పంటచేలకు సర్కారు మంట | anty formers policies of chandrababu government | Sakshi
Sakshi News home page

పంటచేలకు సర్కారు మంట

Published Mon, Oct 5 2015 3:57 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

పంటచేలకు సర్కారు మంట - Sakshi

పంటచేలకు సర్కారు మంట

- రైతు రుణం తిరోగమనం... రెండేళ్ల్లుగా లక్ష్యానికి ఆమడదూరం
- ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి నెట్టేసిన టీడీపీ సర్కారు
- ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యం రూ. 37,625 కోట్ల రుణాలు
- ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ. 20,168 కోట్లే...
- వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు.. కొత్త రుణాల ఊసే లేదు
- వడ్డీలేని రుణాలకు బదులు 18 శాతం వడ్డీ మోత
- పెట్టుబడి రాయితీ ఎగవేత.. పంటలు దెబ్బతింటే బీమా లేదు..
- మద్దతు ధరలపై చర్యలు శూన్యం
- ఆత్మస్థైర్యం కోల్పోయి అన్నదాతలు ఆత్మహత్యల బాట
- రైతు కుటుంబాలకు పరిహారమూ తగ్గింపు
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులను తీవ్ర సంక్షోభం వైపు నెట్టివేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పినా ఆచరణలో చంద్రబాబు రుణమాఫీ పేరిట ఇచ్చిన నిధులు.. రైతుల రుణాలకు అయిన వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోలేదు.

దీంతో రుణమాఫీ కాక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక, ప్రైవేటుగా అప్పు పుట్టక.. రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. వారికి ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అన్నదాతలను గాలికి వదిలేసింది. రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. రుణమాఫీ చేయదు.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించదు.. పెట్టుబడి రాయితీకి ఎగనామం పెడుతోంది.. పంటల బీమా అందడం లేదు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వదు...దీంతో అప్పుల పాలై అన్ని విధాలా కుదేలైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. కనీసం వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకూ మనసు రావడం లేదు.

రుణాల మంజూరులో మొండిచేయి
ప్రస్తుత ఖరీఫ్‌లో వ్యవసాయ రంగానికి రూ.37,625 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా... కేవలం రూ.20,168 కోట్లు మాత్రమే రైతులకు అందాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాం నుంచి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకూ బ్యాంకులు లక్ష్యానికి మించి రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తూ వచ్చాయి. ఏటా నిర్దేశించుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా రుణాలు ఇచ్చాయితే తప్ప... ఒక్క ఏడాది కూడా మంజూరులో వెనుకడుగు వేయలేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలోనూ నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ పథకం అమలులో విఫలమై రైతులను బ్యాంకుల ముందు డిఫాల్టర్‌గా నిలబెడుతోంది. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండగా, మరోవైపు వ్యవసాయ రుణాలు పెనుభారమవుతున్నాయి.

బాబు హయాంలో తిరోగమనం

  • రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష్యం మేరకు కూడా రైతులకు రుణాలు అందడం లేదు. వైఎస్ హయాం నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం వరకూ రుణ లక్ష్యాల గమనాన్ని పరిశీలిస్తే.. గత ప్రభుత్వాల హయాంలో లక్ష్యానికి మించి రుణాలు అందగా, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ లక్ష్యం మేరకు కూడా రైతులు రుణాలు పొందలేకపోయారు.
  • ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పేర్కొన్న లెక్కల ప్రకారం... ఖరీఫ్‌లో మొత్తం వ్యవసాయ రంగానికి రూ.37,625 కోట్లు రుణ లక్ష్యం కాగా జూన్ నెలాఖరు నాటికి రూ.20,168 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత రబీలో మొత్తం వ్యవసాయ రంగానికి రూ.27,647 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించి, ఆ తర్వాత సవరించి ఆ లక్ష్యాన్ని కుదించారు.
  • చంద్రబాబు హయాంలో గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో వ్యవసాయ రంగానికి రూ.56,019 కోట్లు రుణాలుగా ఇవ్వాలని
  •  లక్ష్యం కాగా  కేవలం రూ.39,938 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అంటే ఇస్తామన్న దానికంటే రూ.16,081 కోట్లు తక్కువ.
  •  చంద్రబాబు అధికారంలోకి రాక ముందు వ్యవసాయ రుణాలు లక్ష్యానికి మించి రైతులకు అందడం గమనార్హం.  2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 35,654 కోట్లు కాగా లక్ష్యానికి మించి రూ.50,060 కోట్లు మంజూరు చేశారు. అలాగే 2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.47,017 కోట్లు కాగా అంతకంటే ఎక్కువగా రూ.49,774 కోట్లు రుణంగా మంజూరు చేశారు.

 
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో...
 -----------------------------------------
 ఆర్థిక సంవత్సరం        రుణ లక్ష్యం       మంజూరు (రూ.కోట్లలో)
 ------------------------------------------
 2004-05                 23,480            24,346
 2005-06                 28,600            28,899
 2006-07                 37,000            37,056
 2007-08                 42,000           42,773
 

మాఫీ మోసంతోనే బ్యాంకు అప్పు పుట్టని వైనం
లక్ష్యానికి దగ్గరగా కూడా రైతులకు వ్యవసాయ రుణాలు అందకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం నుంచి వెనక్కిపోవడమే కారణం. రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారి కబంధ హస్తాల్లో నలిగిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బ్యాంకు రుణం మాఫీ కాకపోవడమే కాకుండా వడ్డీ భారం మోయలేక పరువు, ప్రతిష్టలు దెబ్బతినడంతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. ఈ మొత్తం అప్పుపై 18 నెలల కాలానికి వడ్డీ చెల్లించడానికే రూ.18 వేల కోట్లు అవసరం. అయితే, చంద్రబాబు ఇప్పటి వరకు రుణమాఫీలో భాగంగా రెండు విడతలగా వడ్డీలో నాల్గోవంతుకు కూడా సరిపోకుండా రూ.7,446 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల ముందు బంగారం కుదువపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నాయి.

పెట్టుబడి రాయితీ ఎగనామం.. కరువు మండలాల కుదింపు

  • చంద్రబాబు సర్కారు విపత్తు బాధిత రైతులకు 2013 సంవత్సరం ముందు నాటి రూ.1,690 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగనామం పెట్టింది. 2013కు ముందు నాటి పెట్టుబడి రాయితీ ఇచ్చేది లేదని, అవి తమ ప్రభుత్వ హయాంలోవి కావని బాబు సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. 2014 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 566 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. పెట్టుబడి రాయితీ భారాన్ని తగ్గించుకోవాలనే కుటిల యోచనతోనే  ప్రభుత్వం కరువు మండలాలను సగానికిపైగా తగ్గించింది.
  • గతేడాది ప్రభుత్వం కుదించి ప్రకటించిన 238 కరువు మండలాల్లో 50 శాతం మించి పంట నష్టపోయిన రైతులకు రూ.1,078.45 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ తదుపరి దాన్ని రూ.692.67 కోట్లకు కుదించింది. ఇలా గతేడాది కరువు రైతులకు ప్రభుత్వం రూ.385.78 కోట్ల పెట్టుబడి ఎగనామం పెట్టింది. చంద్రబాబు సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన 16 నెలల కాలంలోనే విపత్తు బాధిత రైతులకు మొత్తం రూ. 2075.78 కోట్ల పెట్టుబడి రాయితీ (1690 కోట్లు+ 385.78 కోట్లు ) ఎగొట్టేసింది.


మద్దతు ధర  అమలుకు చర్యలేవీ?

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించినా రాష్ట్రంలో వాటి అమలుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,400 కాగా వాస్తవంగా రైతులకు రూ.1,100 కూడా అందడంలేదు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,500 కాగా రైతుల నుంచి రూ.3,500కు కూడా కొనుగోలు చేయడంలేదు. పట్టుగూళ్లకు కిలోకు రూ.300 నుంచి రూ. 350 ధరకు గాను ఇప్పుడు రూ.150 కూడా కొనడం లేదు. పసుపు కిలోకు రూ.150 నుంచి రూ. 250 వరకూ ధర రావాల్సి ఉండగా కనీసం రూ.70 కూడా రావడంలేదు. చెరుకుకు టన్ను ధర రూ.2,300కు రూ.1,540 మాత్రమే వస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు, సేద్యపు ఖర్చులు విపరీతంగా పెరగడం, వ్యవసాయోత్పత్తుల గిట్టుబాటు ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంవల్ల రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు.


పంటల బీమాకు దూరం
బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో రైతన్నలు పంటల బీమాకు నోచుకోని పరిస్థితి నెలకొంది. బ్యాంకు నుంచి పంట రుణం పొందిన సమయంలోనే పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించనున్నారు. రైతులకు గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో పంటల బీమాకు కూడా రైతుల దూరం అవుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పంటల బీమా కింద రైతులు రూ.980 కోట్లు చెల్లించారు. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన బీమా మాత్రం విడుదల కాలేదు.

పరిహారం కూడా విదల్చడం లేదు..
రాష్ట్రంలో రైతాంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకొనిపోయి చేయూత ఇచ్చే వారు లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు.
 బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి రూ.1.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇది చంద్రబాబు సర్కారుకు రైతులపై చిత్తశుద్ధికి తార్కాణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement