శనివారం లాతూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు నగదు సాయం చేస్తున్న నానా పటేకర్.
సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించి నిర్మించిన శ్రీమంతుడు సినిమా ఎంతో మంది నిజం శ్రీమంతులను కదిలించడం.. తద్వారా ఎన్నో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవడం తెలిసిందే. అయితే తెలుగు శ్రీమంతుడు రాకముందు నుంచే బాలీవుడ్లోనూ ఓ శ్రీమంతుడు ఉన్నాడు. ప్రిన్స్లా వేల కోట్లు లేకున్నా.. కనీస అవసరాలు పోను మిగిలిన సంపాదనంతా సొంత రాష్ట్రాం బాగు కోసం ఖర్చుచేస్తున్నాడు. దేశానికి తనదైన పద్దతిలో చికిత్స చేస్తున్నాడు.. బాలీవుడ్ నటుడు నానా పటేకర్.
రైతు ఆత్మహత్యలను నివారించేందుకు గడిచిన దశాబ్ధికిపైగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న నానా.. తన సంపాదనలో మూడింట రెండో వంతు చనిపోయిన రైతుల కుటుంబాలకు అందిస్తున్నాడు. ఇప్పటివరకు అలా దాదాపు 700 మంది మహిళలకు ఆర్థిక సాయం అందించాడు. నానా కమిట్మెట్కు ముగ్ధులైన ఆయన స్నేహితులు కొందరు మేము సైతం అంటూ విరాళాలు ఇచ్చేందుకూ ముందుకొస్తున్నారట. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురే పిలుపుతో కదిలిన తాను రైతాంగ పరిరక్షణే ధ్యేయంగా జీవిస్తానంటున్నాడాయన.
'రైతే దేశానికి వెన్నెముక అనే నానుడి నిజమనుకుంటే, ఇప్పుడు దేశం వెన్నెముక వంగిపోయింది. ఇంకా చెప్పాలంటే కృషించింది. కొ్ని ప్రాంతాల్లోనైతే పూర్తిగా చచ్చిపోయింది. అలా రైతాంగం పూర్తిగా చచ్చుబడిపోయిన ప్రాంతాల్లో ఒకటి మా మహారాష్ట్రలోని లాతూర్. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్హహత్యలకు పాల్పడుతున్న ప్రాంతమిది. కష్టాల నుంచి విముక్తి పొందొచ్చనుకునే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతడి చావుతో కష్టం పోదు కదా రెట్టింపవుతుంది. చిన్నచిన్న పిల్లలతో వితంతువులైన రైతుల భార్యలను చూస్తే మనసు తరక్కుపోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా విప్లవం వస్తుంది. తనను తాను చంపుకొనే రైతు ఇతరులను చంపలేడని మనం అనుకోవద్దు' అంటాడు నానా పటేకర్.