింగ్ యాక్ట్ తీసుకొస్తామని వెల్లడించారు. వేర్వేరు చోట్ల ఉన్న కమతాల ఏకీకరణ కోసం ‘రద్దోబదలు’ భూముల రిజిస్ట్రేషన్లపై ఫీజులను మాఫీ చేస్తామని తెలిపారు. సాదా కాగితాలపై జరిగిన నిజమైన భూలావాదేవీలపై సైతం రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాస్తామన్నారు. -
మూడు గంటలకో రైతు బలి
- రుణమాఫీని నాలుగేళ్లు సాగదీయడం వల్లే బలవన్మరణాలు - శాసనమండలిలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు - రైతు ఆత్మహత్యలపై సర్కారు లెక్కలన్నీ తప్పుల తడకలే - 60 ఏళ్ల పాపాల్ని గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామన్న అధికార పక్షం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సగటున మూడు గంటలకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని.. అయినా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని శాసనమండలిలో విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొన్నా... కరువు మండలాల జాబితాను ఇంకా కేంద్రానికి ఎందుకు పంపలేదని నిలదీశాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై మంగళవారం శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. మరణించిన రైతుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలంటూ సభ ప్రారంభంలోనే కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. చర్చ జరిగాకే సంతాపాలకు అనుమతించాలని అధికారపక్షం కోరింది. అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై వ్యవ సాయ మంత్రి ప్రకటనను ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో చదివారు. అనంతరం విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 15 నెలల్లో రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమవద్ద లెక్కలున్నాయన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి మూడు గంటలకు ఒకరైతు చొప్పున పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొం దని... ఇప్పుడు మాఫీ పేరుతో నాలుగేళ్ల పాటు రైతుల చేతులకు బేడీలు వేసిందని మండిపడ్డారు. రుణాలు మాఫీకాక తాకట్టులో ఉన్న పాస్ పుస్తకాలు, బంగారాన్ని బ్యాంకులు తిరిగివ్వడం లేదని.. ఈ కారణంగా మరొక చోట అప్పు తీసుకునే అవకాశం కూడా లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. రైతుల రుణాలన్నిం టికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తాకట్టులో ఉన్న డాక్యుమెంట్లు, బంగారం వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు తక్షణం కమిటీని వేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు రప్పించే విషయంలో అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4 బడా విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు. విపక్షాలది రాజకీయం 60 ఏళ్లుగా జరిగిన పాపాలను గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ఆత్మహత్యలు నివారించేం దుకు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌కు సిద్ధపడితే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించడంపై స్వామినాథన్, జయతీ ఘోష్ కమిటీలు ఇచ్చి న నివేదికలను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని పల్లారాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
బాలీవుడ్ శ్రీమంతుడు నానా పటేకర్
సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్‌తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించి నిర్మించిన శ్రీమంతుడు సినిమా ఎంతో మంది నిజం శ్రీమంతులను కదిలించడం.. తద్వారా ఎన్నో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవడం తెలిసిందే. అయితే తెలుగు శ్రీమంతుడు రాకముందు నుంచే బాలీవుడ్‌లోనూ ఓ శ్రీమంతుడు ఉన్నాడు. ప్రిన్స్‌లా వేల కోట్లు లేకున్నా.. కనీస అవసరాలు పోను మిగిలిన సంపాదనంతా సొంత రాష్ట్రాం బాగు కోసం ఖర్చుచేస్తున్నాడు. దేశానికి తనదైన పద్దతిలో చికిత్స చేస్తున్నాడు.. బాలీవుడ్ నటుడు నానా పటేకర్. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు గడిచిన దశాబ్ధికిపైగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న నానా.. తన సంపాదనలో మూడింట రెండో వంతు చనిపోయిన రైతుల కుటుంబాలకు అందిస్తున్నాడు. ఇప్పటివరకు అలా దాదాపు 700 మంది మహిళలకు ఆర్థిక సాయం అందించాడు. నానా కమిట్మెట్కు ముగ్ధులైన ఆయన స్నేహితులు కొందరు మేము సైతం అంటూ విరాళాలు ఇచ్చేందుకూ ముందుకొస్తున్నారట. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురే పిలుపుతో కదిలిన తాను రైతాంగ పరిరక్షణే ధ్యేయంగా జీవిస్తానంటున్నాడాయన. 'రైతే దేశానికి వెన్నెముక అనే నానుడి నిజమనుకుంటే, ఇప్పుడు దేశం వెన్నెముక వంగిపోయింది. ఇంకా చెప్పాలంటే కృషించింది. కొ్ని ప్రాంతాల్లోనైతే పూర్తిగా చచ్చిపోయింది. అలా రైతాంగం పూర్తిగా చచ్చుబడిపోయిన ప్రాంతాల్లో ఒకటి మా మహారాష్ట్రలోని లాతూర్. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్హహత్యలకు పాల్పడుతున్న ప్రాంతమిది. కష్టాల నుంచి విముక్తి పొందొచ్చనుకునే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతడి చావుతో కష్టం పోదు కదా రెట్టింపవుతుంది. చిన్నచిన్న పిల్లలతో వితంతువులైన రైతుల భార్యలను చూస్తే మనసు తరక్కుపోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా విప్లవం వస్తుంది. తనను తాను చంపుకొనే రైతు ఇతరులను చంపలేడని మనం అనుకోవద్దు' అంటాడు నానా పటేకర్. -
ఉత్తమ్‌కు పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌తో కలసి అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనకు రైతు ఆత్మాభిమానయాత్రగా పేరు పెట్టాలని సూచిం చారు. ఒక రైతు కుటుంబానికి రూ.లక్ష ఇచ్చేందుకు ముందుకు వచ్చేటట్లు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన ప్రతినిధులను ఒప్పించాలని కోరారు. తన వంతుగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. రైతులకు భరోసా, ఆత్మహత్యల నివారణపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని పొంగులేటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.