ఆత్మహత్యలు వద్దు
- మీ కోసమే బంగారు తెలంగాణ.. రైతులకు సీఎం కేసీఆర్ పిలుపు
- కొత్తగా ఈరోజు వచ్చిన సమస్య కాదు.. రాత్రికి రాత్రి పోదు
- నీళ్లు, నిధులు, నియామకాల్లో 58 ఏళ్ల దగా వల్లే ఈ దుస్థితి
- ఆత్మహత్యల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు
- సాగునీరే అంతిమ పరిష్కారం.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
- మిగతా ‘రుణమాఫీ’ని ఒకే దఫా చెల్లిస్తాం
- రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన రాజధానిగా తీర్చిదిద్దుతాం
- విత్తన కంపెనీలకు మండలాలను దత్తత ఇస్తాం
- రాష్ట్రంలో దాదాపు 200 మండలాల్లో
- కరువు పరిస్థితులు.. త్వరలో కేంద్రానికి నివేదిక
- సలహాల విషయంలో విపక్షాలు నిరాశ కలిగించాయి
- విపక్షాల ప్రశ్నలపై అసెంబ్లీలో సీఎం సుదీర్ఘ సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘‘మీ కోసమే బంగారు తెలంగాణ నిర్మిస్తున్నాం. ప్రభుత్వం చేసేదంతా మీకోసమే. మీ చావును చూడడానికి కాదు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణతో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో 58 ఏళ్లుగా భయంకరమైన దోపిడీ జరగడం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు.
దీనిని చక్కదిద్దడం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఒకేసారి పూర్తి పంట రుణాల మాఫీతోపాటు కృష్ణా, గోదావరిల నుంచి 1,280 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఏటా రూ.25 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయంపై విస్తృత పరిశోధనలు వంటివి చేపట్టామన్నారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. బుధవారం రైతుల ఆత్మహత్యల అంశంపై శాసనసభలో చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. నీళ్ల విషయంలో వికృత క్రీడ సాగిందని, దశాబ్దాలైనా ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తిచేయలేదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో 58 ఏళ్లుగా అతి భయంకర దోపిడీ జరగడం వల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నామన్నారు.
‘‘రైతుల ఆత్మహత్యలు కొత్తగా ఈ రోజే వచ్చిన సమస్య కాదు. రాత్రికిరాత్రి పోదు. 58 ఏళ్ల ప్రాంతీయ వివక్ష వల్లే వైపరీత్యాలు వచ్చాయి. ఓయూ నుంచి వ్యవసాయ వర్సిటీని వేరుచేసి భ్రష్టు పట్టించారు. వ్యవసాయ పరిశోధనలు బంద్ అయ్యాయి. వ్యవసాయ శాఖలో 13 వేల పోస్టులుంటే 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పునాదుల మీదే ఈ దారుణ మారణకాండ వచ్చిపడింది. ఇదంతా ఒక వ్యక్తో, ప్రభుత్వమో చేసింది కాదు.. 58 ఏళ్లుగా నిరంతరం జరిగింది. కాకతీయ రాజులు 75 వేల చెరువులు, నిజాం పాలకులు కోయల్‌సాగర్, ఎగువ మానేరు, డిండి, ఆర్డీఎస్, నిజాంసాగర్, ఘణపూర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రస్తుతం వాటి గతి ఏమైంది? 15 నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
కొరత నుంచి మిగులు..
విద్యుత్ కొరతతోనే రాష్ట్రం ఆవిర్భవించిందని... 30 ఏళ్లుగా కరెంటు కోతలు, బిల్లుల మోతలు, బషీర్‌బాగ్ కాల్పుల రోతలను విన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వాటాలను ఏపీ ఇవ్వకపోయినా, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు. షోలాపూర్-రాయచూర్ కారిడార్ నిర్మాణం పూర్తయినప్పుడు అందులో నుంచి 1,000 మెగావాట్ల లైన్లను బుక్ చేసుకోవాలని నాటి సీఎం కిరణ్ వద్దకు 9సార్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పంపినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పీజీసీఎల్ నుంచి 2,000 మెగావాట్ల స్లాట్లను కొనుగోలు చేశామని చెప్పారు.
గోదావరి, కృష్ణా ఎత్తిపోతల పథకాల కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని, 2018 ముగిసేలోగా వ్యవసాయానికి 24 గంటల త్రిఫేజ్ విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. దేశ విత్తన రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్నా... రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. హైదరాబాద్‌లో 364 విత్తన కంపెనీలున్నాయని, ఒక్కో కంపెనీకి ఒక్కో మండలాన్ని దత్తత ఇవ్వనున్నామని తెలిపారు. యావత్ తెలంగాణ రైతాంగం విత్తనాలు సాగుచేసే దిశగా ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే జూన్ నుంచి సగం మండలాల్లో విత్తనోత్పత్తి ప్రారంభిస్తామని, 100 దేశాలకు విత్తనాలను సరఫరా చేసే సామర్థ్యం సాధిస్తామని చెప్పారు.
మిషన్ కాకతీయ కింద రూ.46,500 కోట్లతో చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, 6 వేల చెరువుల పనులు జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ పనులకు టెండర్లు జరగకముందే కమీషన్‌ల కాకతీయ అంటూ విపక్షాలు ఆరోపించాయని... ఇంత అసహనం, విచిత్ర పోకడలు సరికాదని హితవు పలికారు. ‘‘ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు ఆశించి.. నిరాశ చెందాను. రైతుల ఆత్మహత్యలకు పరిహారం పరిష్కారం కాదని, సమస్య మూలాల్లోకి వెళ్లాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలపాలని హైకోర్టు చేసిన సూచనను స్వాగతిస్తున్నా..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుల కోసం ఎన్నో చర్యలు
1.08 లక్షల వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి రూ.70 కోట్ల రవాణా పన్నును రద్దు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ, ఉద్యన రైతులకు గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన రూ.540 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన 239 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చామని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కోసం గత పాలకుల హయాంలో లాఠీచార్జీలు జరిగేవని, ఇప్పుడు ముందుగానే నిల్వలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యం రాయితీల పరిమితిని హెక్టారు నుంచి 5 హెక్టార్లకు పెంచామన్నారు.
ఒకేసారి రుణమాఫీకి యత్నిస్తాం..
విపక్షాల సూచనల మేరకు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, నిధుల సమీకరణ మార్గాలను అన్వేషిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వాణిజ్య శాఖకు రావాల్సిన రూ.4,500 కోట్ల పన్ను బకాయిలతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెరగడంతో వచ్చే రూ.3 వేల కోట్లు, భూముల క్రమబద్ధీకరణ ద్వారా రూ.1,000 కోట్లు, ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా రెండు మూడు వేల కోట్లను సమీకరించనున్నామని చెప్పారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 176 గోదాములను మాత్రమే నిర్మిస్తే... తాము అధికారంలోకి రాగానే రూ.1,000 కోట్ల నాబార్డు రుణంతో 330 కొత్త గోదాముల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
కొన్ని మార్కెట్ యార్డుల్లో రైతులకు ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించామని, త్వరలో అన్ని మార్కెట్లకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి ఉండేలా పోస్టులను మంజూరు చేశామన్నారు. నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వ్యవసాయ వర్సిటీకి అన్ని గ్రాంట్లను ఇచ్చి పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు రుణం కోసం ప్రతిసారి పాస్‌బుక్, పహాణీల కోసం ఎమ్మార్వోల వద్ద వెళ్లకుండా త్వరలో ఈ-పాస్‌బుక్, ఈ-పహాణీలు పంపిణీ చేస్తామన్నారు.
త్వరలో ‘కరువు’ జాబితా..
రాష్ట్రంలో 175 నుంచి 200 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని... త్వరలోనే కేంద్రానికి మండలాల జాబితాలను పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 31 తర్వాతే ప్రతిపాదనలు పంపాలని కేంద్ర నిబంధనలు ఉండడం వల్లే ఇప్పటివరకు పంపలేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు పోగా రాష్ట్ర వాటా కింద దాదాపు రూ.1,000 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరువు నేపథ్యంలో ఉపాధి హామీ కింద 50 రోజుల అదనపు పనిదినాల మంజూరుకు కేంద్రం హామీ ఇచ్చిందని, త్వరలో మండలాల వారీగా దీనికీ ప్రతిపాదనలు పంపనున్నామని చెప్పారు. వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు త్వరలో మనీ లెండరింగ్ యాక్ట్ తీసుకొస్తామని వెల్లడించారు. వేర్వేరు చోట్ల ఉన్న కమతాల ఏకీకరణ కోసం ‘రద్దోబదలు’ భూముల రిజిస్ట్రేషన్లపై ఫీజులను మాఫీ చేస్తామని తెలిపారు. సాదా కాగితాలపై జరిగిన నిజమైన భూలావాదేవీలపై సైతం రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాస్తామన్నారు.